గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులను పర్మినెంట్‌ చేయాలి - ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్‌ 

13.06.2018

గ్రామపంచాయతీల్లో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగు లు, కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని తెలంగాణ ఉద్యోగ, కార్మిక జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ లోపు వెంటనే వారి జీతాలను పెంచాలని కోరింది. ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే మరో సమ్మె చేపడుతామని హెచ్చరించింది. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రామపంచాయతీ ఉద్యోగులు, కార్మిక సంఘాల రాష్ట్ర ఐక్య సదస్సు జరిగింది. ఇందులో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబు, జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు పాలడుగు భాస్కర్‌, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నిర్మల, టీఆర్‌ఎస్‌కెవి రాష్ట్ర గౌరవాధ్యక్షులు నల్లా రాధకృష్ణ, ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు టి నర్సింహన్‌, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. గ్రామపంచాయతీల్లో ఏండ్ల తరబడి పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్‌ చేయకుండా నామమాత్రం వేతనాలు చెల్లిస్తూ వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే కార్మికులు మరో సమ్మెకు సిద్ధంగా ఉండాలన్నారు. దేశమంతటికీ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదంటూ గొప్పలు చెబుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కర్నాటక, కేరళ, లాంటి పొరుగు రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కర్నాటక తరహాలో గ్రామపంచాయతీ, ఉద్యోగులు, కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. అర్హత గల ఉద్యోగ, కార్మికులందరినీ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోషన్‌లు కల్పించాలని తెలిపారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యం మాట్లాడుతూ సమ్మె చేస్తే ఉద్యోగాలు తొలగించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడని మాటలు మన సీఎం కేసీఆర్‌ మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి నిర్మల మట్లాడుతూ కార్మికులందరూ ఐక్యంగా ఉండి సమస్యల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. 
12 మందితో స్టీరింగ్‌ కమిటీ 
''తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ'' పేరుతో ఐక్య కార్యాచరణ కోసం 12మందితో కూడిన స్టీరింగ్‌ కమిటీని ఎన్నుకుంది. ఈ కమిటీలో పాలడుగు భాస్కర్‌, ఐ శ్రీపతిరావు, పి గణపతిరెడ్డి (సీఐటీయూ), కె రవిచందర్‌, కడారి సునీల్‌ (ఏఐటీయూసీ) కె సూర్యం, పి అరుణ్‌కుమార్‌, ఎస్‌ దాసు (ఐఎఫ్‌టీయూ) కె భా స్కర్‌, ఎస్‌ యజ్ఞ నారాయణ, కె కోటిలింగం ( టీఆర్‌ఎస్‌కేవీ) లను ఎన్నుకున్నారు.