కలెక్టర్‌, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట 36 గంటల ధర్నాలు ప్రారంభం - అంగన్‌వాడీలకు కనీస వేతనమివ్వాలి : సీఐటీయూ

11.07.2018

మోడీ నిర్ణయం లక్షలాది మంది అంగన్‌వాడీల బతుకులను ప్రమాదంలో పడేసిందని పలువురు వక్తలు వాపోయారు. ఐసీడీఎస్‌ పరిరక్షణ, కనీస వేతనం అమలు, పింఛన్‌, ఉద్యోగ భద్రత, తదితర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆలిండియా కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్‌, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట 36 గంటల ధర్నాలను మంగళవారం ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీగా వెళ్లి ధర్నా చేపట్టారు. అనంతరం మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన సభలో తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ.. నిరుపేదల పిల్లలకు భోజనం, చదువు చెప్పే ఐసీడీఎస్‌కు బడ్జెట్‌లో నిధులను కేంద్రం భారీగా తగ్గిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్‌ను స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తే సహించేది లేదన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు మాట్లాడుతూ... అంగన్‌వాడీలను ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.18వేలివ్వాలని డిమాండ్‌ చేశారు. 
ఖమ్మం కలెక్టరేట్‌ ఎదుట 36గంటల మహాధర్నా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు ప్రారంభించి మాట్లాడారు. వేతనాలను పెంచుతామని చెప్పిన సీఎం కేసీఆర్‌ చివరకు అంగన్‌వాడీలను నిరాశకు గురిచేశారని అన్నారు. హక్కుల కోసం సెప్టెంబర్‌ 5న చలో ఢిల్లీకి లక్షలాది మంది కార్మికులు కదిలి రావాలని పిలుపునిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌ వద్ద గల ధర్నాచౌక్‌లో 36 గంటల మహాధర్నా చేపట్టారు. సుమారు 300 మంది కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు సంఘీభావం తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్‌ వద్ద సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమ మాట్లాడుతూ...అంగన్‌వాడీలను ఇంటికి పంపించే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో ధర్నానుద్దేశించి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్‌బాబు మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌, మహబూబాబాద్‌ ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయం, భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. భూపాలపల్లిలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి మధు మద్దతు తెలిపారు. సిద్దిపేట కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పద్మ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రేవంత్‌, మెదక్‌లో యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సమ్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బాలమణి మాట్లాడారు. మేడ్చల్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేసి డీఆర్‌ఓ విజయకుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు కె.నిర్మల తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాకు టీమాస్‌ జిల్లా చైర్మెన్‌ నక్క విజరు మద్దతు తెలిపి మాట్లాడారు. పెద్దపల్లి కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీలు ధర్నా చేసి జాయింట్‌ కలెక్టర్‌ వనజాదేవికి వినతిపత్రాన్ని అందజేశారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మల్లేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్‌ రాజేందర్‌ మాట్లాడారు. నిర్మల్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్‌కే.దాదేమియా ఆధ్వర్యంలో డీఆర్‌ఓ రమేశ్‌రాథోడ్‌కు వినతిపత్రం అందజేశారు. కొమురం భీమ్‌ జిల్లా ఆసిఫాబాద్‌ ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీలు ధర్నా చేశారు. రంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట 100 మంది అంగన్‌వాడీలు, వికారాబాద్‌ జిల్లా తాండూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట 70 మంది అంగన్‌వాడీలు ధర్నాలు చేసి వినతిపత్రాలు అందజేశారు. నాగర్‌కర్నూల్‌లో గాంధీ పార్కు నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వెళ్లి డీఆర్‌ఓకు వినతి పత్రం అందజేశారు. 
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసులు మాట్లాడారు. వనపర్తి కలెక్టరేట్‌ ఎదుట యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు రత్మమ్మ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహించారు.