బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా..?

09.07.2018

అధికారంలోకి వచ్చిన నాలుగేండ్ల తర్వాత బీసీలు, ఎంబీసీలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తొచ్చారా..?అని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) రాష్ట్ర చైర్మెన్‌ నల్లా సూర్యప్రకాశ్‌, రాష్ట్ర కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎల్‌ఎఫ్‌ ఏర్పాటు చేసిన తర్వాతే బీసీల గురించి కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని అన్నారు. రూ.రెండు లక్షల వరకూ బీసీలకు ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలివ్వడమే ప్రకటన కూడా గతంలో ఇచ్చిన హామీల మాదిరిగానే మిగిలిపోయే అవకాశముందని చెప్పారు. ఆదివారం ముషీరాబాద్‌లోని బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆ ఫ్రంట్‌ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లా సూర్యప్రకాశ్‌ మాట్లాడుతూ...బీసీలకు రుణాలిస్తానని గతంలోనూ కేసీఆర్‌ ప్రకటించారనీ, కానీ ఆచరణలో అమలుకు నోచుకోలేదని చెప్పారు. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తాననీ, అన్ని కులాలకు భవనాలు కట్టిస్తామనీ, పలు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు నిర్మిస్తానని వాగ్ధానాలు చేశారని గుర్తుచేశారు. కేసీఆర్‌ బూటకపు ప్రకటనలు చేస్తున్నారని, అవి కేవలం వాగ్ధానాలకే పరిమితమని విమర్శించారు. జులై, ఆగస్టు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓటు చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అందరికీ ఓటు కల్పించాలనే దానికి కాంగ్రెస్‌ వ్యతిరేకమనీ, కానీ అంబేద్కర్‌ కృషితో అందరికీ ఓటు హక్కు వచ్చిందని తెలిపారు. ఈనెల 15న హైదరాబాద్‌లో 'ఎన్నికల సంస్కరణలు- ఆవశ్యకత, తెలంగాణలో బహుజన ప్రభుత్వం -ఓటరు పాత్ర' అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సదస్సుకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు ప్రకాశ్‌ అంబేద్కర్‌ పాల్గొంటున్నారని వివరించారు. 
తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ...కేసీఆర్‌ హామీలన్నీ బూటకమేనని అన్నారు. బీసీలకు తాయిళాలు అవసరం లేదనీ, చట్టబద్ధ హక్కులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌ చట్టం, ఎంబీసీలకు వెయ్యికోట్ల కేటాయింపులు, ఎంబీసీ కులాల గుర్తింపు....ఇవన్నీ ఏమయ్యాయనీ ప్రశ్నించారు. ఎంబీసీలకు నిధులు కేటాయించినా ఖర్చు చేయడం లేదన్నారు. సంచార జాతులకు చెందిన కులాలను గుర్తించి, వారికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్‌ కేవలం కొన్ని కులాల నాయకులకు పదవులిచ్చి వారిని సంతృప్తి పరుస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నాయకులకు నిజంగా బీసీలపై ప్రేముంటే, వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు కేటాయిస్తారో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. బీసీలకు 60కి పైగా సీట్లు, ముఖ్యమంత్రి పదవి, ఉపముఖ్యమంత్రి పదవి మహిళలకు కేటాయిస్తామని బీఎల్‌ఎఫ్‌ ఇప్పటికే ప్రకటించిందని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. డబ్బు, అగ్రకుల ఆదిపత్యం నుంచి ఓటుకు విముక్తి కల్పించేందుకు రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఈనెల 15న జరిగే సదస్సులో ఆర్థిక పథకాలతో పాటు దేశంలో ఎక్కడా లేని ఓ అద్ధుతమైన పథకాన్ని ప్రవేశపెడతామనీ తెలిపారు. అధికారంలోకి రాకముందే ఆ పథకాన్ని బీఎల్‌ఎఫ్‌ అమలు చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర నేతలు మద్దికాయల అశోక్‌, చెరుపల్లి సీతారాములు, జలజం సత్యనారాయణ, జానకి రాములు, శ్రీనివాస్‌ బహదూర్‌, ఆనంద్‌, గొర్రె రమేశ్‌, మన్నారం నాగరాజు, గుజ్జా రమేశ్‌, చంద్రమౌళి, శ్రీరాములు శ్రీనివాస్‌, మురళీధర్‌ దేశ్‌పాండే, విజరుకుమార్‌, వెంకట్‌దాస్‌, పటేల్‌ వనజా, జి రాములు, నాగయ్య, గుర్రాల సంతోష్‌రెడ్డి, శ్రీరాంనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.