కత్తిమహేష్‌ వెలివేత.. అనాగరిక చర్య .. -  కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ 

12.07.2018

ప్రజాస్వామ్యాన్ని అప హస్యం చేస్తూ వెలివేతలు, బహిష్కరణలు చేయడం అనాగరిక చర్య అని కేవీపీ ఎస్‌ నిరసన ర్యాలీలో పాల్గొన్న వ్యక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలు విరమిం చుకోవాలని హితవు పలికారు. భావప్రకటన స్వేచ్చ వ్యక్తీకరణలో దోషాలుంటే న్యాయవ్యవస్థకు అప్పీల్‌ చేయాలని అన్నారు. పోలీసులే న్యాయవ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకుని బహిష్కరణలు చేపట్టడం సరికాదన్నారు. ''వెలివేతలు, బహిష్కరణలకు నిరసనగా' బుధవారం కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కాడిగల్ల భాస్కర్‌, టి స్కైలాబ్‌ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతుంటే ప్రజల చేత ఎన్నుకోబడిన దళిత నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు దీన్ని గమనిస్తున్నారన్న విషయాన్ని నేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రజాస్వామిక హక్కులపై గొంతెత్తుతున్న మహిళా నాయకులను చెప్పలేని రీతిలో హిందూత్వ శక్తులు ట్రోలింగ్‌కు పాల్పడుతున్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిపూర్ణనందా ఒక సన్యాసిలా కాకుండా రాజకీయనాయకుడిగా మతాన్ని రెచ్చగొట్టి లబ్దిపొందేందుకు చూస్తున్నారని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోకుండా కత్తి మహేష్‌పై మాత్రం చీకటి చట్టాలను ఉపయోగించడం సరికాదన్నారు. ఈ ర్యాలీలో ప్రతిఘటన వేదిక నాయకులు ఎ సాంబశివరావు, హక్కుల కార్యకర్త దేవీ, డీబీఎఫ్‌ జాతీయ సమన్వయకర్త శంకర్‌, హైకోర్టు న్యాయవాది రమేష్‌, భారత నాస్తిక సమాజం రాష్ట్ర నాయకులు భైరి నరేష్‌, ఎంసీపీఐ నాయకులు మల్లేష్‌, మాల సంక్షేమ సంఘం నాయకులు రాములు, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి దశరథ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.