ఒకే గుర్తుపై పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం : బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ తమ్మినేని

01.07.2018

మా వాదం బలమైనది

చాలా మంది బీఎల్‌ఎఫ్‌ చిన్న ఫ్రంట్‌, దానిలోని పార్టీలు బలహీనమైనవని అంటున్నారనీ, కానీ మా వాదం సామాజిక న్యాయం చాలా బలమైనదని, ఈ విషయాన్ని ఆ పార్టీలు గుర్తించాలని బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు కలెక్టరేట్ల ముట్టడిలో పాల్గొన్న జనమే నిదర్శనమని చెప్పారు. ప్రజలకు ఎంతో చేసినట్టు కేసీఆర్‌ డబ్బా కొట్టుకుంటున్నారనీ ఎద్దేవా చేశారు.
బీఎల్‌ఎఫ్‌ సర్వేల సందర్భంలో వేలాది మంది తమ సమస్యలపై దరఖాస్తులు ఇచ్చారనీ, వాటన్నింటినీ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయినట్టు చెప్పారు. ఆ సమస్యలను పరిష్కరిస్తామని అధికారులు హామీనిచ్చారనీ, ఆ హామీల అమలు కోసం కూడా ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయనీ, డబ్బు, అగ్రకుల ఆదిపత్యం నడుస్తుందనీ, ఇలాంటి సమయంలో ఓటు విలువను ప్రజలకు వివరించేందుకు బీఎల్‌ఎఫ్‌ రెండు నెలల కార్యక్రమం తీసుకున్నదని చెప్పారు. రాజ్యాధికారం కోసం ఓటు వేసేలా వారిలో చైతన్యం తీసుకొస్తామన్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా బీఎల్‌ఎఫ్‌ ఉంటుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు ఒకే గుర్తుపై పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. సామాజిక న్యాయం కోరే అన్ని పార్టీలు, శక్తులు వేర్వేరుగా ఉండటం కంటే, కలిసి ఉంటేనే మంచిదన్నారు. ఆ ఆలోచనతోనే సీపీఐ, తెలంగాణ జన సమితి, ఇతర వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేసే ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో బీఎల్‌ఎఫ్‌ కన్వీనర్లు మద్దికాయల అశోక్‌, శ్రీనివాస్‌ బహదూర్‌, జానకి రాములు, నాయకులు జలగం సత్యనారాయణ, వనజ పటేల్‌, రమేశ్‌, మన్నారం నాగరాజు, మాస్టర్‌జీ, ఆనంద్‌, రేఖ, చంద్రమౌళి, డాక్టర్‌ రామనర్సయ్య, జాన్‌వెస్లీ, శ్రీరాంనాయక్‌, జయరాం, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.