అందరికీ విద్య ఎప్పుడో..?

05.07.2018

 

''మన తెలంగాణ విద్యార్థుల సత్తా చాటాలి. ఐఏఎస్‌, ఐపీఎస్‌ల పిల్లలు చదివేలా సర్కారీ బడులను తీర్చిదిద్దుతాం. అందరికీ ఉచిత విద్యనందిస్తాం. కలెక్టర్లు, ఎస్పీలు పాఠాలు చెప్పాలని'' ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎన్నికల ముందు కేజీ టూ పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యనందిస్తామని ఎన్నో ఆశలు కల్పించిన పాలక ప్రభుత్వం ఈనాలుగేండ్లలో చేసిన కృషి నామమాత్రమే. కేజీ, పీజీ విద్య శాంపిల్‌ కార్యక్రమంగానే మిగిలిపోయింది. ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల్ని నిర్మూలిస్తామని, ఫీజుల దోపిడీ కట్టడి చేస్తామని, సమగ్రమైన నియంత్రణ చట్టం తెస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాలన్నీ ఒట్టి బూటకమేనని నాలుగేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రుజువైంది. 
ఈసారికూడా అనేక విద్యారంగ సమస్యలు, సవాళ్ళ నడుమ విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈనేపథ్యంలోనే ప్రభుత్వ హామీల అమలు కోసం విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రభుత్వ విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై 5న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్ర విద్యారంగ అభివృద్ధికి నిర్దిష్ట చర్యలు చేపట్టకుండా పైపై మాటలతో కాలయాపన చేస్తూ ప్రభుత్వం విద్యారంగ పతనానికి కారణమవుతోంది. 
నూతన రాష్ట్రంలో అందరికీ విద్యనందించే లక్ష్యంతో గురుకులాలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యనందిస్తుంటే ప్రభుత్వం ఏమీ చేయలేదని మాట్లాడడం సరైనదేనా? అనే ప్రశ్న రావొచ్చు. నిజమే! గత పాలకులు చేయని పని ఈ ప్రభుత్వం చేయడం అభినందనీయం. ఉన్న గురుకులాలతోపాటు అదనంగా కొత్త గురుకులాలు ఏర్పాటుచేయడాన్ని హర్షించాలి. ఈ గురుకులాల్లో ఎంతమందికి విద్యను అందిస్తున్నారనేదే కీలకం. ఇంత గొప్పగా ప్రచారం చేస్తున్న గురుకులాల్లో కేవలం రెండున్నర లక్షల మంది విద్యార్థులకు మాత్రమే విద్య అందుతుందనే విషయాన్ని మరువకూడదు. రాష్ట్రంలో ఇంకా లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. వారి గురించి పట్టించుకోకుండా గురుకులాల్లో కొందరికే విద్యనందిస్తూ, ఇదే గొప్ప ప్రయత్నమని, ఈ కృషి ద్వారానే రాష్ట్రమంతటా కేజీ టూ పీజీ విద్య అమలవుతున్నట్టు భావించడం పొరపాటు. 
ప్రస్తుతం గురుకుల పాఠశాలల్లో అనేక సమస్యలున్నాయి. కొత్తగా ప్రకటించిన వాటికి నాలుగేండ్లలో కనీసం భవనాలు నిర్మించలేని దుస్థితి. వేలాది బోధనా, బోధనేతర పోస్టులు ఖాళీలు ఉన్నాయి. సరిపడా నిధుల్లేవు. గురుకులాల్లో ఉన్న కొద్దిపాటి సీట్లకోసం లక్షలాది విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. వారందరికి ఎందుకివ్వడం లేదు.
కేజీ టు పీజీ విద్య అనే పేరుతో గత నాలుగేండ్లుగా విద్యారంగ ప్రాధాన్యతను ప్రభుత్వం గాలికొదిలేసింది. అందులో భాగంగానే రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి నిధులు తగ్గిస్తోంది. మొదటి బడ్జెట్‌లో 10-88శాతం, 2015-16లో 9.69శాతం, 2016-17 బడ్జెట్‌లో 8.23శాతం, 2017-18 వార్షిక బడ్జెట్‌లో 8.49శాతం, 2018-19లో 7.61శాతం నిధులు మాత్రమే విద్యారంగానికి కేటాయించింది. ఇది గత బడ్జెట్‌ల కన్నా చాలా తక్కువే. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 30శాతం నిధులు కేటాయించాలనే దానికి పూర్తి విరుద్ధం. ఈ కేటాయింపులతో విద్యారంగం ముందుకెళ్ళడం అసాధ్యం. 
తక్షణమే పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ఖాళీగావున్న ఉపాధ్యాయ, లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలి. ఎయిడెడ్‌ విద్యాసంస్థల ప్రయివేటీకరణ ఆపాలి. అనేకమంది దాతలు, దాతృత్వంతో ఏర్పాటై లక్షలాది మంది విద్యార్థులకు విద్యనందిస్తూ వస్తున్న ఎయిడెడ్‌ విద్యాసంస్థలను నేడు ప్రభుత్వం పట్టించుకోకుండా, వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని కాజేసేందుకు యాజమాన్యాలకు లాభం చేకూర్చే చర్యలు మానుకోవాలి. 
నాలుగేండ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో కేజీ టూ పీజీ అందరికీ విద్య అనే పేరుతో మభ్యపెడుతూ, మరోవైపున కేజీ టూ పీజీ వరకు మొత్తం ప్రైవేటుమయం చేసి, ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసేందుకు సర్వప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ప్రయివేటు కార్పొరేట్‌ విద్యారంగాన్ని కట్టడి చేయకపోవడం, రాష్ట్రంలోకి ప్రయివేటు యూనివర్సిటీలను ఆహ్వానించడం వంటి విధానాలకు పాల్పడుతుంది. విద్యారంగ సమస్యలపై పోరాడుతున్న విద్యార్థులపైన ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ, తన నియంతృత్వ చర్యలతో ఉద్యమాలను అణిచివేయజూస్తోంది. ప్రజాస్వామ్య హక్కులకోసం, విద్యారంగ పరిరక్షణకోసం విద్యార్ధిలోకం రానున్నకాలంలో మరిన్ని సమరశీల పోరాటాలకు సిద్ధంకావాలి.

- కోట రమేష్‌ 
సెల్‌: 9618339490