కనీస మద్దతు... గిట్టుబాటు ధరల్లో ఏది నిర్ణయించారు

11.07.2018

కేంద్ర క్యాబినెట్‌ ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జులై4న సమావేశమై 14 వ్యవసాయ ఉత్పత్తులకు ఉత్పత్తి ఖర్చుపై యాభై శాతం అమ్మకపు ధర నిర్ణయించినట్టు ప్రకటించింది. కానీ ఈ ధరలను పరిశీలిస్తే ఉత్పత్తి ధరలు ఎవరు నిర్ణయించారో ప్రకటించలేదు. అటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం గానీ సాంకేతికంగా ధర నిర్ణయించకుండా, ధర నిర్ణాయక సంఘం 2016-17లో నిర్ణయించిన ఉత్పత్తి వ్యయాన్ని లెక్కలోకి తీసుకున్నారు. ఉత్పత్తి వ్యయంలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి. 1. ఏ2= విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, యంత్రాల అద్దెలు, తదితర నగదు కొనుగోళ్లు 2. ఎఫ్‌ఎల్‌ అనగా కుటుంబ శ్రమ, కూలీల శ్రమ 3. సీ2 అనగా పెట్టుబడికి తెచ్చిన అప్పులపై వడ్డీ భూమి అద్దె ఇతర వ్యయాలు. పై మూడు వ్యయాలను కలిపితే ఉత్పత్తి వ్యయం అవుతుంది. కానీ ధరల నిర్ణాయక సంఘం మొదటి రెండింటి వ్యయాలను కలిపి రైతు పెట్టుబడిగా నిర్ణయించింది. ఏటా ప్రతి రాష్ట్రం మార్చి-ఏప్రిల్‌లో ఆ రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తుల అంచనాలను ధరల నిర్ణయాక సంఘానికి పంపిస్తారు. వారు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలను సగటు చేసి ప్రకటిస్తారు. అలా చేయటం వల్ల ఎక్కువ వ్యయం చేస్తున్న రాష్ట్రాల వారికి నష్టం కలుగుతుంది. డెల్టా ప్రాంతాల వారికి పెట్టిన పెట్టుబడికి అదనపు వ్యయంగా గుర్తించ బడుతుంది. 
ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన ధరలకు మొదటి రెండు వ్యయాలను మాత్రమే గుర్తించి దానిని వ్యవసాయ పెట్టుబడిగా చూపి, యాభై శాతం కలిపి ధరలు నిర్ణయించినట్టు ప్రకటించారు. అందువల్ల మూడవ వ్యయం అనగా బ్యాంకు రుణాలు, వడ్డీ, పంటల కోసం వినియోగించే నీటి పారుదలా విద్యుత్తు వ్యయాలూ భూమి అద్దెలూ గుర్తించలేదు. ఉదాహరణకు 2017-18లో ధాన్యానికి ఏ2 వ్యయం కింద క్వింటాలుకు రూ. 839లు వ్యయం కాగా ఏ2+ఎఫ్‌ఎల్‌కు జరిగిన వ్యయం రూ.1117 గా ఉంది. మూడు వ్యయాలను లెక్కకట్ట (సీ2)గా రూ.1484గా వ్యయం జరిగింది. ప్రధాని 1117ను మాత్రమే తీసుకుని దానికి 50 శాతం కలిపి 1750 క్వింటాలుకు ధర నిర్ణయించారు. వాస్తవానికి రూ.1484ను గుర్తించి అదనంగా 50 శాతం అనగా రూ.742 కలిపి రూ. రూ. 2226 నిర్ణయించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం క్వింటాలు ధాన్యం ఉత్పత్తికి మూడు వ్యయాలు కలిసి రూ 2070గా నిర్ణయించింది. దీనికి యాభై శాతం కలుపగా రూ. 3105గా క్వింటాలు ధర నిర్ణయించాలి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెద్ద తేడా ఉండదు. ఆ విధంగా అన్ని పంటల ఉత్పత్తి ఖర్చును తగ్గించి యాభై శాతం కలిపి ధరలు ప్రకటించారు. ప్రధానం పత్తికి పెట్టుబడి క్వింటాలుకు రూ.4376కాగా దానిని రూ. 3276కు తగ్గించారు. ఆ విధంగా మద్దతు ధరను క్వింటాలుకు రూ.5150గా నిర్ణయించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర వాస్తవానికి ప్రస్తుత పెట్టుబడి అవుతుంది. వారం రోజుల క్రితం డీఏపీ బస్తా రూ.1076 నుంచి రూ.1290కి పెంచారు. విత్తనాలు, డీజిలు, యంత్రాలు, యంత్ర విడిభాగాలు, క్రిమిసంహారక మందుల ధరలను 25 నుంచి 30 శాతం వరకు పెంచారు. ఇది ఈ పెంపుదల 2018-19 పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది. వీటిని గమనంలో పెట్టుకుని పంటల ధరలను ఉత్పత్తిపై యాభై శాతం నిర్ణయించాయి. 
గత నాలుగేండ్లుగా మార్కెట్లలో కనీస మద్ధతు ధరల అమలు జరగలేదు. ప్రతి పంట మార్కెట్‌కు రాగానే నాణ్యతా ప్రమాణాల పేరుతో మధ్య దళారులు, కనీస మద్దతు ధరలకు రూ. 200 నుంచి 400 వరకు కోతలు పెడుతున్నారు. ఆ విధంగా ప్రధానంగా వరి, మొక్కజొన్న, పప్పులు, పత్తి, వేరుశనగ , సోయా పంటలకు తెలంగాణలో రూ. 8490 కోట్లు, ఆంధ్రరాష్ట్రంలో రూ. 9800 కోట్లు రైతులు నష్టపోయారు. అంతేకాక 2017-18 లో ప్రకటించిన కనీస మద్దతు ధరలకు, ఉత్పత్తి వ్యయంపై యాభై శాతం కలుపగా వచ్చిన మొత్తానికి తేడాలు పరిశీలిస్తే... తెలంగాణలో రూ. 24,592 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 29వేల కోట్లు రైతులు నష్టపోయారు. రైతులు నష్టపోయినదంతా వ్యాపారులకు పెట్టుబడిగా పోగుపడింది. ఇప్పటికీ పెట్టుబడి వ్యవసాయ రంగం నుంచే పెట్టుబడి సమీకరణ జరుగుతుందనడానికి ఇది మంచి ఉదాహరణ. వ్యవసాయ ఉత్పత్తులన్నీ పరిశ్రమలకు ముడి సరుకులుగా వినియోగిస్తారు. తక్కువ ధరకు ముడిసరుకులు కొని ప్రాసెస్‌ చేసిన తర్వాత 60 నుంచి వంద శాతం లాభంతో వ్యాపారం చేసి పెట్టుబడులు పోగేస్తున్నారు. ఈ లాభాలను గమనించిన టాటా, బిర్లా, రిలయన్స్‌, ఐటీసీ, అదానీ, బేయర్‌ లాంటి గుత్త సంస్థలు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులోకి ప్రవేశించాయి. 'లాభం ఎక్కడ నుంచి వస్తే డబ్బు అక్కడికి ప్రవహిస్తుంది'. అన్న సూత్రం ఆధారంగా పెద్ద పెద్ద పెట్టుబడిదారులు తమ పారిశ్రామిక పెట్టుబడులను వ్యవసాయ దిశవైపు మళ్లించారు. ఈ కంపెనీలు మైక్రోఫైనాన్స్‌ ద్వారా రైతులకు రుణాలిస్తున్నాయి. వీరి రుణాలకు అడ్డులేకుండా బ్యాంకు రుణాలను తమ పలుకుబడితో తగ్గించారు. సహకార వ్యవస్థను దివాలా తీయించారు. ఈ వ్యాపారంలోకి ఎల్‌అండ్‌టీ సంస్థ కూడా చేరింది. 
మోడీ నిర్ణయించిన ధరలు గుత్త పెట్టుబడిదారులకు లాభాలు కల్గించేవిగానూ, రైతులకు నష్టపరిచేవిగానూ ఉన్నాయి. రైతుల్ని మోసగించడానికి, పెట్టుబడిని తక్కువ చేసి చూపడం జరిగింది. వాస్తవానికి వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయం, సేకరణ రాజ్యాంగ రీత్యా రాష్ట్ర జాబితాలోని ఆయా రాష్ట్రాలలోని పెట్టుబడుల ఆధారంగా లెక్క కడతారు. అమెరికా, జపాన్‌, పాకిస్థాన్‌, బంగ్గాదేశ్‌, లాంటి దేశాల్లో వారి దేశ పెట్టుబడి వ్యయాన్ని బట్టి ధరలు నిర్ణయించుకుంటున్నారు. ప్రపంచ మార్కెట్‌లో ధరలు ఎక్కువ తక్కువలకు అనుగుణంగా ఎగుమతి సబ్సిడీలను వారి వ్యాపారులు కలిగించి రైతులు కాపాడుకుంటున్నారు. కానీ భారతదేశంలో ఆంధ్రా, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో గానీ, విభజన తర్వాత గానీ ఏనాడూ రైతుల ప్రయోజనం కోసం ధరలు నిర్ణయించలేదు. నిర్ణయించన ధరలకు కొనుగోలు చేయలేదు. ఆ విధంగా రైతులు నష్టపోవటంతో రుణగ్రస్థులై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలు అతలాకుతలమవుతున్నాయి. ఇవి ప్రభుత్వానికి తెలియని ఆర్థికావిధానాలేమీ కావు. వ్యవసాయ రంగం నుంచి 86శాతం ఉన్న సన్న, చిన్నకారు రైతులను తొలగించడానికి మార్కెట్‌ ధరలను తగ్గిస్తున్నారు. నిజానికి రైతుల మేలుకోరే ప్రభుత్వాలు మార్కెట్లలో పెట్టుబడిపై యాభై శాతం లాభం వచ్చేవిధంగా ధర నిర్ణయించి అమలు చేయాలి. అందుకు మార్కెట్లలో తక్కువ అమ్మినప్పటికీ మిగిలిన లోటును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భర్తీ చేయాలి. అందుకు మార్కెట్‌ జోక్యం పథకం కింద ప్రతి రాష్ట్రం తగిన మొత్తంలో నిధులు కేటాయించాలి. సరుకు అమ్మిన రోజే లోటు వచ్చిన ధరను ప్రభుత్వాలు చెల్లించాలి. 
అనేక దేశాల్లో పంట వేసేటప్పుడే గిట్టుబాటు ధర నిర్ణయిస్తారు. గిట్టుబాటు ధర అనగా పెట్టుబడిపోగా అదనంగా రైతులకు మిగిలే ఆదాయం. కనీస మద్దతు ధర అనగా పెట్టుబడికి తక్కువగా ధర నిర్ణయించి అమలు జరపడానికి చేసే ప్రయత్నం. అందువల్ల రైతులు గిట్టుబాటు ధరను కోరుకుంటున్నారు. గిట్టుబాటు ధర ఏర్పాటుకు ముసాయిదా చట్టాన్ని రైతు సంఘాలు ప్రవేశపెట్టాయి. ఆ చట్టాన్ని ఆమోదించాలి. అంతే కానీ 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొంత ధరను పెంచినట్టు ప్రకటించటం రైతులను మోసగించటమే.. పైగా వంద రకాల పంటలు పండిస్తున్న పద్నాలుగు రకాలకే ధరలు నిర్ణయించటం మిగిలిన పంటలను అతి హీనపు ధరలకు కొనుగోలు చేయటం అనగా మధ్య దళారులు వేల కోట్లు సంపాదిస్తున్నారు. కూరగాయలతో సహా పండ్లు., పూలు, పాలు తదితర ఉత్పత్తులకు కూడా గిట్టుబాటు ధర నిర్ణయించాలి. అప్పుడే రైతులకు మార్కెట్‌లో ధర అడిగే హక్కు ఏర్పడుతుంది. రూపాయికి కిలో టమాటా, ఉల్లి, దొండ, బెండ కాయలు అమ్ముకున్న పరిస్థితులు మళ్లీ రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. బొప్పాయి, నిమ్మా వంటి పండ్ల తోటల నుంచి రైతులకు ఆదాయం వచ్చే విధంగా ధరలు నిర్ణయించాలి. అందువల్ల ప్రస్తుతం ప్రధాని మోడీ అధ్యక్షతన ప్రకటించిన ధరలను పునపరిశీలించి అన్ని పంటల ఉత్పత్తి వ్యయాన్ని ఆయా రాష్ట్రాల్లో లెక్కగట్టి అందుకు యాభై శాతం కలిపి ధరలు నిర్ణయించేవిధంగా విధాన రూపకల్పన చేయాలి. 

సరుకు ఏ2+ఎఫ్‌ఎల్‌ సీ2 2017-18 2018-19 పెరిగిన ప్రభుత్వం
పేరు వ్యయం వ్యయం కనీస మద్దతు ప్రధాని ధరలు ప్రకటించిన
17-18 17-18 ధరలు ప్రకటించిన మొత్తం శాతం ఉత్పత్తిపై
మద్దతుధరలు ఆదాయశాతం
పెసర 4286 5700 5575 6975 1400 25.11 50.00
శనగలు 3265 4517 5400 5600 200 3.70 62.89
వేరుశనగ 3159 4089 4450 4890 440 9.89 50.00
సన్‌ఫ్లవర్‌ 3481 4256 4100 5388 1288 31.42 50.01
సోయా 2121 2921 3050 3399 349 11.44 50.04
నువ్వులు 4067 5706 5300 6249 949 17.61 50.01
కుసుమ 1788 5108 4050 5877 1827 45.11 50.01
మీడియం
పత్తి లాంగ్‌ 3276 4376 4020 5150 1130 28.11 50.01
... ... 4320 4540 1130 26.16 58.75
వరి కామన్‌ 1117 1484 1550 1750 200 12.90 50.09
ఏ గ్రేడ్‌ ... ... 1590 1790 120 11.32 51.80
జొన్న 1556 2089 1700 2430 730 42.94 50.09
హైబ్రీడ్‌జొన్న ... ... 1723 2450 725 42.03 51.33
సజ్జ 949 1278 1425 1950 525 36.84 96.97
రాగి 1861 2351 1425 1950 525 96.84 96.97
మొక్కజొన్న 1044 1396 1425 1700 275 19.30 50.31
కందులు 3318 4612 5450 5675 225 4.13 65.31 

- సారంపల్లి మల్లారెడ్డి