కౌలు రైతుల ఆత్మహత్యలు కనిపించటం లేదా..? - ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షులు సారంపల్లి 

09.07.2018

కౌలు రైతుల ఆత్మహత్యలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించటం లేదా? అని ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ... రాష్ట్రంలోని 14 లక్షల మంది కౌలు రైతుల్లో వెనుకబడిన, బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారే అత్యధికంగా ఉన్నారని తెలిపారు. రుణాలు, ఎరువులు, విత్తనాలు అందక వీరు నానా ఇబ్బందులూ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పెట్టుబడుల కోసం అప్పులు చేస్తున్న వీరు వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. భూస్వాములు, దొరలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు రైతుబంధును వర్తింపజేస్తున్న ప్రభుత్వం... ఈ పథాకాన్ని కౌలు రైతులకు ఎందుకు వర్తింపజేయటం లేదని ప్రశ్నించారు. ఇది ప్రజల ప్రభుత్వమా? లేక దొరలదా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కౌలు రైతులందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రైతులందరికీ రుణాలనివ్వాలి, భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళ, బుధవారాల్లో మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. వీటిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.జంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.