కార్పొరేట్లకు ఇవ్వొద్దు.. మా బతుకులు ఆగం చేయొద్దు - కేంద్ర మంత్రుల కార్యాలయాలవద్ద అంగన్‌వాడీల ఆందోళన

11.07.2018

 

దేశవ్యాప్తంగా లక్షలాది మంది అంగన్‌వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. వివిధ రాష్ట్రాల్లోని కేంద్ర మంత్రుల కార్యాలయాలు, జిల్లా కేంద్రాల్లో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. జాతీయ డిమాండ్ల దినంగా పాటించాలని అఖిల భారత అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సమాఖ్య (ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌) ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, అసోం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌, జార్ఖండ్‌, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, త్రిపుర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ తదితర 22 రాష్ట్రాల్లో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. వేతనాలు పెంచుతా మంటూ బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చేసిన హామీ నెరవేర్చకపోగా... ఐసీడీఎస్‌లకు బడ్జెట్‌ కేటాయింపులు తగ్గించిందని వారు ఆరోపించారు. లబ్దిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ, అంగన్‌వాడీల స్థానంలో నర్సరీ స్కూళ్లను ప్రవేశపెట్టడం, ఐసీడీఎస్‌ బడ్జెట్‌ను 60 శాతం నుండి 25 శాతానికి కుదించడం, అంగన్‌వాడీ కేంద్రాలను కార్పొరేట్‌ చేతుల్లో పెట్టే ప్రయత్నాలను వారు వ్యతిరేకి స్తున్నారు. ఈ సమస్యల పరిష్కారానికిగాను ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌ సంతకాల సేకరణ కార్య క్రమం చేపట్టింది. మూడు కోట్ల సంతకాలను ప్రధాని మోడీకి సమర్పిం చనున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంగన్‌ వాడీలకు ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌ అభినందనలు తెలిపింది.
తదుపరి కార్యాచరణ
ఏఐకేఎస్‌, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 9న జరిగే జైల్‌భరో కార్యక్రమంలో అంగన్‌వాడీలు పాల్గొననున్నారు. సీఐటీయూతో కలసి సామూహిక జాగరణ్‌ కార్యక్రమం. సెప్టెంబరు 18న జరిగే కార్మిక, కర్షక సంఘర్ష్‌్‌ ర్యాలీకి 50 వేలమంది అంగన్‌వాడీలను సమీకరించనున్నట్టు ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌ ప్రకటించింది.