మన ఎమ్మెల్యేలు నయా జమీందార్లు

12.07.2018

 

మనదేశంలో ఎన్నికలు నానాటికీ పెద్ద పందెంతో ఆడే జూదంలా మారుతున్నాయి. ఈ జూదంలో గెలిచిన వారు తమకు జమిందారీ హక్కులు లభించినట్టు భావిస్తున్నారు. తాము చట్టసభల సభ్యులమన్న స్పృహ వారిలోనూ అలాగే ప్రజల్లోనూ లేకుండా పోతోంది. తమ శిశ్రూషలతో రాజులను నవాబులను మెప్పించి వెనుకటికి జమిందార్లు వివిధ హక్కులను దక్కించుకొన్నట్టుగానే నేడు మన ప్రజాప్రతినిధులు ప్రవర్తిస్తున్నారు. పార్టీ అధినేతల తీరు ఇదివరకటి రాజుల తరహాలోనే ఉంటోంది. ప్రస్తుత ఎన్నికలు ఇందుకు పూర్తి అవకాశం కలిగిస్తోంది. ప్రజాప్రతినిధులు కాదల్చినవారు బీఫాంలు కొనాలి. మీడియాను కొనాలి. ఓటరును కొనాలి. చేసిన ఖర్చుకు పదింతలు ప్రజల నుండి వసూల్‌ చేయాలి. గతంలో జమిందార్లు, జాగీర్దార్లు చేసిందదేగా! రాచరిక జమిందారీ వ్యవస్థ తరహాలోనే కిందిస్థాయి వరకు ప్రజాప్రతినిధులకు, పార్టీ అధినేతలకు వారసత్వ హక్కులు కూడా పదిలంగానే కొనసాగుతున్నాయి.
జమిందార్లకు శిస్తు వసూల్‌తో పాటు పోలీసింగ్‌ హక్కులు దక్కేవి. అప్పటికి అవి మాత్రమే ప్రధానమైన పాలనా వ్యవహారాలు. ఇప్పుడు ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో రెవెన్యూ, పోలీస్‌ విభాగాలే కాదు అన్ని విభాగాల్లోనూ అధికారం చెలాయిస్తున్నారు. వారి సమ్మతి లేకుండా కీలక ఉద్యోగుల పోస్టింగ్‌లేవీ నియోజకవర్గాల పరిధిలో జరగవు. ప్రయివేట్‌ సంస్థలు కూడా వారి సమ్మతి లేకుండా పని చేయలేవు. చివరికి మీడియా విలేకరుల నియామకాలు కూడా చాలా చోట్ల వారి సమ్మతి ప్రకారం జరగాల్సిందే. ఈ తరహా పరిపాలనను చట్టం అనుమతించదు. అయినా జరుగుతున్నదదే.
ప్రభుత్వాలు, పార్టీల నాయకత్వాలు చట్టసభల సభ్యులపై వచ్చే ఫిర్యాదులను పట్టించుకోవు. దాని అర్థం వారిని వెనకేసుకొని రావడమే. వారి మద్దతుతో నడిచే భూకబ్జాలను అడ్డుకోబోయిన అధికారులు ప్రభుత్వం నుండి పార్టీల నాయకుల నుండి రుసరుసలు ఎదుర్కొంటున్నారు. అధికారులపై, సిబ్బందిపై ప్రజా ప్రతినిధులు బూతుల జడివాన కురిపించినా ప్రభుత్వాలు పట్టించుకోవు. ప్రభుత్వమే కాదు ఉన్నతాధికారుల, ఉద్యోగుల సంఘాలు నోరువిప్పవు. సోషల్‌ మీడియా సౌకర్యం పుణ్యమా అని ప్రజా ప్రతినిధులు, తమపై కురిపించిన బూతులను కొందరు ఉద్యోగులు రికార్డు చేసి తెగింపుతో పదిమందిలో పెడుతున్నారు. అయినా ప్రభుత్వాలు స్పందించవు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా అదే స్థితి. ఉద్యోగులపై అధికారులపై బహిరంగంగా చేయి చేసుకొని తమ ప్రతాపం చూపెట్టాలన్న తపన ఈ నయా జమిందారుల్లో పెరిగిపోతోంది.
మన ఎన్నికల వ్యవస్థలోని లోపం కూడా దీనికి ఒక కారణం. కమ్యూనిస్టు పార్టీలు మినహాయిస్తే ఇతర పార్టీల్లో బీఫాంల కోసం, ఎన్నికల కోసం చేసే ఖర్చు అవధులు దాటిపోయింది. కోట్లకు కోట్లు ఆస్తులు, ఆదాయాలు ఉన్నవారే ఎన్నికల్లోకి పోటీకి అర్హులయ్యారు. అభ్యర్ధి ఖర్చుపై పార్టీ ఖర్చుపై విధించిన పరిమితులను అమలు చేయడంపై ఎన్నికల సంఘానికి ఆసక్తి లేదు. ఒకపార్టీ చేసే ఖర్చుకంటే అభ్యర్ధులు చేసే ఖర్చు ఎన్నో రెట్లు ఎక్కువ. ఈ నేపధ్యంలో ఏ పార్టీ టికెట్‌పై గెలిచినా వీలైనంత త్వరలో అధికార పార్టీలోకి ఫిరాయించి జమిందారీ హక్కులు దక్కించుకోవాలన్న ఆత్రుత దేశమంతటా చట్టసభల సభ్యుల్లో కన్పిస్తుంది. కులబలంతో పాటు ధనబలం గత ఫిరాయింపుదార్లకు మంత్రి పదవులు ఇతర కీలక పదవులు దక్కుతున్నాయి. నిసిగ్గుగా ప్రభుత్వాలు ఫిరాయింపులను ప్రేరేపిస్తూ మీసాలు మెలేస్తున్నాయి.
వీటన్నింటి ఫలితంగా తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ బలం శాసనసభలో 63 నుండి 85కు పెరిగింది. ఇందులో కాంగ్రెస్‌ నుంచి ఉప ఎన్నికల్లో గెలిచిన సీట్లు రెండున్నాయి. టీడీపీ 15 సీట్లలో ఎన్నికయితే ఇప్పుడు ఇద్దరు మిగిలారు. ఒకరు తప్ప మిగతావారు టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ సభ్యుడు తెలంగాణలో రెడ్ల పాలన కావాలని బట్టబయలుగానే పిలుపునిచ్చారు. ఫిరాయింపుదార్లను టీఆర్‌ఎస్‌ ఎంతగా నెత్తికెత్తుకొందంటే ఆ పార్టీలో మొదటి నుంచీ ఉన్నవారు కక్కలేక మింగలేక రగిలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఇదే పని చేసింది. వైసీపీ సభ్యులను పెద్ద సంఖ్యలో తన పార్టీలో చేర్చుకొంది. ఈ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో, బలమైన సంపన్న కులాల మద్దతు పొందాలన్న లక్ష్యం కూడా ముఖ్యమైందే. బహుజనులపై సంపన్న కులాల పెత్తనానికి ప్రస్తుత ఎన్నికల విధానం చక్కగా ఉపయోగపడుతోంది. 
పార్టీ ఫిరాయింపులపై అన్ని పార్టీలు గగ్గోలు పెడతాయి. కానీ గమనించాల్సిందేమిటంటే ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగుల తొలగింపునకు బాధిత పార్టీలేవీ అనధికార బిల్లును ప్రవేశ పెట్టలేదు. ప్రస్తుత లా కమిషన్‌ ధోరణేమో ఫిరాయింపుల నిరోధక చట్టాన్నే బలహీనపరిచేటట్టు ఉంది. జంప్‌జలానీల విషయంలో చట్టసభల స్పీకర్లు వెంటనే నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు. స్పీకర్లు, సీఎంలూ అందరూ ఈ నాటకంలో పాత్రధారులే. కాగా స్పీకర్లు ఎలాగూ తాత్సారం చేస్తున్నారు కనుక ఫిరాయింపులను అనుమతిస్తే పోలేదా అన్న ధోరణి లా కమిషన్‌ పరిశీలనాంశాల్లో కన్పిస్తోంది. 
ఎగ్జిక్యూటివ్‌ బాధ్యతలు లేని చట్టసభల సభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి పేర నిధులు కేటాయించడం పెద్ద తప్పు. ఆ నిధులను దేనికి ఖర్చు చేయాలో కూడా చెప్పని సభ్యులూ ఉన్నారు. మీకు కేటాయించిన నిధులను ఎందుకు ఖర్చు చేయలేదని అడిగే అధికారం చట్టసభలకూ లేదు. ప్రభుత్వానికీ లేదు. కేటాయించిన నిధుల ఖర్చుకు బాధ్యత వహించని వారికి నిధులు కేటాయించడంలో ఏదైనా ఔచిత్యముందా? చట్టసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. జవాబు పొందవచ్చు. ఒక సభ్యుడిని ప్రశ్నించడానికి సభలో అవకాశమే లేదు. సభ్యుడు సమాధానం చెప్పడానికీ లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రమే చట్టసభల్లో సమాధానం చెప్తారు. ఫలానా వారు తమకు కేటాయించిన నిధులను ఖర్చు చేయలేదని ఏదైనా చర్చ సందర్భంగా మరో సభ్యుడు ప్రస్తావించవచ్చు. దానికి సమాధానం ఇచ్చి తీరవలసిన బాధ్యతా విమర్శ ఎదుర్కొన్న సభ్యుడికి లేదు. సీపీఐ(ఎం) తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్టసభల సభ్యులకు నియోజక వర్గ అభివృద్ధి నిధుల పేర కేటాయించడం లేదు. ఆ నిధులేవో నేరుగా స్థానిక సంస్థలకే కేటాయిస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ చట్టసభల సభ్యులకు నిధులు కేటాయించడమంటే స్థానిక సంస్థలను బలహీనపర్చడమే!
ఎన్నికల్లో డబ్బుది ప్రధాన పాత్ర అయ్యాక చట్టసభల్లో సభ్యుల నేపధ్యం కూడా వేగంగా మారిపోతోంది. వేలకోట్ల టర్నోవర్‌ గల వ్యాపారులే సభ్యులుగా ఎన్నికయి వస్తున్నారు. సమాజ సేవ వృత్తిగా గల వారి సంఖ్య లేకుండా పోతోంది. సమస్త ప్రజలకు సంబంధించిన విధాన నిర్ణయాలు ఈ వ్యాపారులే తీసుకొంటున్నారు. సామాజిక న్యాయం అన్నది నేడు గొప్ప చర్చనీయాంశమే అయినప్పటికీ చట్టసభల్లో కింది కులాల ప్రాతినిధ్యం బలహీనంగానే ఉంటోంది. తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలుంటే పై కులాల వారి సంఖ్య 68 కాగా, బీసీల సంఖ్య 20 మాత్రమే. రిజర్వుడ్‌ స్థానాల్లో తప్ప జనరల్‌ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీలు గెలిచే స్థితి లేదు. బీసీల్లోనూ పై నాలుగైదు కులాలవారు తప్ప ఆర్థికంగా, సామాజికంగా విద్యాపరంగా బాగా వెనుకబడిన కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కలేదు. ప్రస్తుత ఎన్నికల విధానం బాగా వెనుకబడిన కులాలు ప్రాతినిధ్యం పొందేట్టుగా లేదు.
మనుస్మృతి స్థానంలో రిపబ్లిక్‌ రాజ్యాంగం అమల్లోకి వచ్చినా అధికారం కొద్ది సంపన్న కులాల చేతుల్లోనే ఉంటోంది. ప్రస్తుత ఎన్నికల విధానం మెజారిటీ ఓట్లు సాధించని పార్టీలను అధికారంలో కూర్చో బెడ్తోంది. తక్కువ ఓట్లతో ఎక్కువ సీట్లు తెచ్చుకొనే అవకాశం నేటి ఎన్నికల విధానానికి ఉంది. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ అభిమతం చెల్లుబాటు కావాలి. కాని ఆచరణలో మెజారిటీ ఓటర్ల అభిమతం చెల్లుబాటయ్యే అవకాశం లేకుండా పోతోంది. నలుగురు పోటీ చేస్తే నలుగురిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు సభ్యుడిగా ఎన్నికవుతున్నారు. మిగతా ముగ్గురు అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కలిపితే గెలిచిన అభ్యర్థికంటే ఎక్కువ ఓట్లు రావచ్చు. అయినా ముగ్గురు సభ్యులకు వచ్చిన ఓటుకు ఎలాంటి విలువ లేకుండా పోతోంది. ఈ విధానంలో మార్పు అవసరం. ఓటర్ల అభిమతం చెల్లుబాటు గావాలి. దానికి ఉన్న అవకాశం గురించి ఆలోచించాల్సిన అవసరం నేడు ఏర్పడింది. ప్రపంచంలో వివిధ దేశాలు వివిధ ఎన్నికల పద్ధతులనుసరిస్తున్నాయి. అందులో దామాషా ఎన్నికల పద్ధతి ప్రధానమైంది. దామాషా ఎన్నికల విధానాన్ని మనం అనుసరిస్తే ఎన్నికల విధానంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కొంతవరకైనా పరిష్కారం లభిస్తుంది. ప్రజల అభిమతం మరింతగా చెల్లుబాటు అవుతుంది. జంప్‌ జిలానీలకూ ఆస్కారముండదు. ప్రాతినిధ్యం లభించని కులాలకు ప్రాతినిధ్యం లభించే అవకాశముంది. పార్టీలు గానే జంపింగ్‌లుంటాయి కదా! అంటే ఉండవచ్చు. ఏమైనా అది దీనికంటే బెటర్‌ గదా! 
 

- ఎస్‌. వినయకుమార్‌