అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

12.7.2018

ఐసీడీఎస్‌ను పరిరక్షించాలని, అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన 36 గంటల మహాధర్నా బుధవారం ముగిసింది. కార్యకర్తలకు కనీస వేతనం రూ.18వేలివ్వాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్‌ చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో ఆమె మాట్లాడుతూ.. దేశంలో మాతాశిశుమరణాలు, పోషకాహార లోపాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఐసీడీఎస్‌ ఏర్పడిందని చెప్పారు. కానీ ఐసీడీఎస్‌లో నగదు బదిలీ అమలు చేస్తే గ్రామాల్లో పేద ప్రజలు సరుకులు కొనుక్కొని వంట చేసుకుని తినే పరిస్థితి ఉండదన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారానే పోషకాహారాన్ని సరఫరా చేయాలని, అందుకు ఐసీడీఎస్‌ను కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట వర్షంలో గొడుగులు పట్టుకొని ధర్నా చేశారు. నిర్మల్‌ కలెక్టరేట్‌, ఆసిఫాబాద్‌ ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట కూడా ధర్నా జరిగింది. మంచిర్యాల కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీల ధర్నాలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర నాయకుడు బి.మధు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దిరాములు మాట్లాడుతూ.. ఈ మహాధర్నాతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తీరును మార్చుకొని ఐసీడీఎస్‌ను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నిజామాబాద్‌లో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్‌ పాల్గొన్నారు.మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని సీడీపీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. యాదాద్రి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా అనంతరం డీఆర్‌వో మహేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. భద్రాద్రి జిల్ల్లా కొత్తగూడెంలో జరిగిన ధర్నా వద్దకు వచ్చిన సీడీపీఓ సంక్షేమాధికారి ఝాన్సీలక్ష్మీభాయికు వినతిపత్రం అందజేశారు. తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని, మిగతా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారు