కమ్ముకొస్తున్న సంక్షోభ మేఘాలు!

13.06.2018

గతంలో చివరిసారిగా 2013లో రూపాయి విలువ తీవ్రస్థాయిలో పడిపోయినప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ యావత్తూ అతలాకుతలమైంది. ఆర్థిక వ్యవస్థలో జరిగే అభివృద్ధితోపాటు నిలకడగా పెరిగే పేదరికానికి దీనితో సంబంధం లేదు. కరెంటు ఖాతా లోటు కొనసాగుతున్నప్పటికీ దేశంలోని ఆర్థిక వ్యవస్థలో అప్పటి నుంచి ఎటువంటి అంతరాయం ఏర్పడకపోవటానికి రెండు ప్రత్యేక కారకాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధర పడిపోయి ఉండటంవల్ల చమురు దిగుమతి వ్యయం తక్కువగా వుండి కరెంటుఖాతా లోటు పరిమితమైంది. అమెరికాలో వడ్డీ రేట్లు తక్కువగా ఉండటంవల్ల దేశంలోకి ఫైనాన్స్‌ ప్రవాహాలు సునాయాసంగా జరిగాయి. దీనితో ప్రపంచీకరింపబడిన ద్రవ్య పెట్టుబడికి ఎక్కువ వడ్డీ వచ్చే భారతదేశం వంటి దేశాలకు నిధులను మళ్ళించటం ఆకర్షణీయంగా మారింది.
ఇటువంటి పరిస్థితి ఎల్లకాలం కొనసాగదని అర్థం చేసుకోవటానికి తెలివితేటలు అవసరం లేదు. వడ్డీమీద బతికే ద్రవ్య పెట్టబడి ప్రయోజనాలను సంతృప్తిపరిచేందుకు అమెరికా వడ్డీ రేట్లను పెంచవలసి ఉంటుంది. అమెరికాలో వడ్డీ రేట్లు ఇప్పటికే పెరుగుతున్నాయి. ఈ ప్రక్రియ వేగం పుంజుకుంటే భారతదేశ విదేశీమారక చెల్లింపుల శేషం(బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌) సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ఈ అలజడి ముందుకు రాకమనుపే మరో సమస్య ముందు కొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో తీవ్రస్థాయిలో పెరిగిన చమురు ధరలు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించాయి. ఆర్థిక వ్యవస్థ 'సాధారణ స్థితి'లో ఉన్నప్పుడు, ఇటువంటి స్థితిలో గందరగోళం ఏర్పడినప్పుడు దేశంలో మరింతగా నష్టపోయే కష్టజీవుల జీవన ప్రమాణాలమీద తీవ్రస్థాయి దాడి జరుగుతుంది. అలా జరుగుతున్న దాడిలో ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒక భాగం. 
2014 తరువాత చమురు ధర బ్యారెల్‌ 80డాలర్లకు చేరటం ఇదే తొలిసారి. దీనిలో స్పెక్యులేటివ్‌ అంశం కూడా ఉన్నది. ఇరాన్‌తో చేసుకున్న అణ్వస్త్ర ఒప్పందాన్ని రద్దుచేసి ఆ దేశంపై ఆంక్షలను విధించాలనే అమెరికా నిర్ణయం, దీనితోపాటు వెనిజులాలో మితవాదులకు కొమ్ముకాస్తూ ఆ దేశం ఆర్థిక వ్యవస్థను అమెరికా ఛిన్నాభిన్నం చేయటం వంటి కారణాలు అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుదలలో స్పెక్యులేటివ్‌ అంశం చొరబడటానికి దోహదం చేస్తున్నాయి. అయితే స్పెక్యులేటివ్‌ అంశాల కారణంగానే కాకుండా అంతిమంగా చమురు ఉత్పత్తి చేసే దేశాల సంఘం ఒపెక్‌ చమురు ఉత్పత్తిని నియంత్రించగలగటం చమురు ధరలు పెరగటానికి ప్రధాన కారణం.
చాలాకాలంపాటు ఒపెక్‌ దేశాలమధ్య విబేధాలు ఉండేవి. పడిపోతున్న చమురు ధరలను స్థిరీకరించటానికి ఉత్పత్తిని నియంత్రించవలసి ఉంటుంది. అలాజరిగితే అమెరికా ఉత్పత్తిదారులు షేల్‌ ఆయిల్‌తో సహా ప్రపంచ చమురు మార్కెట్‌లో ప్రధాన వాటాను కైవసం చేసుకుంటారని భయపడి సౌదీ అరేబియా తన ఉత్పత్తిని నియంత్రించుకోవటానికి అంగీకరించలేదు. ప్రపంచ చమురు మార్కెట్‌లో చమురు ధర తక్కువగావుంటే అనేకమంది అమెరికా ఉత్పత్తిదారులకు చమురును ఉత్పత్తిచేయటం లాభసాటికాకుండా పోతుంది. దానితో అసలు చమురు ఉత్పత్తి చేయటమే ఆపేస్తారు. అయితే ఒపెక్‌లోని ఇతర సభ్యదేశాలు ధరలను పెంచటానికి ఉత్పత్తి తగ్గించాలని కోరుతున్నాయి. కానీ సౌదీ అరేబియా అందుకు అంగీకరించలేదు. అయితే సౌదీ అరేబియా కూడా చమురు ఎగుమతులపై ఆధారపడిన దేశం. చమురు ధరలు పడిపోవటంవల్ల ఆర్థిక వ్యవస్థ వత్తిడికి గురవుతున్నదని ఆ దేశం గ్రహించింది. దేశ ప్రజలకు ఇస్తున్న రాయితీలను, ఇతర బదిలీలనూ ఆపటంతో రాచరిక పాలనకు ప్రజల రాజకీయ మద్దతు కొరవడే ప్రమాదాన్ని సౌదీ అరేబియా ఎదుర్కొనే అవకాశం ఏర్పడింది.
కాబట్టి 2015 డిసెంబరులో సౌదీ అరేబియా తన అభిప్రాయాన్ని మార్చుకుంది. చమురు ఉత్పత్తి తగ్గించుకోవాలనే నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. దీనిని మరొక ప్రధాన చమురు ఉత్పత్తిదారైన రష్యా కూడా అంగీకరించింది. ఈ ఒప్పందం అమలు అవుతుందా అనే సందేహం అప్పట్లో చాలామందికి ఉండేది. పెరిగిన చమురు ధరలనుబట్టి చూసినప్పుడు ఆ ఒప్పందం అమలయినట్టుగా కనిపిస్తోంది. ఈసారి సౌదీ అరేబియా తన చమురు ఉత్పత్తి తగ్గించుకోవటమే కాకుండా బ్రెంట్‌ క్రూడ్‌ చమురు బ్యారెల్‌ ధర 100డాలర్ల వరకూ పెంచటానికి కూడా సుముఖంగా ఉన్నది. ఆ స్థాయి ధరలలో అమెరికా ఉత్పత్తికూడా విస్తృతమౌతుందనటంలో సందేహం లేదు. దానితో చమురు ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. అంతిమంగా చమురు ధర ఎక్కడ స్థిరీకరింపబడుతుందో చూడాలి. అయితే 2018లోను, 2019లో చాలా వరకూ చమురు ధరలు తగ్గే అవకాశం లేదనే చెప్పాలి. దీని ప్రభావంతో ఎన్నో ముడిసరుకుల ధరలు పెరుగుతాయి. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అంతిమంగా తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి.
భారతదేశంలో ఈ వత్తిడి ఇప్పటికే కనపడుతున్నది. చమురు దిగుమతులపై పెరిగే భారాన్ని తక్షణమే ప్రజలమీదకు బదిలీ చేయాలనే ప్రభుత్వ మూర్ఖ విధానంతో మే నెల మధ్యనుంచీ పెట్రోలు, డీజిల్‌ ధరలు బాగా పెరిగాయి. చమురు ధరలు పెరగటంతో ద్రవ్యోల్బణంపై ప్రభావం పడటంతోపాటుగా విదేశీమారకపు చెల్లింపుల శేషానికి సంబంధించిన కష్టాలు కూడా మొదలవుతాయి. బ్రెంట్‌ క్రూడ్‌ చమురు ధర 80డాలర్లకు చేరితే మన ఆర్థిక వ్యవస్థకు దిగుమతి బిల్లు రూపంలో అదనంగా 5వేల కోట్ల డాలర్ల (మూడున్నర లక్షల కోట్ల రూపాయలు) భారం పడుతుంది. నిజానికి 2018-19లో కరెంటు ఖాతా లోటు స్థూల జాతీయోత్పత్తిలో 2.5శాతానికి పెరుగుతుందని ఆశిస్తున్నారు.
దేశంలోకి ద్రవ్య ప్రవాహాలు తగినంత మోతాదులో వస్తుంటే దీనితో తక్షణం వచ్చే ఇబ్బందేమీ ఉండదు. అయితే భారత ఆర్థిక వ్యవస్థలోకి వస్తున్న ఫైనాన్స్‌ తిరుగుముఖం పట్టటం మొదలయింది. రూపాయి విలువ పడిపోకుండా చూడటం కోసం రిజర్వ్‌ బ్యాంకు విదేశీ మారకపు నిధులను ఖర్చుచేసి ప్రయత్నిస్తున్నప్పటికీ రూపాయి విలువ డాలరుకు 68రూపాయలు అయినదంటే ద్రవ్య పెట్టుబడి దేశంలో తిరుగుముఖం పడుతున్నదనటానికి సంకేతం. అంతకుముందు ఫైనాన్స్‌ అంతఃప్రవాహాలు కరెంటు ఖాతాలోటు పూడ్చటానికే కాకుండా విదేశీద్రవ్య నిల్వలకు అదనంగా చేరేవి. తత్ఫలితంగా విదేశీ కరెన్సీ నిల్వలు కొన్ని నెలల క్రితం 400బిలియన్‌ డాలర్ల పరిమాణాన్ని దాటాయి. అయితే విదేశీమారక ద్రవ్య అంతఃప్రవాహాల వేగం తగ్గినందున ప్రస్తుతం ఈ నిల్వలు కొంతమేరకు కుదింపుకు గురయ్యాయి. 
రూపాయి విలువ తగ్గటంవల్ల విదేశీమారక ద్రవ్య నిధుల నికర వ్రవాహాలు మరింతగా తగ్గుముఖం పట్టటమే కాకుండా ఉన్నవి కూడా బయటకుపోయే అవకాశం ఏర్పడింది. తగ్గిన రూపాయి విలువ రెండు కారణాలచేత తన విలువ మరింతగా తగ్గే పరిస్థితులను సృష్టిస్తుంది. మొదటిది, దేశంలో విదేశీమారకపు చెల్లింపుల శేషానికి సంబంధించి సమస్యలు కొనసాగటం... రెండవది, దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ వేగం విదేశాలలో కంటే పెరగటం వల్ల రూపాయి మారకపు విలువ పడిపోతుంది. పెరిగిన చమురు ధరలను తక్షణమే ప్రజలపైకి బదిలీచేయటంవల్ల భారతదేశంలో ఇది జరుగుతున్నది.
దీనితో రూపాయి విలువ మరింతగా తగ్గటానికి దారితీస్తుంది. అలా రూపాయి విలువ న్యూనీకరణ (డిప్రిషియేషన్‌) ఒక విషవలయంలో ప్రవేశిస్తుంది. అయితే ఒకవేళ చమురు ధర బ్యారల్‌ 80డాలర్లవద్ద స్థిరపడినప్పటికీ ఇలా రూపాయి విలువ న్యూనీకరణ ఎక్కువ అవటంవల్ల చమురు ధర పెరుగుతుంది. ఇలా పెరిగిన ధరను తక్షణమే ప్రజలపైకి బదిలీచేసే ప్రభుత్వ విధానం ఉండటంవల్ల ద్రవ్యోల్బణం కొనసాగుతూనే ఉంటుంది. అలా ద్రవ్యోల్బణం నిరంతరం కొనసాగటంవల్ల వాస్తవంలో రూపాయి విలువ మరింతగా తగ్గుతుందని ఆశించటం జరుగుతుంది.
ఆశించినవి జరగటం మొదలయినప్పుడు బలహీన ఆర్థిక వ్యవస్థలు అటువంటి విషవలయంలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. విదేశీ మారకపు చెల్లింపుల శేషాన్ని నిర్వహించటం కోసం ద్రవ్య పెట్టుబడి అంతర్‌ ప్రవాహాలు అవసరం అయినందున వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నది. దానితో అటువంటి విషవలయంలో చిక్కుకునే ప్రమాదం ఆర్థిక వ్యవస్థకు నేడు పొంచివుంటుంది.
దృశ్యంలో అదే దిశలో పయనించే మరో అంశం కూడా ఉన్నది. ఈ అంశం వడ్డీ రేట్లకు సంబంధించినది. ఒకవేళ మిగిలిన విషయాలలో మార్పులేనప్పుడు భారతదేశంలో వడ్డీ రేట్లను పెంచి ఈ విషవలయాన్ని ఛేదించవచ్చు. అయితే మిగిలిన విషయాలు అలానే ఉండబోవు. పెరిగిన చమురు ధరలు అమెరికాసహా అన్నిచోట్లా ద్రవ్యోల్బణం పెరగటానికి ప్రేరకంగా ఉంటాయి. సమిష్టి డిమాండ్‌ను తగ్గించటానికి, నిరుద్యోగాన్ని పెంచటానికి అమెరికా వడ్డీ రేట్లను పెంచవలసి ఉంటుంది. ద్రవ్యోల్బణానికి పరిహారంగా వేతనాలు పెంచమని కార్మికవర్గం డిమాండ్‌ చేయకుండా చూడటానికి అలా చేస్తారు. అలా చేసినప్పుడే కార్మిక వర్గ ప్రయోజనాలకు విరుద్ధంగా ద్రవ్యోల్బణాన్ని 'నియంత్రించటం' జరుగుతుంది. అమెరికాలోను, ఇతరచోట్లా అలా వడ్డీ రేట్లు పెరగటంవల్ల ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం తీవ్రమౌతుంది. అయితే దీనితోపాటుగా కరెంటు ఖాతా లోటును భర్తీ చేయటానికి భారతదేశంలోకి తగినంత ద్రవ్య పెట్టుబడుల ప్రవాహం రాకుండా ఇది అడ్డుపడుతుంది. 
అమెరికాలో పెంచిన వడ్డీ రేట్లకంటే భారతదేశం కూడా తన వడ్డీ రేట్లను పెంచితే దేశం ద్రవ్య పెట్టుబడుల అంతర్‌ ప్రవాహాల ఆకర్షణీయ గమ్యంగా మారుతుంది కదా అని ఎవరైనా అనవచ్చు. అయితే ఒక పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకం కాకుండా ఉండాలంటే ఒక పరిమితి దాటి వడ్డీ రేట్లను పెంచటం కుదరదు (ఉదాహరణకు వడ్డీ రేటు ఎక్కువగా వున్నప్పుడు లాభం రేటును పెంచుకోవటం కుదరదు). కాబట్టి అమెరికాలో వడ్డీ రేట్లు పెరగటంతో భారతదేశంలోని వడ్డీ రేటుతో గల తేడా తగ్గిపోతుంది. వడ్డీ రేటు నుంచి ద్రవ్యోల్బణం రేటును తీసివేసినప్పుడు 'వాస్తవ' వడ్డీ రేటు వస్తుంది. ఈ కారణంచేత పెరుగుతున్న కరెంటు ఖాతా లోటును భర్తీచేయటానికి కావలసిన నికర ద్రవ్య పెట్టుబడి అంతర్‌ప్రవాహాలు తగినంతగా ఉండే అవకాశం తక్కువే. 
విశృంఖలంగా మార్కెట్లను వదలివేసే ఇప్పటి విధానమే కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటుందని పైన వివరించిన విషయాలు తెలియజేస్తున్నాయి. అయితే అటువంటి మార్కెట్‌ విశృంఖలతను నిలువరించటమంటే నయావుదారవాదం నుంచి ఉపసంహరించుకోవటమే. కాబట్టి అది జరగాలంటే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిదారీ వర్గ ప్రతిఘటనను, దేశంలోని బడా బూర్జువా వర్గ ప్రతిఘటనను అధిగమించవలసి ఉంటుంది. 

- ప్రభాత్‌ పట్నాయక్‌ 
సెల్‌: 8886396999
అనువాదం: నెల్లూరు నరసింహారావు