మహిళల భద్రతా రాజకీయం...

13.06.2018

 

ఎన్నికల సమయం సమీపించే కొద్దీ ప్రతిఒక్కటీ రాజకీయరంగు పులుముకుంటుంది. ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి బస్సుల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు 140 కోట్లు కావాలని ప్రతిపాదన పంపించింది. ఇది జరిగింది 2016లో నిర్భయనిధి ఏర్పాటులో రెండు ప్రధానాంశాలు. ఒకటి స్త్రీలకు బహిరంగ ప్రదేశాలలో (బస్సులు, బస్‌స్టాప్‌లు, రైల్వేలు, పార్కులు, రోడ్లు) భద్రత కల్పించడం, రెండోది బాధితులకు పరిహారం చెల్లించడం. నిర్భయ నిధి 4వేల కోట్లు కేటాయింపులు జరగగా (2013 నుండి 2017వరకు) దానిలో కేవలం 240 కోట్లు ఖర్చుచేశామని లోక్‌సభకు యిచ్చిన జవాబులో మేనకాగాంధీ చెప్పారు. మిగిలిన నిధి ఖర్చు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాల నుండి ప్రతిపాదనలు రావాలనీ ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనీ చెప్పారు.
గతేడాది ఈ ఏడాది 150 వన్‌స్టాప్‌ సెంటర్ల ఏర్పాటుకు ఖర్చు చేయగా, ఇప్పుడు నికరంగా 3100 కోట్లు నిర్భయ నిధి కదలకుండా పడిఉంది. అయినా ఆప్‌ ప్రభుత్వ ప్రతిపాదనకు మోకాలడ్డంపెట్టి కూర్చుంది ఆ మంత్రిత్వశాఖ. ఇప్పుడొక ప్రెస్‌మీట్‌ పెట్టి సీసీటీవీ కెమెరాల వల్ల ప్రయోజనం లేదని మేనకాగాంధీ వివరణ యిచ్చారు. సీసీటీవీ కెమెరాల వలన ప్రయోజనం లేకుంటే అన్నిప్రదేశాలలో చివరికి అపార్ట్‌మెంట్‌ బ్లాకులో కూడా ఏర్పాటు చేయాలని ఎందుకు నిబంధనలు విధిస్తున్నారు. వీఐపీల ఇండ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు,రక్షణశాఖ ఉన్న ప్రతి చోటా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు?
సీసీటీవీ కెమెరాలు నేరాన్ని నిరోధించగలవా? లేదు. కానీ ఏ వ్యక్తి అయినా తన ప్రవర్తన రికార్డు అవుతుందంటే జాగ్రత్త పడతారు. ఒకవేళ దాన్ని లెక్కచేయకుండా ప్రవర్తిస్తే పట్టుకోవడం తేలికవుతుంది. ఈ రికార్డును సాక్ష్యంగా కోర్టులు ఆమోదించాయి. ఇక బహిరంగ ప్రదేశాల్లో కెమెరాలకు అందేలా నేరం చేస్తారా అని మేనక ప్రశ్నించారు. నిజమే చేయరు. కానీ చేసినవారి రాక పోకలు, కదలికలు రికార్డు అవుతాయి. నిందితుల్ని గుర్తించడం తేలిక. ''రద్దీగా ఉన్న బస్సుల్లో యిలాంటివి జరిగినప్పుడు కెమెరా రికార్డు చేయలేదు. కెమెరాలు నిందితులు బద్దలు కొట్టవచ్చు. కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం చేయను'' అని కూడా ఆమె సెలవిచ్చారు.
కనీసం రద్దీగా ఉన్న బస్సుల్లో, మెట్రోల్లో లైంగిక వేధింపులు ఉన్నాయని ఆమె ఒప్పుకున్నందుకు సంతోషించాలి. 'అచ్చేదిన్‌' వచ్చేశాయి కనుక అందరూ మారుమనస్సు పొంది వేధింపులు ఆపేశారు అన్లేదు. నిజానికి ప్రజారవాణాలో ప్రయాణం చేసే స్త్రీలలో 76శాతం మంది మహిళలు ఏదో ఒక రకమైన వేధింపులకు అంటే తాకటం, తడమటం, గిల్లడం, వత్తడం వంటి వాటికి గురవుతున్నామని వెల్లడించారు. 93శాతం మంది అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు గురయ్యామని వాపోయారు. దీనివలన స్త్రీలు విపరీతమైన అవమానంతో కుచించుకుపో తున్నారు. భయాందోళనలతో ప్రయాణిస్తున్నారు. ఇది వారి వ్యక్తిగత జీవితంపైనే కాక వృత్తిజీవితం పైన కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావం కలిగిస్తున్నది. దీనిని నివారించడం అత్యవసరం. 
రద్దీగా ఉన్న బస్సులో ఢిల్లీలో ఒకడు ఒక బాలికను వెనుక నుండి తాకుతూ స్వయం తృప్తికి పాల్పడిన ఘటనను చూశాం. అంటే 360 డిగ్రీలు తిరిగే కెమెరాలు యివి రికార్డు చేయగలవని తేలింది. నిందితులు కెమెరాలు పగలుగొట్టినా వాటి ఫుటేజీ సర్వర్‌కు చేరుతుంది. కాబట్టి నిందితుడు తప్పించుకోలేడు.
ఇక ప్రజాధనం దుర్వినియోగం అంటే ''మోడీ వ్యక్తిగత ప్రచారానికి గత నాలుగేండ్లలో 4343.26 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది ఎన్‌డీయే ప్రభుత్వం. దాన్ని ఆమె అదుపుచేస్తారా? భారీ విగ్రహాలకు 3వేల కోట్లతో పటేల్‌ విగ్రహం, 2వేల కోట్లతో శివాజీ విగ్రహం ఇంకా యితర విగ్రహాలకు పెట్టే ఖర్చును ఏమంటారు? విగ్రహాలు పెట్టి ఆ నాయకులకు అదనపు కీర్తి ఏమన్నా యిస్తున్నారా? ఈ దుర్వినియోగం గురించి ఆమె కేబినెట్‌లో మాట్లాడగలరా? ఇది సీసీకెమెరాలకు మార్కెట్‌ కల్పించడం కోసం చెబుతున్న అంశం కాదు. టెక్నాలజీ ఉన్నప్పుడు దాన్ని నేరనివారణకు ప్రతిభావంతంగా వినియోగించాలన్నదే సారాంశం.
ఢిల్లీ ప్రభుత్వానికి మొండిచేయి చూపడానికి కారణం ఆ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చూపించి రానున్న ఎన్నికల్లో లబ్దిపొందాలనే. నిజానికి గత రెండేండ్లుగా ఢిల్లీ నేరాల సంఖ్యలో అగ్రభాగాన ఉన్నా క్రైమ్‌రేటు తగ్గింది. ఢిల్లీ ప్రభుత్వం తన దగ్గర ఉన్న నిధుల్ని ఖర్చుచేయవచ్చుగదా! వాళ్లు 160 కోట్లతో అన్ని పాఠశాలల్లో ఏర్పాటుచేస్తున్నారు గదా! అనే వాదన కూడా ఉంది. ఇక్కడ ఆలోచించాల్సింది నిర్భయనిధిలో రాష్ట్రాల వాటా వారికి దక్కాలిగదా! ఢిల్లీ ప్రభుత్వం తన నిధుల్ని వేరేదానికి ఖర్చుచేసుకుంటుంది. ప్రశ్నించాల్సింది ఢిల్లీకి యివ్వాల్సిందానికి ఎందుకు అడ్డం పడుతున్నారని?
నిర్భయనిధి కావచ్చు మరేదైనా కావచ్చు. కేంద్ర ప్రభుత్వం అస్మదీయులకు పెద్ద విస్తళ్ళు వేసి మిగిలిన వారిని బద్‌నాం చేసే కుటిల రాజనీతి నడుపుతున్నదనేది స్పష్టంగానే కనబడుతున్నది.
స్త్రీ భద్రత గురించి అన్ని విషయాల్లో మోడీ ప్రభుత్వం వైఫల్యాలు కండ్లకు కట్టినట్టు కనబడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, మహారాష్ట్రలు స్త్రీలపై హింసలో ప్రధమస్థానాల్లో ఉన్నాయి. ఇవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలే. హర్యానాలో 'జాట్‌' ఊరేగింపు సందర్భంగా జాతీయ రహదారిపై జరిగిన అకృత్యాలతో ప్రారంభిస్తే మొన్నటి 15 ఏండ్ల బాలిక సామూహిక లైంగికదాడి దాకా నిందితులు యధేచ్ఛగా తిరుగుతున్నారు. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లో దళితులు, దళిత మహిళలపై దాడులకు అడ్డాలుగా మారాయి. చత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌లలో ఆదివాసీలపై జరుగుతున్న లైంగికదాడులు రిపోర్టు కూడా కావడం లేదు. 
అసలు మహిళలు బయట తిరగకూడదని చదువు - ఉద్యోగం వారి పనికాదని, వారికి 13 ఏండ్లకే పెండ్లిండ్లు చేస్తే అసలు ఈ లైంగిక హింస ఉండదని బీజేపీ మార్గదర్శి హిందూత్వ భావజాలం వంటబట్టించుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడుతున్నారు. అంతటితో ఆగక దళితులూ మైనారిటీలూ అణిగి ఉండకపోతే వారి స్త్రీలు, పిల్లలు సురక్షితంగా ఉండరని కూడా పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. కథువా, ఉన్నావ్‌ ఘటనల్లో వారి ప్రవర్తనే దానికి సాక్ష్యం. ఈశాన్యభారతం, కాశ్మీరు, ఛత్తీస్‌గఢ్‌లలో తన ప్రత్యేక అధికారాలను అడ్డం పెట్టుకుని సైన్యం చేస్తున్న సామూహిక లైంగికదాడులను అసలు ప్రశ్నించడమే తప్పని కేబినెట్‌ మంత్రులే పేర్కొంటున్నారు. అలా ప్రశ్నిస్తే వారికి దేశభక్తి లేదని వారు మన సైన్యాన్ని అవమానిస్తున్న విదేశీ ఏజెంట్లనీ ప్రకటిస్తున్నారు.
ఏదిఏమైనా భయభ్రాంతులతో బతకాల్సింది మాత్రం యింటా బయటా స్త్రీలే. స్త్రీల భద్రత ఎజెండాలో ప్రముఖస్థానంలో ఎన్నికల సందర్భంలో మాట్లాడే ఆకర్షణీయ ఉపన్యాసకులకు కాకుండా ఎన్నికల తర్వాత కనీస పక్షంగా స్పందించే వారిని గురించి మహిళలు ఆలోచించడం అవసరం.

- దేవి 
- సాంస్కృతిక కార్యకర్త.