కేయూ భూకబ్జా పాపం ఎవరిది?

13.06.2018

 

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కాకతీయ యూనివర్సిటీ పోరాటనేల నేడు భూకబ్జాదారుల కబంధ హస్తాలలో అన్యాక్రాంతమవుతున్నది. రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ తరువాత అగ్రభాగాన నిలిచి, ఉత్తర తెలంగాణలో పేద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుతూ అతిపెద్ద విద్యా నిలయంగా ఉంది. మొదట ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్‌గా ఉన్నప్పుడు 1968లో 1018 ఎకరాల భూసేకరణ జరిగింది. ఇదే భూములు 1976లో కాకతీయ యూనివర్సిటీ స్థాపనకు, ఉపయోగించుకున్నారు. ఈ సేకరించిన భూమిలో కొంత ప్రభుత్వ భూమి, కొంత రైతుల నుంచి సేకరించి వారికి నష్టపరిహారం చెల్లించారు. 1980లో ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వ నిర్మాణానికి సర్వే నెం.413 లోని భూమిలో నిర్మాణం జరిగింది. దీన్ని అదనుగా తీసుకున్న కబ్జాదారులు కాల్వకు ఇరువైపుల సుమారుగా 43 ఎకరాల భూమి కబ్జాచేసారు. ఈ కబ్జాదారులకు నాడు నేడు కొంతమంది రాజకీయ నాయకుల సహకారం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. నాలుగేండ్ల క్రితం యూనివర్సిటీ భూమి ఎస్‌డీఎల్‌సీఈ నుంచి డబ్బాలు వైపు వెళ్లే రోడ్డు విస్తరణ జరుగగా ఇరువైపుల భూమిని కాకుండా కేవలం యూనివర్సిటీ భూమి ఉపయోగించారు. దీనివలన దాదాపు 4 ఎకరాల భూమిని కోల్పోవడం జరిగింది. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేయగా అప్పటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగి కమిషన్‌ ఏర్పాటు చేసి భూసర్వే నిర్వహించి అక్కడక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసారు. యూనివర్సిటీ చుట్టూ సర్వే నెం.412, 413 గల భూమి ఎటువంటి ప్రహరీ గోడలు నిర్మించకపోవడంతో కబ్జాదారులు హెచ్చరిక బోర్డులను తొలగించి నిర్మాణం చేపడుతున్నారు. యూనివర్సిటీ విద్యార్థులుగా మేం ఇప్పుడున్న వీసీ ప్రొ|| సాయన్న రిజిస్ట్రార్‌ ప్రొ|| పురుషోత్తంకు రెండేండ్లుగా వినతి పత్రాలు సమర్పించి భూసర్వే చేయించి ప్రహరీ నిర్మించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకొనే దాఖలాలు లేవు. కాని కోటి రూపాయలతో కార్లు కొన్నారు. కేయూలో 46 విభాగాలు ఉండగా, ఇంజనీరింగ్‌, సెల్‌ఫైనాన్స్‌ కోర్సు విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యం లేదు. ఖాళీగా ఉన్న భూములలో భవనాలు నిర్మించక కబ్జాకు గురవుతున్నాయి. ముఖ్యంగా భూములు అన్యాక్రాంతం కావడానికి యూనివర్సిటీ పాలకులే కారణం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ నాయకులే కబ్జాలకు పాల్పడుతున్నారు. దీనికి లోపల అధికారులు, కబ్జాదారులకు సహకరిస్తున్నారనే సందేహం ఉంది. ఎందుకంటే 24 గంటలు సెక్యూరిటీ పర్యవేక్షణలో ఉండే యూనివర్సిటీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత వారి మీద లేదా? కబ్జాదారులు ఇంత స్వేచ్ఛగా కబ్జా చేస్తుంటే అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం కండ్లున్న కబోదిలా ప్రదర్శించడం విడ్డూరంగా ఉంది. యూనివర్సిటీ స్థాపన నుంచి నేటి వరకు భూకబ్జాపై విచారణ చేసి ఎవరెవరి హయాంలో భూమి కబ్జాకు గురి అయిందో విచారించి ఆ అధికారులు, కబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలి. యూనివర్సిటీ భూములను కాపాడుకోకుంటే భవిష్యత్‌ తరాలకు ఉన్నత విద్యా అంధకారంలో పడే ప్రమాదం ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. యూనివర్సిటీని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేనిపక్షంలో యూనివర్సిటీ విద్యార్థులుగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని హెచ్చరిస్తున్నాము.

- మోటుపల్లి చిరంజీవి, సెల్‌: 8978703768