తెలంగాణలో కొత్త పర్యాటకరంగ అభివృద్ధి!

13.06.2018

 

సాధారణంగా యాత్రలూ పర్యటనలూ ఆర్థికరంగ పరిధిలోకి రావు. తీర్థయాత్రలూ బంధుమిత్ర సంచారాలూ శతాబ్దాలుగా ఉన్నాయి గాని, అవి ఆర్థిక రంగానికి చేసిన దోహదం గురించి పెద్దగా నమోదు కాలేదు. కాని ఇటీవలి కాలంలో విహార, విజ్ఞాన పర్యటనల ఆర్థిక కోణాల గురించి చర్చ అంతకంతకూ విస్తృతమవుతున్నది. చాల దేశాల ఆర్థిక వ్యవస్థలు పర్యాటక రంగం మీద ఎక్కువగానే ఆధారపడుతున్నాయి. వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలలోనూ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలోనూ పర్యాటకరంగ ఆదాయాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడిక పర్యాటక ఆర్థిక శాస్త్రం అనే ప్రత్యేక అధ్యయన విభాగం కూడ పుట్టుకొచ్చింది. 
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పరిణామాల గురించి మాత్రమే మాట్లాడే ఈ శీర్షికలో మామూలుగానైతే పర్యాటక రంగం ప్రస్తావన రానక్కరలేదు. ఇప్పటికైతే తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో పర్యాటకరంగం పాత్ర అంతగా ఏమీ లేదు. కాని ఆశ్చర్యకరంగా పర్యాటక రంగం తెలంగాణ రాజకీయార్థిక పరిధిలోకి, సామాజిక చర్చలోకి మరొక రూపంలో ప్రవేశిస్తున్నది. ఎందరెందరో విదేశీ, స్వదేశీ ప్రముఖులు రాష్ట్రానికి వచ్చి, నిర్మాణంలో ఉన్న నీటి పారుదల పథకాలూ, అమలవుతున్న సంక్షేమ పథకాలూ చూసి మహా ఘనత వహించిన ఏలినవారికి ఇబ్బడి ముబ్బడిగా కితాబులు ఇచ్చిపోతున్నారు. సరిగ్గా ఇరవై ఏండ్ల కింద చంద్రబాబు నాయుడు పాలనా కాలంలో దేశ, విదేశ ప్రముఖులు ఎటువంటి కీర్తనలు వినిపించేవారో, యథాతథంగా అవే వినిపిస్తున్నాయి. అప్పుడు అలా పొగిడినవారికి రాష్ట్ర వనరుల్లో ఏమేమి దక్కాయో ఇప్పుడు బహిరంగ రహస్యమే. మరి ప్రస్తుత ప్రశంసకులకు ఏమి దక్కుతున్నాయో రేపెప్పుడో బైటపడుతుంది. 
ఇక రాష్ట్రంలోని ప్రముఖులూ ప్రజాభిప్రాయ నిర్మాతలూ కూడ ఇటువంటి పర్యటనలు చేయడం మొదలయింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభుత్వమే ఈ పర్యటనలు నిర్వహిస్తున్నది. ఇవి కండక్టెడ్‌ టూర్స్‌ అని పిలిచే, చూపదలచుకున్నది మాత్రమే చూపే విహార పర్యటనలో, విజ్ఞాన పర్యటనలో తెలియదు గాని, ప్రభుత్వానుకూల ప్రచార పర్యటనలుగా మాత్రం మిగులుతున్నాయి. 
మామూలుగా పర్యాటకరంగ అభివృద్ధి వల్ల పర్యాటకుల ప్రయాణ ఖర్చులు, వసతి ఖర్చులు, భోజన, ఉపాహారాల ఖర్చులు, వారు కొనుగోలు చేసే సరుకుల సుంకాలు వంటి అనేక రూపాల్లో స్థానిక ఆర్థిక వ్యవస్థకు నిధులు అందుతాయి, మేలు చేకూరుతుంది. కాని ప్రస్తుత తెలంగాణ పర్యటనలకు మాత్రం ఎదురుగా ప్రజాధనమే ఖర్చవుతున్నట్టు కనబడుతున్నది గాని అదనంగా రాష్ట్ర ఖజానాకు ఏమీ దక్కుతున్నట్టు దాఖలాలైతే లేవు. బహుశా రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకుల ప్రతిష్ఠ ఖజానాలోకి కొన్ని ప్రశంసలూ, రేపు వోట్లుగా మారే అవకాశం ఉన్న అభిమానాలూ కురుస్తుండవచ్చు. 
ఏ ప్రభుత్వమైనా తాను చేసే పనుల గురించి ప్రచారం చేసుకుంటుంది. అలా చేసుకోవడం తప్పేమీ కాదు. కాని వాస్తవాలను కప్పిపెట్టే ప్రచారాలు, వాస్తవాలు వినిపించకుండా చేసే స్థాయిలో ప్రచారాలు, సాధారణంగా వాస్తవాలు మాట్లాడతారనే ప్రతిష్ఠ ఉన్నవారి చేత కూడ అవాస్తవ ప్రచారాలు చేయించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న విజయాలు. నిజానికి ఈ ఘనత కూడ కొత్తదేమీ కాదు. ముఖ్యమంత్రికి రాజకీయ గురువు, పద్దెనిమిదేండ్ల పాటు నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన పద్ధతులు ఇవి. 
నిజం చెప్పాలంటే పర్యాటకులను తప్పు పట్టవలసిందేమీ లేదు. వారిలో చాల మందికి తమను ఎవరు ఏ ప్రయోజనాల కోసం తీసుకుపోతున్నారో తెలియకపోవచ్చు. చూపించినది చూస్తూ ఉండవచ్చు. కళ్ల ఎదుట కనబడుతున్న మహా నిర్మాణాలూ, అపారమైన మానవ శక్తీ, యంత్ర శక్తీ సాధిస్తున్న అద్భుతాలూ వారిని అబ్బురపరుస్తుండవచ్చు. సాధారణంగానే మనుషులు, అందులోనూ భావుకులు, మహా నిర్మాణాలను చూసి సంభ్రమాశ్చర్య భరితులవుతారు. మానవ ప్రయత్నం ఎన్ని అద్భుతాలు సాధించగలదో ప్రశంసిస్తారు. కాని ఒక భవనం, ఒక నిర్మాణం కనిపించే రూపం మాత్రమే. దానికదిగా అది దాని సారాంశాన్ని విప్పి చెప్పజాలదు. తాజ్‌మహల్‌ అద్భుత నిర్మాణంగా మాత్రమే కనబడుతుంది గాని ఎంత నెత్తుటినీ చెమటనూ బలి తీసుకున్నదో, దాని నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరో, ఎంత ప్రజాధనాన్ని వెచ్చించి ఉనికిలోకి వచ్చిందో అది చెప్పజాలదు. ప్రస్తుత తెలంగాణ పర్యాటకులు సందర్శిస్తున్న, ప్రశంసలు కురిపిస్తున్న నిర్మాణాలు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి గనుక శ్రామికులు, వారి కష్టం ఇంకా కనబడుతుండవచ్చు. కొన్నాళ్లు పోయాక ఆ శ్రామికులు కూడ మిగలరు. 
అయితే ఇంతకీ చూడవలసింది ఈ కొత్త పర్యాటక స్థలాల రూపాలను మాత్రమేనా, వాటి సారంలోకి వెళ్లవలసిన అవసరం ఉందా అనేది ప్రశ్న. అలా నిర్మాణాలు మాత్రమే చూసి, అవి నిర్మించినవారిని కూడ కాదు, నిర్మింపజేసినవారికి (ఆ మాటకొస్తే అవి ప్రజాధనంతో నిర్మాణమవుతున్నాయి గనుక ''నిర్మింపజేసినవారు''గా కీర్తి పొందుతున్నవారు కూడ వాస్తవంగా ఆలోచిస్తే ఆ మాటకు తగరు!) పొగడ్తల దండలు వేయదలచుకున్నట్టయితే, మన కండ్ల ముందరే గత కాలపు పాలకులెందరో నిర్మింపజేసిన భవనాలూ నిర్మాణాలూ ఎన్నో ఉన్నాయి. ప్రజాకంటకులుగా పేరు తెచ్చుకున్న పాలకులు కూడ మహౌన్నతమైన నిర్మాణాలు చేశారు. ఇటువంటి ప్రశంసలకే అర్హమైన అద్భుత నిర్మాణాలకు రూపకల్పన చేసినప్పటికీ బ్రిటిష్‌ వలస పాలకులను, మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ను ప్రజలు వెళ్లిపొమ్మనే, దిగిపొమ్మనే అన్నారు. అంటే చూడవలసింది నిర్మాణాలను మాత్రమే కాదన్నమాట. రాజకీయార్థిక విధానాలను చూడవలసి ఉందన్నమాట. ఆ రాజకీయార్థిక విధానాలు ప్రజల పేరు మీద, ప్రజాధనం ఖర్చుపెడుతూ ఆశ్రితులకు దోచిపెడుతున్నవా, ప్రజలను మోసం చేస్తున్నవా అనేది అసలు ప్రశ్న. 
కనుక ఆ నిర్మాణాలను చూడడమూ, ఆ నిర్మాణాల ఔన్నత్యాన్ని, మానవశక్తి సాధిస్తున్న అద్భుతాన్ని ప్రశంసించడం మంచిదే. కాని వాటితో పాటే ఆ నిర్మాణాల వెలుగు కింద దాగిన చీకటిని గుర్తించగలగాలి. తమను తాము పాలకపక్షం కాదనీ, ప్రజాపక్షం అనీ, నిష్పాక్షికం అనీ చెప్పుకుంటున్నవారు, ఆ దీపం ఎందరికి వెలుగు ఇస్తుందో చెపుతున్నప్పుడే, ఆ దీపపు నీడలో అణగిపోయినవారెందరో చెప్పగలగాలి. కాళేశ్వరం నిర్మాణాలు ఒక సాంకేతిక, నిర్మాణ పరమైన అద్భుతాలే కావచ్చు కాని అవి అద్భుతాలని ఒప్పుకుంటూనే, ఆ వెంటనే కనీసం బుద్ధిజీవులకు రావలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదట అసలు ఈ నిర్మాణం అవసరమేనా? ఒక నిజమైన అవసరాన్ని ప్రకటిస్తూ, మరేదో సాధించదలచుకున్నదా? ఈ నిర్మాణం తాను ప్రకటిస్తున్న లక్ష్యాన్ని నిజంగా చేరుకుంటుందా, కేవలం ప్రజలను నమ్మించడానికి ఆ లక్ష్యాన్ని ప్రకటిస్తూ, మరేవో ప్రయోజనాల కోసం సాగుతున్నదా? పైపై మెరుగుల రిడిజైనింగ్‌ అనే పేరుతో నిర్మాణ వ్యయం ముప్పై ఎనిమిదివేల కోట్ల రూపాయల నుంచి రాత్రికి రాత్రి ఎనబై వేల కోట్ల రూపాయలకు ఎట్లా పెరిగిపోయింది? ఆ మితిమీరిన పెరుగుదలలో ఎవరి బొక్కసాలకు ఎంత చేరింది, చేరబోతున్నది? ఒక టీఎంసీ నీరు ఎన్ని వేల ఎకరాల పంటకు సాగునీరు అందిస్తుందో గత పాలకుల కాలంలో, ఉద్యమకాలంలో తామే చెప్పిన లెక్కను మన నాయకులూ అధికారులూ హఠాత్తుగా ఇప్పుడు ఎట్లా మార్చేశారు? ఎందుకు మార్చేశారు? ఈ మహానిర్మాణం సాధించబోయే ఫలితాలేమిటో భవిష్యత్తు తేలుస్తుంది గాని, ఇప్పటికిప్పుడు కాంట్రాక్టర్లకు, అది కూడ నిన్నటి దాకా వలసవాదులుగా ముద్రపడిన కాంట్రాక్టర్ల ఎంత దక్కింది? ఇప్పటికిప్పుడు ఇది నిర్వాసితులుగా మార్చిన వేలాది కుటుంబాల గతి ఏమయింది? వారు ఎక్కడికి వెళ్లారు? వారి జీవనోపాధి ఏమిటి? వారికి న్యాయమైన పరిహారం అందిందా? పరిహారం ఎగ్గొట్టడానికీ, తగ్గించడానికీ ప్రభుత్వం చేసిన కుట్రలు ఇవాళ ఈ నిర్మాణాన్ని ప్రశంసిస్తున్న వారికి కనబడ్డాయా? ఈ మహా నిర్మాణపు మజిలీలలో, ఎలాగూ మునిగిపోయే ప్రాంతాలుగా ప్రకటించి ఇసుక మాఫియా ఎలా చెలరేగిపోయింది? ఎన్ని ప్రాణాలు తీసింది? ఎన్ని చట్ట ఉల్లంఘనలు చేసింది? కొన్ని డజన్ల ప్రశ్నలు. జవాబు రాని ప్రశ్నలు.
పర్యటనలు చేస్తున్నవారిలో కేంద్ర, రాష్ట్ర అధికారులు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్ల మామూళ్లు క్రమబద్ధంగా అందుకునే వాళ్లు ఎట్లాగూ చూడదలచుకున్నవే చూస్తారు, చెప్పదలచుకున్నవే చెపుతారు. జరుగుతున్న పని అంతా ప్రజల కోసమేనని ఉమ్మడి రాష్ట్ర పాలకుల మాటలే మాట్లాడతారు. భవిష్యత్తులో బంగారు తెలంగాణ వస్తుందని ప్రగల్భాలు పలుకుతారు. అవి వారి ప్రయోజనాలు. పాలకవర్గ ప్రయోజనాలు. కాని వారు మాత్రమే కాక మిగిలిన పర్యాటకులు, బుద్ధిజీవులు, భావుకులు, సున్నిత మనస్కులు, ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించేవారు, అమాయకులు ఉన్నారు గదా, వారికైనా తమ కళ్ల ముందర మిరుమిట్లు గొల్పుతున్న నిర్మాణానికి అవతలి ముఖం ఉన్నదని కనబడడం లేదా?వారైనా వేయవలసిన ప్రశ్నలు వేయకపోతే సమాజానికి అవసరమైన ప్రశ్నలు వేసేవారెవరు? నిన్నటిదాకా పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించిన గళాలు, ఇవాళ అవే అంశాలతో - ముంపు బాధితుల సమస్య, కాంట్రాక్టర్ల - రాజకీయ నాయకుల అవినీతి కోసం ధనయజ్ఞంగా మారిన జలయజ్ఞం, కొన్ని ప్రాంతాలను విస్మరించి కొన్ని ప్రాంతాలకు వనరులు కట్టబెట్టడం, పారదర్శకత లేకపోవడం వంటి అంశాలతో కొట్టుమిట్టాడుతున్న పథకానికి ఎట్లా అంగీకారం తెలుపుతున్నారు?
నిజంగానే ఓపిక ఉంటే, మనసు ఉంటే, ప్రజాశ్రేయస్సు కోసమే తెలంగాణ కోసం ఉద్యమించామనే స్ఫూర్తి కొనసాగుతూ ఉంటే తెలంగాణలో పర్యటించవలసిన ప్రాంతాలు చాల ఉన్నాయి. ఇదే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన, సాంకేతికంగా కూడ అసంగతమైన యాబై టీఎంసీల కన్నీళ్ల ప్రాజెక్టు, మల్లన్న సాగర్‌ ఉంది. అసలది అవసరం లేదని, రాజకీయ ప్రయోజనాల కోసమే, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమే దాని నిర్మాణం సాగుతున్నదని, ఇంత చేసీ తమకు తగిన నష్టపరిహారం లేకుండా తమ భూమి లాక్కుంటున్నారని న్యాయమైన అభ్యంతరాలు చెపుతూ రెండేండ్లకు పైగా ప్రజలు నిరాహారదీక్షలు చేస్తున్న వేములఘాట్‌ గ్రామం ఉంది. ఈ పర్యాటకులు అక్కడికి ఒక్కసారి వెళితే బాగుండును. ఉద్యమ క్రమంలో ఓపెన్‌ కాస్ట్‌ గనుల తవ్వకానికి వ్యతిరేకంగా నినదించి, అది ఉమ్మడి ప్రభుత్వ విధానమనీ, తెలంగాణ రాగానే ఓపెన్‌ కాస్ట్‌ గనులు మూసివేస్తామనీ ప్రకటించి, ఆ నిర్ణయాన్ని తుంగలో తొక్కిన పాలకులకు వ్యతిరేకంగా గళం ఎత్తిన ఎర్రగుంటపల్లె ఉంది. అడవి మీద ఆదివాసుల హక్కును పరిరక్షించే చట్టాలను కాలరాస్తూ తెలంగాణ ప్రభుత్వం సాగించిన బీభత్సకాండ, అడవిలో గూడాన్ని ధ్వంసం చేసి, ఇండ్లలోని సామాన్లు చిందరవందర చేసి, స్త్రీలను చెట్టుకు కట్టి కొట్టి, ఆదివాసులను బైటికి తరలించిన జలగలంచ ఉంది. దళితుల మీద దాడులు, హత్యలు, హత్యాప్రయత్నాలు జరిగిన మంథని, నేరెళ్ల వంటి అనేక గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి. జుడిషియల్‌ కస్టడీలో, కోర్టు వాయిదాకు వెళ్లి వస్తూ, వ్యానులో సీట్లకు చేతులు గొలుసుతో కట్టేసి ఉండగా ఎన్‌ కౌంటర్‌ కట్టుకథతో ఖైదీలను చంపేసిన ఆలేరు ఉంది. ఏపీ పాలకుల కన్న దుర్మార్గంగా నిరసన గళాల వేదికను కూడ కూల్చివేసిన ధర్నా చౌక్‌ ఉంది. బహిరంగ సభలు, ఊరేగింపులకు అనుమతి ఇవ్వకపోవడం సరేసరి, చివరికి ఇండ్లలో, ప్రాంగణాలలో సభలు జరుపుకునే హక్కును కూడ నిషేధించి, వాక్సభాస్వాతంత్య్రాలను, రాజ్యాంగ ప్రాథమిక హక్కులను అణచివేసి, చీకటి కొట్టుగా మార్చిన రాష్ట్రం ఉంది. న్యాయమైన హక్కుల కోసం, పెరుగుతున్న ధరలకు అనుగుణమైన జీతాల పెరుగుదల కోసం అడిగితే ఉద్యోగాలే తీసేస్తానని గర్జించిన దొరతనం ఉంది. ప్రతీ గ్రామంలో రైతుల్లో మూడో వంతుగా ఉన్న కౌలు రైతులు లేనేలేరని, వారికి ఏ హక్కులూ లేవని, ఎప్పుడో బూర్గుల రామకష్ణరావు ముఖ్యమంత్రిత్వంలో వచ్చిన హక్కులను కూడ రద్దు చేసిన పాలన ఉంది. అబ్బ, నిజంగా తెలంగాణ ఎంత అపురూపమైన పర్యాటక స్థలంగా మారింది! చూడదలచుకుంటే చూడవలసినవి ఎన్ని ఉన్నాయి!

- ఎన్‌. వేణుగోపాల్‌ 
సెల్‌: 9848577028