జలవివాదాల పరిష్కారంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడాలి - సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

08.06.2018

కృష్ణా-గోదావరి జలాల పంపిణీకి గత ట్రిబ్యునల్స్‌ చేసిన సూచనలకు లోబడి శాశ్వత పరిష్కారానికి రావడంలో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విభజన పూర్తయి నాలుగేండ్లు దాటినా కృష్ణా-గోదావరి జలాల పంపిణీలో ఉభయ రాష్ట్రాల మధ్య వాదనలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 84 ప్రకారం నీటి పంపిణీకి కేంద్రంలో ఎపెక్స్‌ బోర్డు ఏర్పాటు చేశారనీ, కానీ అది తన బాధ్యతను నిర్వహించడం లేదని గుర్తుచేశారు. సెక్షన్‌ 85 ప్రకారం రాష్ట్ర బోర్డు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నీటి పంపిణీని పర్యవేక్షణ చేయాలనీ చెప్పారు. కృష్ణానదీ బోర్డు ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకూ వర్కింగ్‌ మాన్యువల్‌ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. నీటి విషయంలో ఇంత నిర్లక్ష్యం పనికిరాదన్నారు. బచావత్‌ తీర్పు ప్రకారం ప్రస్తుతం నీటి పంపిణీ జరగాలనీ, బ్రిజేష్‌కుమార్‌ తీర్పు పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు. సమస్య తీవ్రత దృష్ట్యా ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో, నీటిపారుదల శాఖామంత్రులు, ముఖ్య ఇంజినీర్లు కూర్చుని పరిష్కరించుకోవడం అత్యవసరమని తెలిపారు. ఒకవైపు ఖరీఫ్‌ సీజన్‌ విత్తనాలు వేస్తుంటే రాబోయే నీటి పంపిణీకి, ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటి పంపిణీ సమస్యను పరిష్కరించుకోలేక వాయిదా వేయడం సమర్థనీయం కాదని చెప్పారు. నాలుగేండ్లలో సక్రమంగా నీటి పంపిణీ జరగక పోవడంతో తెలంగాణలో ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో చాలావరకు పంటలు వేయని స్థితి ఏర్పడిం దని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కరించమని కోరుతూ కేంద్రానికి లేఖలు రాసి సరిపెట్టుకుంటున్నదని విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టు కింద మహబూబ్‌నగర్‌, నల్లగొండ కరువు ప్రాంతాలు, నాగార్జునసాగర్‌ ఆయకట్టు, మిర్యాల గూడెం ఖమ్మం జిల్లాల్ల్లో నాలుగేండ్లుగా గ్యారెంటీ లేని పంటల విధానం కొనసాగుతున్నదని తెలిపారు. తక్షణమే ఈ సమస్యకు ముగింపు పలకాలని కోరారు. ఏ రాష్ట్రం ఎంతనీటిని వినియోగించుకుంటు న్నదో టెలీమెట్రిక్‌ పద్ధతి ద్వారా అంచనాకు రావాలని సూచించారు. సాగునీటిని, తాగునీటిని సద్విని యోగం చేసుకునేందుకు ఉభయ రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రత్యక్షంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.