నిరంతర సాహిత్య స్ఫూర్తి

13.06.2018

 

తెలుగువారికి సుపరిచితమైన సృజనశీలి ద్వానాశాస్త్రి. సాహిత్య ప్రపంచం నుంచి సామాన్య పాఠకలోకానికి దగ్గరయిన సాహితీమూర్తులలో ప్రముఖులు ద్వానాశాస్త్రి. దాదాపు అయిదు దశాబ్దాలుగా బహుళ ప్రక్రియల్లో రచనలు చేస్తున్న ఆయన ఎనభయ్యవ పుస్తకం 'ఆత్మకథ' ఈ నెల పదిహేనో తేదీన ఆవిష్కరించనున్నారు. ఇది వారి సప్తతి మహోత్సవ సందర్భం. కవితా రచనతో తన సాహిత్య జీవితాన్ని ప్రారంభించిన ద్వానాశాస్త్రి సమీక్షకునిగా, విమర్శకునిగా, పరిశోధకునిగా రాణించారు. సివిల్‌ సర్వీసెస్‌ విద్యార్థులకు తెలుగును బోధించే అధ్యాపకునిగా గుర్తింపు పొందారు. ఇప్పటివరకు ఎనభై పుస్తకాల వరకు వెలువరించడం వారి సృజన వైశాల్యానికి నిదర్శనం. ఎనిమిది కవితా సంపుటాలు, పదకొండు విమర్శనా గ్రంథాలు, పరిశోధన, భాషలకు సంబంధించి ఎనిమిది పుస్తకాలు రాశారు. అలాగే ఏడు జీవితచరిత్రలు సృజించారు. ఎనిమిది పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. పోటీపరీక్షల విద్యార్థుల కోసం పదహారు పుస్తకాలు రాశారు. కథలు రాశారు. అనువాదాలు చేశారు. వేలాది పుస్తకాలను సమీక్షించారు. చదవడం, రాయడం వారి నిత్యజీవితంలో అంతర్భాగం.

ద్వానాశాస్త్రి - భాషాశాస్త్రి, విశిష్ట గుణ సంపన్నుడు, నిరంతర అన్వేషి, బహుగ్రంథ అధ్యయన శీలి మన ద్వానాశాస్త్రి.
తన రచనల్లో సాహిత్యానికి పెద్దపీట వేశారు. వస్తువు పరంగా, భాష, శైలి పరంగా ఉన్నత స్థాయిలో నిలబడగలిగే రచనలు చేశారు. వారికి మంచి కీర్తిని తెచ్చిన ఉద్గ్రంథం 'తెలుగు సాహిత్య చరిత్ర' సాహిత్య విద్యార్థులకు కరదీపిక.
తన యాభైఏళ్ళ సాహితీ జీవన యానంలో ద్వానా ఎన్నో మైలురాళ్ళను దాటారు. సమకాలీన సాహిత్యోద్యమాల ప్రభావం అక్కడక్కడా ఆయన సాహిత్యంలో కనబడ్డా ఎవరి వలలోనూ చిక్కుకోకపోవడం ఆయన సాహిత్యాన్ని రాటుదేల్చింది. సామాజిక ఉద్యమాలను, పర్యావరణ స్పృహను ఇముడ్చుకున్న సాహిత్యం ద్వానా శాస్త్రిది. ఎంత ఎదిగినా ఒదిగి వుండే మనస్తత్వం వల్ల నిరాడంబర సాహితీవేత్తగా పేరుపొందారు. విభిన్న ప్రక్రియల్లో రచనలు చేసి అన్నింటా ప్రత్యేకత చాటుకున్నారు. అయిదు దశాబ్దాల కాలంతో ఎత్తిన కలం దించకుండా సాహితీ కృతులు అందించారు. అభిమానులు, ఆయన శిష్యులు గురువు గారు అని పిలుచుకునే ఆప్యాయతలు చూరగొన్నారు. కవిగా, అధ్యాపకుడిగా సాహితీవేత్తగా తెలుగు భాషాభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేనిది, మరువలేనిది.
'కవిత్వం వంట పుట్టిందే కానీ... వెంటబడి తెచ్చుకున్నది కాదు' అని అతని రచనలు చూస్తే విదితమవుతుంది. కవులను, కళాకారులను, సాహితీ సంస్థలను మనస్ఫూర్తిగా ప్రోత్సహించడం వారికి తెలుసు. ఔచిత్యం ఎరిగిన వక్తగా వెలగడం తెలుసు. కవిగా, లోకం పోకడ నిశితంగా తనకు తోచిన సహాయం అందించడం తెలుసు. ఎన్నో సభలు తిరిగి ఎంతో జ్ఞానం పంచడం తెలుసు. తాను ఒక్కడే ఎదగడం కాదు ఎదిగించడం తెలుసు. కవిత్వమంటే మాటలే కావచ్చు ఆ మాటలు నిత్యం జ్వలించాలి. లోపల కనపడని నిప్పేదో దాగి వుండాలి అని అనునిత్యం యవ కవులకు ప్రేరణగా నిలిచేవాడు. అందరివాడుగా ఆయనపై గౌరవం ఇనుమడించింది. 
పుస్తకాలను సమీక్షిస్తూ... ముందు మాటలు రాస్తూ నూతన కవులను ప్రోత్సహిస్తూ... అలనాటి కవిత్వాన్ని పరిచయం చేస్తూ, వక్తగా ప్రయోక్తగా జీవితానికి, సాహిత్యానికి సంబంధ బాంధవ్యాలను వివరిస్తూ నిర్విరామ ప్రసంగాలు చేస్తూ సాహిత్యంలో అదునెరిగిన విమర్శకుడు - పదునెక్కిన కవిగా సొంత ముద్ర కలిగిన మంచి వక్తగా పేరొందారు. వ్యాస ప్రియత్వం అణువణువు నింపుకుని సాహిత్య లోకపు తలలో నాలుకలాగా కదిలి పోయే సాహితీ ప్రియుడు.
అనేక విషయాలు పరిశీలిస్తూ సమకాలీన ప్రపంచపు రుగ్మతలపై విరుచుకు పడతారు. ఇప్పటికీ యువకవులను తీర్చిదిద్దే పనిలో ఉంటారు. 'పిట్ట నాలుగు పురుగుల్ని ఏరి ఆకలిగొన్న పిల్లల నోటికి అందించినట్టు, తల్లి కోడి కాళ్ళతో మట్టిని అటూ ఇటూ కెలికి ఇంత మేత కంట పడగానే పిల్లలను చేరబిలిచినట్టు అనునిత్యం అక్షరాలకు జవసత్వాలిస్తూనే ఉంటారు. ప్రాణవాయువును ఊదుతూనే ఉంటారు. చీకట్లో దీపం ముట్టించినట్లు అక్షరాలు అందిస్తూనే వుంటారు. యువకవులను పిల్లల కోడిలాగా వెంట తిప్పుకుంటారు. ప్రేమ, ఆప్యాయతలే ఆయనకు భూషణాలు. వందలాది శిష్యుల మస్తకాలకు పచ్చటి ప్రేరణ.
''ఏ ఒక్క దిక్కు పొద్దు పొడవద్దు
ఏ ఒక్క నోటికి ముద్ద దొరకొద్దు
అన్ని దిక్కులకూ కావాలి పొద్దు
అన్ని నోళ్ళకు అందాలి ముద్ద'' అన్నంతగా కలవరింతగా కలివిడిగా తెలుగు సాహితీసేవకు అంకితమైన అద్వితీయుడు డా|| ద్వానా శాస్త్రి. హృదయం మృదులమే, పల్కు వజ్ర సదృశం, దోషాలు, లోపాలు, ఎక్కడ ఉన్నా సహించలేడు. ఉద్విగ మనస్సు, లోక వ్యవహార సిద్దుడు. గతంలోకి పోతే...
తెలుగు సాహిత్యమే ఉచ్చ్వాస నిశ్వాసలుగా ద్వానాశాస్త్రి కృష్ణాజిల్లా కైకలూరు తాలూకా ముదినేపల్లి దగ్గర్లోని లింగాల గ్రామంలో జూన్‌ 15, 1948న జన్మించారు. వెంకట శివరామకృష్ణశాస్త్రి, లక్ష్మీ ప్రసన్న దంపతులు ఈయన తల్లిదండ్రులు. పూర్తి పేరు ద్వాదశి నాగేశ్వరశాస్త్రి. సాహితీలోకానికి 'ద్వానాశాస్త్రి'గా సుపరిచితులు. చిన్నతనంలో తల్లితండ్రులు చాలా కష్టాలు అనుభవించారు. చదువుల కోసం ఉన్న పొలం కూడా అమ్ముకుని పిల్లల్ని చదివించారు. ద్వానా చదువులో అంతంత మాత్రమే. గట్టుగట్టుకు మెట్టుమెట్టుకు అనేక అవస్థలు పడుతూ ఎం.ఏ తెలుగు పూర్తి చేశారు. భాషపై డిప్లొమా, ఎం.ఫిల్‌, సాహితీ సంస్థలపై పిహెచ్‌డి చేస్తూనే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. మొదటి నుండి కూడా జంధ్యం ఎరుగని బ్రాహ్మణుడు. అన్ని ఇజాలను చదివి, చివరకు మార్క్సిజం చదివి, శ్రీశ్రీ, మార్క్సిజం పట్ల ఎనలేని అభిమానం, నమ్మకం ఉన్నవాడు. హేతువాది, శాస్త్రీయ దృక్పథం అలవరుచుకున్నాడు. సాహిత్యానికి, సమాజానికి ఉన్న సంబంధ బాంధవ్యాలను నిరూపించడం ఆధునిక సాహిత్య విమర్శ ఒక ప్రధాన లక్షణం, లక్ష్యంగా చేసే విమర్శకుడు. భౌతిక వాదిగా తనను తాను పదును పెట్టుకున్నాడు.
అప్పుడప్పుడు ప్రసంగనాదం చేస్తూ అడిగిన ప్రశ్నలకు ద్వానా ఆశువుగా సమాధానం చెప్పి రికార్డు సృష్టించారు. ఆరుగంటల పాటు సాగిన ఈ కార్యక్రమానికి 'పలకరిస్తే ప్రసంగం' వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సాధించారు. ఎన్నో అవార్డులు, రివార్డులు వస్తూనే వున్నాయి. కాగా యువ రచయితల్ని ప్రోత్సహించేందుకు 'ద్వానా సాహితీ కుటీరం' సంస్థ ద్వారా అవార్డులు ప్రదానం చేస్తూనే వున్నారు. నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు. లేదా అధ్యయనం చేస్తుంటారు. అధ్యయనంతోనే ఆత్మ విశ్వాసం, ఆత్మ విశ్వాసంతోనే మనిషికి కొండంత అండ, అవధుల్లేని పయనం చేయాలి. అంతరాలు లేని సమాజం నిర్మించాలి అంటూ నిరంతరం బోధిస్తారు. ప్రజల ఆలోచనల్ని పదునెక్కించాల్సిన పని సాహిత్యం మాత్రమే చేస్తుంది. ఆ పనిని మనం మాత్రమే చేయాలి. సమాజాన్ని సాహిత్యం ప్రతిఫలించాలి. నిరంతరం ప్రేరేపించేవారుగా ఉంటారు. అతనెప్పుడూ 'కత్తిలో చురుకైన పదును మావాడు' అన్నట్టుగానే వుంటాడు గాని నిరుత్సాహంగా, కొంపలు మునిగినట్టు ఉండడం చూడలేదు. మనిషిలో అగ్ని, ఆశ చల్లారని ఆశావాదపు కెరటం, తల్లికోడి తత్వం వారిది.
వెయ్యి చేతులతో సాహితీ సేవ చేస్తోన్న ప్యారే ద్వానా... మేరే హమ్‌ దమ్‌.

- భూపతి వెంకటేశ్వర్లు, 9490098343