పోడురైతులకు హక్కు పత్రాలివ్వాలి, కాళ్లుపట్టుకుని వేడుకున్న మహిళ

13.06.2018

ఖమ్మం జిల్లాలోని పోడుసాగుదారులకు హక్కు పత్రాలివ్వాలని, అర్హులందరికీ రైతుబంధు పథకం వర్తింపజేయాలని బీఎల్‌ఎఫ్‌ వైరా నియోజకవర్గ కన్వీనర్‌ భూక్యా వీరభద్రం డిమాండ్‌ చేశారు. బీఎల్‌ఎఫ్‌, గిరిజన సంఘం ఆధ్వర్యంలో కారేపల్లి మండలం బాజుమల్లాయిగూడెం, పాటిమీదిగుంపు గ్రామాలకు చెందిన పోడుసాగుదారులు ఖమ్మం ఆర్డీఓ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ జిల్లాలో 60ఏండ్లుగా గిరిజన, ఆదివాసీ ప్రజలు పోడుసాగు చేసుకుని జీవిస్తున్నారని, వారికి అదే జీవనాధారం అని అన్నారు. అటవీహక్కుల చట్టం ప్రకారం అర్హులైన గిరిజన, పోడుసాగుదారులకు హక్కు పత్రాలివ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదన్నారు. బాజుమల్లాయిగూడెంలో 259మంది గిరిజన, పోడుసాగుదారులకు 2008లో సర్వే చేసి ఎస్‌డీఎల్‌సీ (సబ్‌ డివిజనల్‌ లెవల్‌ సెలెక్ట్‌ కమిటీ), డీఎల్‌సీ (డిస్ట్రిక్‌ లెవల్‌ సెలెక్ట్‌ కమిటీ)లో ఆమోదం పొందిన తర్వాత తిరిగి రీసర్వే చేసి కేవలం 192మందికి మాత్రమే హక్కు పత్రాలిచ్చారని అన్నారు. కానీ నేటికీ వారి పేర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదన్నారు. హక్కుపత్రాలు ఇవ్వని రైతులకు, ఆన్‌లైన్‌లో నమోదు చేయని వారందరికీ రైతుబంధు పథకం వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయం చేయాలని ఐటీడీపీఓ పీఓ, కలెక్టర్‌తో పాటు పలువురు అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావట్లేదన్నారు. పోడు రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
కాళ్లుపట్టుకుని వేడుకున్న మహిళ
తమకు హక్కు పత్రాలివ్వాలని, రైతుబంధు పథకం వర్తింపజేయాలని వాల్య బిచ్యా అనే మహిళ ఖమ్మం ఆర్డీఓ పూర్ణచంద్ర కాళ్లు పట్టుకొని వేడుకొంది. 
స్పందించిన ఆర్డీఓ అర్హులందరికీ త్వరలో ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసి చెక్కులిచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ధర్నాలో సీపీఐ(ఎం) నాయకులు సత్యనారాయణ, సైదులునాయక్‌, కే.నరేంద్ర, విజరు, బాల్‌సింగ్‌, కే.ధనమ్మ, వినోద్‌, వీ.ఎల్లయ్య, బీ.విజయ, సీతారాములు, టీ.శాంతమ్మ పాల్గొన్నారు.