ప్రతి ఊరూ రంగస్థలం కావాలి - అర్హులకు భూ పంపిణీ చేయకుంటే ఉద్యమం : బి.వెంకట్‌

13.06.2018

 
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి ఊరునూ రంగస్థలంగా మార్చాలని బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు బి వెంకట్‌ పిలుపునిచ్చారు. వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ ప్రాంతంలో పెత్తందారుల ఆధీనంలో గల భూముల్లో రాష్ట్ర మంత్రులకు, అధికార పార్టీ నేతలకు వాటాలున్నాయని, అందుకే ఆక్రమణపై ప్రభుత్వయంత్రాంగం స్పందించట్లేదని విమర్శించారు. పెత్తందారుల ఆధీనంలోని భూములను పేదలకు పంచకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వికారాబాద్‌ అభివద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, యూనివర్సిటీ మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. నీటి వనరులు కల్పించి తాగు,సాగునీటి ఇబ్బందులు తొలగించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, వికారాబాద్‌ ప్రాంతాలకు వచ్చే అవకాశం లేనందున విద్యాభివద్ధి కోసం వర్సిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. భవిష్యత్‌లో వికారాబాద్‌ జిల్లా ఎడారిగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో పేద రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొని కొందరు ఫాంహౌస్‌లను ఏర్పాటు చేశారని తెలిపారు. అందులో మంత్రులకు వాటాలున్నాయని చెప్పారు. జిల్లాను మంత్రులు దోచుకోవడం తప్ప అభివద్ధి చేయట్లేదని విమర్శించారు. ఫాంహౌస్‌ యజమానులకు రైతుబంధు పథకాన్ని ఎలా వర్తింపజేస్తారని ప్రశ్నించారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని నాలుగు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఆయన అనుచరులు సీలింగ్‌ భూములను కబ్జా చేసి, సాగు చేస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టదా అని నిలదీశారు. భూ ప్రక్షాళనలో భాగంగా భూముల రికార్డులు సరి చేస్తామని ప్రభుత్వం ప్రక టించినా, ఇప్పటివరకు పేదలకిచ్చిన సీలింగ్‌, ప్రభుత్వ మిగులు భూములపై హక్కులను కల్పించి, పట్టా దారు పాసు పుస్తకాలను జారీ చేయ లేదన్నారు. ఫలితంగా ఎక్కువమంది దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల రైతులకు రైతుబంధు పథకం అందలేదని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను ముఖ్యమంత్రి బెదిరిం చడం సరైంది కాదన్నారు. వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు మాట్లా డుతూ 1975 నుంచి కొడంగల్‌లో 1165 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమిని పేదలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. పెత్తందారులు వారిని బెదిరించి స్వాధీనంలోకి తీసుకున్నారని వాపోయారు. సీలింగ్‌ యాక్ట్‌ను తుంగలో తొక్కి పేద ప్రజలపై దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో టీమాస్‌ జిల్లా అధ్యక్షుడు సాధు సత్యానంద్‌. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లేష్‌, వెనుకబడిన వర్గాల నాయ కులు వెంకట్‌, సుభాష్‌, రవి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర నాయకులు నాగయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలో బీఎల్‌ఎఫ్‌తో ప్రత్యామ్నాయం సృష్టిస్తామన్నారు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ, డబుల్‌బెడ్రూమ్‌ ఇండ్లల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సిద్దిపేట అర్బన్‌ మండల ప్రాంతంలో కిరాయికి నివాసం ఉంటున్న నిరుపేదలకు, అసంఘటిత కార్మికులకు ఇండ్ల స్థలాలివ్వ కుంటే కలెక్టరేట్‌ను దిగ్బంధిస్తామని బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర నాయ కుల ఎస్‌. రమ హెచ్చరించారు. సిద్దిపేటలో ఆమె బీఎల్‌ ఎఫ్‌ బృందం తరపున సర్వే చేశారు. అర్హులైన పేదలందరికి రేషన్‌ కార్డు, పింఛన్లు అందించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు ప్రసాద్‌ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట మండలంలోని బండగొండ, కోటకొండ గ్రామాలను, దేవరకద్ర మండల కేంద్రాన్ని బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు సాగర్‌, బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను బీఎల్‌ఎఫ్‌ నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. రైతుబంధు పాసు పుస్తకాల్లో తప్పులున్నాయని, సవరించాలని తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రతి ఊరికీ డబుల్‌బెడ్రూమ్‌ ఇండ్లు కేటాయిస్తామన్న పాలకులు హామీలు మరిచారని ఆందోళన చెందారు. జోగులాంబ గద్వాల జిల్లాలో రాష్ట్ర నాయకులు కిల్లెగోపాల్‌ పాల్గొన్నారు. బహుజన రాజ్యాధికారం కోసం ప్రజలు బీఎల్‌ఎఫ్‌లోకి రావాలని కోరారు.