ప్రజాపోరాటాలను నీరుగార్చడం దేశభక్తా?

07.07.2018

 

తన అభిప్రాయాలను వ్యతిరేకించే వారందరినీ ద్రోహులుగా ముద్ర వేస్తున్న, దేశభక్తిని తానే గుత్తకు తీసుకున్నట్టు మాట్లాడుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌కు దేశభక్తి అంటే ఏమిటో తెలియదని వెల్లడౌతూనే ఉన్నది. దేశాన్ని బలహీనపర్చి, దేశ వ్యతిరేక శక్తులకు ప్రయోజనం కలిగించే విచ్ఛిన్నకర విధానాలను అవలంబిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ తన నిజ స్వరూపాన్ని కప్పిపెట్టటం కోసమే దేశభక్తి గురించి డంబాలు పలుకుతున్నది. మతం పేరుతో మైనారిటీలపై దాడులను, హత్యలను సంఫ్‌ు పరివార్‌ ప్రోత్సహిస్తున్నది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలలో అత్యధిక కేసులలో సంఘీయులు దోషులుగా ఉంటున్నారు. లైంగికదాడులకు గురైన మహిళలను అవమానపరిచేలా మాట్లాడుతూ నేరస్తులకు మద్దతునిస్తున్నారు. దళితులు, అభ్యుదయ శక్తులు, సంస్థలపై దాడులు చేస్తున్నారు. ఇటువంటి చట్ట వ్యతిరేక, సంఘ వ్యతిరేక చర్యలను సంఫ్‌ు పరివార్‌, దాని అనుబంధ సంస్థలు ప్రోత్సహించటంతో దేశంలో తీవ్రమైన పరిస్థితి ఏర్పడుతున్నది. 
మనుషులను కొట్టి చంపటం 
మైనారిటీలు, దళితులు, మహిళలు, అణచివేతకు గురవుతున్న ఇతర తరగతులపై ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థలు దాడులు, దౌర్జన్యాలకు పూనుకుంటున్నాయి. పశువులను దొంగిలిస్తున్నారని, ఆవులను చంపుతున్నారనే పేరుతో నిరపరాధులను హత్య చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలను అపహరిస్తున్నారని, పిల్లలను చంపి, వారి శరీరంలోని భాగాలను కాజేస్తున్నారని ప్రచారంతో ప్రజలలో భయాందోళనలు కల్పిస్తున్నారు. ప్రజలలో భయాందోళనలు పెరిగిన తర్వాత దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి ఉన్మాదంతో దేశంలోని అనేక ప్రాంతాలలో సాటి మనుషులను కొట్టి చంపుతున్నారు. చనిపోయిన బాలుని శరీరంలోని కిడ్నీలను దొంగిలించారని త్రిపుర బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రజలలో భయాందోళనలు కలిగించాయి. ప్రజలు ఆవేశంతో కొత్త వ్యక్తులపై దాడులకు తెగబడుతున్నారు. ఇటువంటి ఘటనలో చిరు వ్యాపారాలు చేసుకొనే ముగ్గురు మైనారిటీలపై దాడి చేయగా వారిలో ఒకరు మరణించారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు. ఈ విధంగా మహారాష్ట్రలో జరిగిన దాడుల్లో ఒక్క రోజులోనే ఐదుగురు మరణించారు. ఈ విధంగా సాటి మనుషులపై దాడులకు పూనుకున్న వారిపై ప్రభుత్వ యంత్రాంగం-పోలీసులు, న్యాయ వ్యవస్థ, ఇతర అధికార సంస్థలు తగిన చర్యలు తీసుకోవటం లేదు. అధికారంలో ఉన్న బీజేపీ, సంఫ్‌ు పరివార్‌ ఇతర అనుబంధ సంస్థలు బహిరంగంగా నేరస్తులకు మద్దతునిస్తున్నాయి. నేరస్తులపై కేసులు నమోదు చేయవద్దని పోలీసులపై వత్తిడి తీసుకొస్తున్నాయి. ఫలితంగా పోలీసులు ఎక్కువ సందర్భాలలో కేసులు నమోదు చేయటం లేదు. నమోదు చేసిన సందర్భాలలో కూడా 'గుర్తు తెలియని వ్యక్తులు' అని పేర్కొంటూ, నేరస్తులు తప్పించుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు. ఫలితంగా హత్యలు చేసిన నేరస్తులు కూడా స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. మైనారిటీలు, దళితులు, మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, లైంగిక దాడులు, హత్యలు చేస్తే శిక్షలు పడతాయనే భయం పోయింది. దీని ఫలితంగానే ఆ తరగతులపై దాడులూ హత్యలూ పెరిగిపోయాయి. వారు భయంతో బతకవలసిన పరిస్థితి ఏర్పడింది. దేశ ప్రజానీకం మతాలవారీగా చీలిపోవటానికి, మత ఘర్షణలు తలెత్తటానికి సంఫ్‌ు పరివార్‌ చర్యలు దోహదం చేస్తున్నాయి. 
నాడు బ్రిటిష్‌ వారి ఎత్తులు
బ్రిటిష్‌ వారు మన దేశాన్ని పాలిస్తున్నప్పుడు వారి దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా దేశ ప్రజలు కులమతాలతో నిమిత్తం లేకుండా జాతీయోద్యమంలో భాగస్వాము లయ్యారు. జాతీయోద్యమం బలం పుంజుకోవటంతో భారతదేశంలో తమ పాలనకు అంతిమ ఘడియలు సమీపించాయని బ్రిటిష్‌ పాలకులకు ఆందోళన పెరిగింది. భారతదేశంలో తమ పాలన కొనసాగాలంటే భారతీయులను మత ప్రాతిపదికన విభజించటమే మార్గమని బ్రిటిష్‌ వారు భావించారు. అందుకనుగుణంగానే హిందూ, ముస్లీంల మధ్య వైరాన్ని పెంచి, మత ఘర్షణలు సృష్టించటానికి పూనుకున్నారు. ఆ రోజు భారత ప్రజలలో మత ప్రాతిపదికన చీలికలు రావటంతో బ్రిటిష్‌ వారు ప్రయోజనం పొందారు. భారతీయులు నష్టపోయారు. దానిని నివారించటం కోసం గాంధీజీ, జాతీయోద్యమం, కమ్యూనిస్టులు, ఇతర అభ్యుదయశక్తులూ శక్తివంతమైన కృషిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆనాడు బ్రిటిష్‌ వారి ఎత్తుగడలను బలపరిచింది. ఆరోజు బ్రిటిష్‌ వారు తమ వలస పాలనకు ఆటంకాలను తొలగించుకోవటానికి, భారత ప్రజలపై తమ దోపిడీని శాశ్వతం చేయటానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు బ్రిటిష్‌ వారు అనుసరించిన విధానాలనే ఈనాడు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుసరిస్తున్నది. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుసరిస్తున్న విధానాల వలన భారతదేశ ప్రజలు మతపరంగా చీలిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈనాడు ఆర్‌ఎస్‌ఎస్‌ మతపరంగా దేశాన్ని విభజించటం వలన ఎవరు ప్రయోజనం పొందుతారు? 
నేడు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎత్తులు
దేశంలో అధికారంలో ఉన్న బూర్జువా, భూస్వామ్య వర్గాల ప్రభుత్వాలు సరళీకరణ విధానాలను అమలు జరుపుతూ ప్రజలను తీవ్రంగా దోపిడీ చేస్తున్నాయి. దోపిడీదారులుగా ఉన్న కార్పొరేట్‌, బహుళజాతి సంస్థలకు ప్రభుత్వాలు ప్రజల సంపదను కట్టబెడుతున్నాయి. రైతాంగ భూములు, పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములు, గనులు, అడవులు, జల వనరులు తదితరాలను దోపిడీదారులకు కట్టబెడుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా వీరికి ప్రభుత్వాలు అప్పగిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకులలో లక్షల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్నారు. దేశసంపదను దిగమింగుతున్న వీరికి ప్రభుత్వాలు పూర్తి మద్దతును ఇస్తున్నాయి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు, బహుళజాతి, కార్పొరేట్‌ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు, యువజన, విద్యార్థులు, మహిళలు, ఇతర పీడిత వర్గాలు, తరగతులలో వ్యతిరేకత పెరుగు తున్నది. అనేక సందర్భాలలో దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు సమైక్యంగా కదులుతున్నారు. ఈ విధంగా ప్రజల ఐక్యంగా ముందుకుపోతే దోపిడీ విధానాలకు పీడిత ప్రజలు చరమగీతం పాడతారు. దోపిడీదారులను పారదోలతారు. ఆ విధంగా పెరుగుతున్న పీడిత ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయటానికే ఆర్‌ఎస్‌ఎస్‌ మతపరంగా ప్రజలను చీల్చటానికి పూనుకున్నది. మైనారిటీలు, దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్నది. ఆనాడూ, ఈనాడూ ఎప్పుడూ దోపిడీదారుల పక్షమేనని ఆర్‌ఎస్‌ఎస్‌ రుజువు చేసుకుంటున్నది. ప్రజలు ఆర్‌ఎస్‌ఎస్‌ ఎత్తులను అర్థం చేసుకోలేకపోతే, మతాలు, కులాలవారీగా చీలిపోతే శ్రామిక ప్రజల పోరాటశక్తి మరింతగా బలహీన పడుతుంది. దోపిడీ మరింత తీవ్రం, శాశ్వతం అవుతుంది. ప్రజల జీవితాలు మరింత దుర్భరం అవుతాయి. కాలం చెల్లిన ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలు దేశాన్ని అభ్యుదయ మార్గంలో నడపలేవు. దోపిడీదారులకు భజన చేసే తన విధానాలను కప్పిపుచ్చు కోవటానికే ఆర్‌ఎస్‌ఎస్‌ అనుయాయులు దేశభక్తి ముసుగులో ప్రజా పోరాటాలను నీరుగార్చటానికి ప్రయత్నిస్తున్నారు. పీడిత ప్రజలను ఐక్యం చేయటం ద్వారా ప్రజా పోరాటాలను పెంపొందించి, దోపిడీ నుంచి విముక్తి చేయటం దేశభక్తా, లేక దేశ-విదేశీ దోపిడీదారులకు దేశ సంపదను కట్టబెట్టటం కోసం ప్రజల ఐక్యతను, పోరాటాలను నీరుగార్చటం దేశభక్తా? మతాల పేరుతో మారణహోమం సృష్టించటం దేశభక్తా?

- ఎ. కోటిరెడ్డి