జనభారం భూమితరమా..!?

11.07.2018

 

1987 జులై 11న ప్రపంచ జనాభా 500 కోట్లు (5 బిలియన్లు) చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తూ మూడు దశాబ్దాలకు చేరుకున్నాం. విద్య, వైద్య, వైజ్ఞానికంగా నేడు ఎంతో అభివృద్ధి సాధించాం. గతం కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నాం. కానీ ప్రపంచాన్ని, మనదేశాన్ని అధిక జనాభా సమస్య పట్టి పీడిస్తున్నది. నానాటికీ పెరుగుతున్నా జనాభా వలన ఆహార పదార్థాల కొరత, స్థలం కొరత, పేదరికం, ఉపాధి, ఉద్యోగం సమస్యలు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయి. జన స్థిరీకరణ, నియంత్రణ చేయడం ప్రస్తుతం అందరి బాధ్యతగా గుర్తించాలి.
ఐక్యరాజ్య సమితి జనాభా విపత్తును నియంత్రించడానికి సభ్య దేశాలన్ని ఉమ్మడి ఎజెండాగా జనాభా నియంత్రణే ప్రధాన అంశంగా చేర్చి ప్రపంచంలోని అన్ని దేశాలు ఆమలు జరిగేలా వ్యక్తుల నుంచి ప్రపంచం యావత్తు స్వీయ బాధ్యతతోపాటు, సామాజిక బాధ్యతగా తీర్మానించుకొని అమలుకు పూనుకోవాలి. లింగ వివక్ష వీడి సమాన భావంతో స్త్రీయైనా, పురుషుడైనా ఒక్కరితోనే, కుటుంబ నియంత్రణ పాటించి జనాభాను తగ్గించడానికి తోడ్పడాలి. స్త్రీ విద్యను ప్రోత్సహించి. యువతీ యువత జనస్థీరీకరణ, నియంత్రణ ప్రస్తుత పరిస్థితుల్లో పాటిస్తేనే ఆర్థికంగా ఎంతో తోడ్పడుతుంది. 2050 నాటికి భారత్‌, చైనా, అమెరికా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ తదితర 9 దేశాల జనాభా ప్రపంచ జనాభాలో సగం శాతాన్ని ఆక్రమిస్తుందని తెలుస్తోంది. పునరుత్పాదన లేని సహజసిద్ధ వనరులను కాపాడుకోలేక పోతూ ఇలా జనాభాను పెంచుకుంటూ పోతే ఆర్థికంగా కుంగిపోవడం ఖాయం. 
సుమారు 40శాతం జనాభా ఇండియా, చైనాలోనే ఉన్నారు. అలాగే ఐక్యరాజ్యసమితి ఈ మధ్య ఒక అధ్యయనం ప్రకారం వచ్చే 50 ఏండ్లలో ప్రపంచవ్యాప్తంగా మహిళా సంతానోత్పత్తి శాతం సరాసరిగా 2.5 నుండి 2.1కి పడిపోతుందని తెలిపింది. దీనికి మనిషి జీవన విధాన, ఆహారపు అలవాట్లు పర్యావరణంలోని స్థితిగతులు కారణం కావచ్చుననిపిస్తుంది. ప్రపంచంలోని దేశాలు వారి జనాభా తెలపటానికి జనాభా లెక్కలు నిర్వహిస్తారు. దాని వలన ఆ దేశ ఆర్థిక, ప్రణాళికలకు, సామాజిక పథకాలు రూపొందించడానికి, ప్రభుత్వ పథకాల రూపకల్పన, వెనకబడిన ప్రాంతాల, వర్గాలను గుర్తించడానికి జనాభా లెక్కలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అలాగే పెరుగుతున్న జనాభాను అరికట్టడానికి స్త్రీ విద్య ప్రోత్సాహం, కుటుంబ నియంత్రణ పాటించకపోతే దాని దుష్ప్రభావం లాంటివి ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించడానికి జనాభా దినోత్సవం రోజు అనేక కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు నిర్వహిస్తాయి. 
మనదేశంలో జనాభా నియంత్రణకు వ్యక్తిగత, సామాజిక బాధ్యతగా కుటుంబ నియంత్రణను కుల, మత, వర్గ లింగ వివక్షలు మాని నియంత్రణ శస్త్ర చికిత్సలను అమలు జరపాలి. మనోభావాల పేరుతో అభిప్రాయ వ్యక్తీకరణ నిలవరించరాదు. భావ ప్రకటన ఏ ఒక్కరి సొత్తుకాదు. ఒక వర్గానిది అంతకన్నా కానేకాదు. భావ సంఘర్షణ జరగాలి మంచి చెడును జనం గ్రహించుకొని నిర్ధారణకు రావాలి. 
గరీబీ హఠావో నినాదం గంగలో కలిసింది. పేదరికం మాత్రం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నది. మూఢ నమ్మకాలను వీడి కులాలకు మతాలకు అతీతంగా కుటుంబ నియంత్రణ పాటించాలి. స్థానిక సంస్థల్లో పదవులకు ఇద్దరు పిల్లలు మించితే, అర్హత లేకుండా చట్టం తెచ్చారు. ఇది కాస్తా పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు ఒకరికన్నా మించితే పదవి అర్హత ఉండకుండా చట్టాన్ని తెచ్చి నేటి యువత అమలుకు పూనుకుంటే, భావితరాలకు మేలుజరుగుతుంది. స్థానిక సంస్థలకు ఒకనీతి, చట్ట నిర్మాతలకు మరొక నీతా? ద్వంద్వ విధానాలకు స్వస్తి పలకాలి.
ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీలో ముందున్నా ..! ఇంకా కొన్ని దేశాలల్లో మనదేశం సహా కొన్ని కులాల, మత వర్గాల, జాతుల, తెగలల్లో అందవిశ్వాసాలు తిష్టవేసి కూర్చుంటే.. అది జ్ఞానం అనాలా! అజ్ఞానమనాలా? చదువుకున్న వాళ్ళే మగపిల్లలు పుట్టే వరకు కొందరు, ఆడపిల్లపుట్టే వరకు కొందరు పిల్లల్ని కంటూనే పోతుంటే దీనిని ఏమనాలి? ఇది నియంత్రణకు అవరోధం కాదా! వ్యక్తిగతంగా, సామాజికంగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ పర్యావరణాన్ని వాడుకో, వదులుకో (యూజ్‌ అండ్‌ త్రో) పద్ధతిలో విషతుల్యం చేస్తూ జనాభా పెరుగుదలను తగ్గించకపోతే భూమి, భారం మోయలేక ప్రకృతి బీభత్సాలు, సునామీలు, భూకంపాలు, వరదలు లాంటి భీభత్సాలతో భూ భారాన్ని తగ్గించుకుంటుంది. దీనిని ఏ శాస్త్ర విజ్ఞానం, టెక్నాలజీ ఆపలేదు. కాబట్టి జనాభా విస్పోటనాన్ని మనకు మనమే నిలువరించుకొని అభివృద్ధికి బాటలు వేద్దాం.

- మేరికి దామోదర్‌ 
సెల్‌: 9573666650