జన సమరం.. రణ నినాదం..

24.04.18

 

అత్యంత సంక్లిష్ట, సంక్షుభిత పరిస్థితుల నుంచి దేశాన్ని రక్షించాలన్న ఒక మహత్తర లక్ష్యం.. వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక శక్తులను ఏకం చేయాలన్న ఒక గమ్యం.. వెరసి రానున్న మూడేండ్ల కాలానికి దేశ భవిష్యత్‌కు దిశా.. నిర్దేశనం... స్థూలంగా ఇదీ సీపీఐ (ఎం) అఖిల భారత 22వ మహాసభ కర్తవ్యం. ఆద్యంతం అత్యంత క్రమశిక్షణాయుతంగా ఐదు రోజులపాటు కొనసాగిన ఈ మహాసభ.. సరూర్‌నగర్‌ గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభతో ముగిసింది. ఈ క్రమంలో ప్రతినిధుల సభలో మేధోమథనం జరిగితే.. మైదానంలో జనంతో మమేకం కావటంతో సీపీఐ (ఎం) తాను తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందుంచింది. అనంతరం మార్క్సిస్టు పార్టీకి చెందిన అతిరథ మహారథులు, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన ప్రతినిధులు.. కర్తవ్య బోధను గుర్తు చేసుకుంటూ మహాసభకు అతిథ్యమిచ్చిన హైదరాబాద్‌కు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. 
దేశంలో ఒకవైపు నియంతృత్వంతో కూడిన మతోన్మాదం.. మరోవైపు ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే నియంతృత్వం.. ఆర్థిక దోపిడీ.. సామాజిక అసమానతలు.. ఇలా సమస్యల వలయంలో చిక్కుకుని ప్రజలు విలవిల్లాడుతున్న తరుణంలో.. వారిని రక్షించేందుకు నేనున్నానంటూ ముందుకొచ్చిన సీపీఐ (ఎం)... పాలకుల వైఫల్యాలను, ప్రభుత్వాల దుర్నీతిని మహాసభ ద్వారా ఎక్కడికక్కడ ఎండగట్టింది. ఇదే సమయంలో ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీల వైఫల్యాలను ఎత్తి చూపింది. ఆరెస్సెస్‌ కనుసన్నల్లో నడుస్తున్న బీజేపీ.. దేశంలో అరాచకాన్ని సృష్టిస్తోన్న వైనాన్ని సోదాహరణంగా వివరించింది. తద్వారా 'తస్మాత్‌ జాగ్రత్త..' అంటూ ప్రజానీకాన్ని హెచ్చరించింది. పెరుగుతున్న నిరుద్యోగం.. తరుగుతున్న ఉపాధి అవకాశాలను చర్చించింది. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, మౌలిక వసతుల కల్పన తదితర ప్రాధాన్యతా రంగాల్లో కేంద్రంతోపాటు రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు.. వాటి పర్యవసానాలను నొక్కి చెప్పింది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ప్రజా విధానాలే దేశానికి శరణ్యమని స్పష్టం చేసింది. వీటి కోసం సమర శంఖం పూరించాలి.. సమస్యల పరిష్కారం కోసం రణనినాదం చేయాలంటూ జనాన్ని జాగృతం చేసింది. 
తీర్మానాలు.. 
అంతర్జాతీయ, జాతీయ పరిస్థితుల నుంచి స్థానిక పరిణామాల వరకూ అనేక తీర్మానాలను మహాసభ ప్రతిపాదించి ఆమోదించింది. పాలస్తీనాలోకి ఇజ్రాయిల్‌ సైన్యాలు చొచ్చుకు పోవటాన్ని నిరసిస్తూ ఒక తీర్మానం, ఉన్నత విద్యారంగాన్ని వ్యాపారమయంగా మార్చటం, ఆ రంగంలోకి మతతత్వ అజెండాను జొప్పించటంపై మరో తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. మహిళా బిల్లు, వికలాంగుల హక్కులు, చట్టాల అమలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, దళితులపై దాడులు, జలియన్‌ వాలాబాగ్‌ పోరాట స్ఫూర్తి, మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌ ర్యాలీకి మద్దతు, జస్టిస్‌ లోయా మృతి-సుప్రీంకోర్టు తీర్పు, కేరళ ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి మద్దతు, మక్కా మసీదు పేలుళ్లపై ప్రత్యేక కోర్టు తీర్పు, స్వల్పకాలిక ఉద్యోగులను అన్ని రంగాలకు విస్తరించటంతోపాటు ఇతర అనేకాంశాలపై పలు తీర్మానాలను ప్రతిపాదించగా సభ వాటిని ఆమోదించింది. 
ఆరంభం అదిరింది.. ముగింపు మురిసింది...
నూతన రాష్ట్రమైన తెలంగాణలో నిర్వహించిన సీపీఐ (ఎం) అఖిల భారత మహాసభ ఆరంభం.. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అత్యంత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అరుణ పతాకాన్ని ఆవిష్కరించటంతో ప్రారంభమైన ఈ సంరంభం.. హైదరాబాద్‌ మహానగరంలో ఎర్రదండు ప్రవాహం పోటెత్తటంతో మరింతగా అరుణారుణ వర్ణరంజితమైంది. తద్వారా తెలంగాణ గడ్డ మీద జరిగిన ఆనాటి పోరాట స్ఫూర్తిని మరోసారి రగిలించింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో నాయకుల ఉత్తేజభరిత ప్రసంగాలు కార్యకర్తలకు దిశా, నిర్దేశం చేశాయి. 
బీఎల్‌ఎఫ్‌కు నూతనోత్తేజం.. 
వామపక్షాలు, సామాజిక శక్తుల ఐక్యతారాగం నేపథ్యంలో తెలంగాణలో ఏర్పడిన బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌)కు సీపీఐ (ఎం) మహాసభ నూతనోత్తేజాన్ని కలిగించింది. పార్టీకి రెండోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరి.. బహిరంగ సభ సాక్షిగా లాల్‌..నీల్‌ ఐక్యత గురించి పునరుద్ఘాటించటంతో రాష్ట్రంలోని సామాజిక శక్తులు పులకించిపోయాయి. మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, సమాజ హితులు.. సీపీఐ (ఎం) నినాదాన్ని, నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ క్రమంలో మార్క్సిస్టు పార్టీ ఆర్థిక దోపిడీ.. సామాజిక వివక్షపై సమర శంఖాన్ని పూరిస్తా.. తద్వారా దేశ భవిష్యత్‌కు బాటలు వేస్తానంటూ ప్రజలకు భరోసానిచ్చింది.