అనాగరికం

11.07.2018

 

ఈరోజుల్లో కూడా శాంతిభద్రతలకు విఘాతం అనే నెపంతో ఒక వ్యక్తికి నగర బహిష్కరణ శిక్ష విధించడం అందునా ఆ శిక్ష నేరుగా పోలీసు వారే విధించడం ఆశ్చర్యమే కాదు అనాగరికం కూడా. ఎవ్వరైనా తప్పు చేశారని భావిస్తే దానివల్ల సామాజిక ఉద్రిక్తతలు వస్తాయనుకుంటే కేసు నమోదు చేయవచ్చు. అరెస్టు చేయవచ్చు. కోర్టు ముందు నిలబెట్టవచ్చు. తప్పొప్పులపై కోర్టే తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ సహజ న్యాయ సూత్రానికి భిన్నంగా ఎప్పుడో కాలం చెల్లిన నిజాం కాలంనాటి నిబంధన ముందుకు తెచ్చి పోలీసు శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. తాజాగా సినీ విమర్శకులు, జర్నలిస్టు కత్తి మహేశ్‌ శ్రీరామునికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేశారన్న నెపంతో ఆరు నెలల పాటు హైదరాబాద్‌ నగరం నుంచి బహిష్కరించడం ప్రజాస్వామ్యవాదుల విమర్శలకు గురైంది. దీన్ని ప్రసారం చేసిన ఛానల్‌కు నోటీసులిచ్చారు. ఇలాంటి చర్య పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను హరించివేయడమే గాకుండా నిరంకుశత్వానికి, పోలీసు రాజ్యానికి దారితీస్తుంది.
కొద్దిరోజుల క్రితం ఒక ప్రయివేటు టీవీ ఛానెల్‌లో మాట్లాడుతున్న సందర్భంలో శ్రీరామునిపై కత్తి మహస్త్రశ్‌కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆవేశంలో చేసినా, ఆలోచించి చేసినా ఇలాంటి వ్యాఖ్యలు అవాంఛనీయం. సమకాలీనంలో చాలామంది రాజకీయ నాయకులు, సినీ నటులు మహిళలను కించపరిచే వ్యాఖ్యానాలు చేయడం వింటున్నాం. ఈ ఒక్క ఏడాదిలోనే 22మంది మహిళలపై అత్యాచారం చేసినందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ ప్రజా ప్రతినిధులపై కేసులు నమోదయ్యాయి. ఇలాంటి కీచకుల్ని దునుమాడుతూ ఎంత ఘాటుగా వ్యాఖ్యానాలు చేసినా ప్రజలు హర్షిస్తారు. అలాంటి వారిని ఎదుర్కోవడం నేటి సమాజానికి అవసరం. ఇలాంటి దుష్టుల్ని లక్ష్యంగా చేసుకోకుండా పురాణ పురుషులపై దాడిచేయడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. పురాణాలపై హేతుబద్ధ విమర్శలు చేయవచ్చు. చేయాలి కూడా. దానికి బదులుగా అసంకల్పిత వ్యాఖ్యలు చేయడం వలన ఉద్రిక్తతలను రెచ్చగొట్టి రాజకీయంగా లాభపడాలనుకునే సంఘపరివారం లాంటి శక్తులకు ఊతం ఇచ్చినవాళ్ళవుతారు. ఈ విషయంలో కత్తి మహేశ్‌ లాంటి అభ్యుదయ వాదులు మతోన్మాదంపై తమ పోరాటాన్ని మరింత హేతుబద్ధంగా సాగించాలి.
పురాణాలపై విమర్శలు మనకు కొత్తకాదు. దేవుళ్ళను ప్రశ్నించడం కూడా మన సంస్కృతిలో భాగంగానే ఉన్నది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకపోతే దేవుళ్ళను నిందించిన గొప్ప భక్తులు ఉన్నారు. భక్తరామదాసు చరిత్ర చూసినా, అన్నమయ్య గాధ విన్నా మనకీవిషయం బోధపడుతుంది. కత్తి మహేశ్‌ నిర్భయంగా తన మనసులోని మాటను వెళ్ళడించారు. అది తప్పు కావొచ్చు. ఒప్పు కావొచ్చు. కానీ అతని భావాలను వెళ్ళడించే హక్కును నిరాకరించలేం. రాజ్యాంగం అతనికి కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకున్నారు. అసంకల్పితంగా అతను వాడిన కొన్ని పదాలను పట్టుకొని దీన్నొక వివాదంగా మార్చి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయంగా లాభపడాలని సంఘపరివారం తలపెట్టింది. అనుకున్నదే తడవుగా స్వామి పరిపూర్ణానందను రంగంలోకి దించి హైదరాబాదు నుంచి యాదాద్రికి యాత్ర ప్రారంభించారు. దానికి మద్దతుగా జనాన్ని సమీకరించే కార్యక్రమం చేపట్టారు. ఈ ఉద్రిక్తతల నడుమ స్వామి పరిపూర్ణానందను హౌస్‌ అరెస్టు చేసినప్పటికీ సంఘపరివారం వెనక్కి తగ్గలేదు. సోషల్‌ మీడియాలో గంగవెర్రులెత్తి వ్యవహరి స్తున్నారు. కత్తి మహేశ్‌ దళితుడైనందున అందు లోనూ స్థానికేతరులు కావడం బలహీనతగా చేసుకొని కేసీఆర్‌ ప్రభుత్వం నగర బహిష్కరణ శిక్ష విధించింది. ఈ దారుణ చర్యకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులు, లౌకికవాదులు, సామాజిక ఉద్యమాలు కత్తి మహేశ్‌కు అండగా ముందు కొచ్చాయి. 
కత్తి మహేశ్‌ వాడిన అవాంఛనీయ పదాలతో పోల్చుకుంటే అంతకన్నా దారుణంగా మానవత్వమే సిగ్గుపడేలా బూతులు మాట్లాడిన బీజేపీ నాయకులు చాలా మంది ఉన్నారు. అసహనంతో అభ్యుదయవాదులపై భౌతిక దాడులు చేశారు. ఇతర మతాల దేవుళ్ళను నిందించిన వారూ ఉన్నారు. ప్రతిరోజూ మీడియాలో ఇలాంటి వాళ్ళు మనకు కనిపిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ గతంలో కళ్ళు పీకేస్తాం, కాళ్ళు విరిచేస్తాం అని బహిరంగంగా అనేకమందిని హెచ్చరించిన ఘటనలున్నాయి. అయినా ఇలాంటి వారిపై బహిష్కరణ వేటు వేయగలిగిన ధైర్యం కేసీఆర్‌ ప్రభుత్వానికి లేదు. కనీసం కేసులు కూడా నమోదు చేయలేదు. ఇష్టారాజ్యంగా పేలుతున్నా కట్టడి చేసే ప్రయత్నం చేయలేదు. కత్తి మహేశ్‌పై ఇలాంటి చర్య తీసుకోవడం వివక్ష తప్ప మరొకటి కాదు. ఇది బహిష్కరణ వేటు కాదు ఒకరకంగా వెలివేత. సంఘబహిష్కరణ చట్టరీత్యా నేరం. అలాంటి నిబంధన హైదరాబాద్‌ పోలీసు చట్టంలో ఉండడం రాజ్యాంగ విరుద్ధం. ఈ నిబంధనను సంఘ వ్యతిరేక శక్తులను అదుపు చేయడానికి పెట్టారు. ఆ చట్టం పేరే ప్రివెన్షన్‌ ఆఫ్‌ యాంటీ సోషల్‌ ఎలిమెంట్స్‌, డేంజరస్‌ హజార్డ్స్‌ 1980. సంఘ వ్యతిరేక శక్తులను నియంత్రించే చట్టం. ఆనాడే దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నడిచింది. రౌడీలకు బదులు ప్రజాతంత్రవాదులపై దీన్ని ప్రయోగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమైంది. నేడు అదే జరుగుతోంది. ఆ కోవలో కత్తి మహేశ్‌ను చేర్చడం అన్యాయం. అతనొక జర్నలిస్టు, మేధావి. రౌడీలకు వర్తింపజేసే నిబంధనను ఇలాంటి మేధావికి వర్తింపజేయడం అసంబద్దం.
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఘటన నుండి కేసీఆర్‌ ప్రభుత్వం ఏమీ నేర్చుకున్నట్టుగా అనిపించడం లేదు. నాడు విద్యార్థి సంఘాలలో ఉన్న వైరాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ రాసిన లేఖతో రోహిత్‌ వేముల తదితరులను విశ్వ విద్యాలయం నుంచి బహిష్కరించారు. ఈ వేధింపులను తట్టుకోలేక రోహిత్‌ వేముల తనకు తాను బలిదానం చేసుకున్నారు. దీనిపై దేశమంతా స్పందించింది. ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. కులవివక్షతపై నాగరిక సమాజం కన్నెర్రజేసింది. మోడీ ప్రభుత్వంపై ఈ రోజుకీ అది మచ్చగా మిగిలిపోయింది. నాడు కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి తందానా అన్న తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు నేడు కూడా మౌనంగానే ఉండిపోయాయి. నాడు ఏబీవీపీ ఒత్తిడికి లొంగి విశ్వవిద్యాలయాల నుంచి బహిష్కరిస్తే నేడు సంఘపరివారం ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ ప్రభుత్వం కత్తి మహేశ్‌ను బహిష్కరిం చింది. పోలీసులు తీసుకున్న చర్యకు ముందుగా సంఘపరివారం కత్తి మహేశ్‌ను హైదరాబాద్‌ నుండి వెలివేయాలని డిమాండ్‌ చేసింది. మనుధర్మ శాస్త్రాన్ని నమ్మే సంఘీయులు ఇలాంటి డిమాండ్‌ చేయడం ఆశ్చర్యమేమీ కలిగించదు. కానీ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఒక ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా నిరంకుశ చర్యలకు పూనుకోవడం నగరం నుంచి వెలివేయడం సమర్థనీయం కాదు. 
తెలుగు రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్నాటక తరహాలో మతోన్మాద ఉగ్రవాద కేంద్రాలుగా మార్చాలనుకునే సంఘీయుల ఆట సాగనివ్వరాదు. సనాతన సమితి పేరుతో దబోల్కర్‌ మొదలుకొని తాజాగా గౌరీలంకేశ్‌ హత్య వరకు ఇలాంటి మూకల అరాచకాలు మేధావుల్ని, హేతువాదుల్ని బలికొంటు న్నాయి. మూఢనమ్మకాల్ని, సనాతన ధర్మాన్ని ప్రశ్నించేవారు ఎక్కడున్నా వారిపై దాడులు చేయడం, హత్యలు చేయడం ఇలాంటి శక్తులు పనిగా పెట్టుకున్నాయి. ఆ నీచ సంస్కృతిని తెలుగు రాష్ట్రాలకు దిగుమతి చేయడానికి వారు పూనుకున్నారు. బెదిరించడం, దాడులు చేయడం, బూతులు తిట్టడం, ఆఖరికి హత్యలు చేయడం వారు పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి అరాచక శక్తులకు చెక్‌ పెట్టి సామాన్య ప్రజలకు, ప్రజాతంత్ర వాదులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. 

- వి. శ్రీనివాసరావు