మూఢాచారాల్లో మూలుగుతున్న ఆరోగ్యం

09.06.2018

రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండు ప్రభుత్వం మతాచారులు విధించిన మూఢ విశ్వాన్ని విడనాడి ఆరోగ్యకరమైన మానవ జీవితానికి నాంది పలికింది. ఇన్నాళ్ళూ నిషేధంలో ఉన్న గర్భస్రావానికి అనుమతినిస్తూ ప్రభుత్వం చట్టాని తెచ్చింది. ఈ చట్టం కోసం అక్కడి మానవతా వాదులు స్వచ్ఛంద సంస్థలు కలిసి దాదాపు ఆరేండ్లు అవిశ్రాంత పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ పోరాటానికి నాంది భారత సంతతికి చెందిన నారీమణి ద్వారానే పడింది. సవితా హలప్పణావర్‌ అనబడే భారత సంతతి మహిళ 2012లో ''పదిహేడు నెలల గర్భస్త శిశువు వల్ల రక్తస్రావం జరుగుతున్నదని, వెంటనే గర్భాన్ని తొలగించకపోతే బతక లేనని'' ఎంత మొరపెట్టుకున్నా అక్కడి మత సంప్రదాయాల ఒత్తీళ్ళవల్ల ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీని పర్యావసానంగా ఆమె మరణించింది. మరణానికి ముందు ఆమె చేసిన ప్రయత్నాలన్నీ అక్కడి వారందరినీ కలిచివేశాయేమో అందువల్ల గత ఐదేండ్లుగా అలుపెరుగని పోరాటానికి దిగడంతో ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ కూడా సానుకూలమైన రిపోర్టు ఇవ్వడంతో మే 25, 2018న అబార్షన్‌కు అనుమతినిస్తూ కొత్త చట్టాన్ని ఐర్లాండు ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇది ఐర్లాండు అంతర్గత అంశమే అయినప్పటికీ దీని ప్రభావం చాలా దేశాలపై ఉంటుంది. ఎందుకంటే చాలా దేశాల్లో ఇంతగా అభివృద్ధి చెందిన సైన్సును పక్కనబెట్టి మత లేదా మూఢ విశ్వాసాల ద్వారా ఆరోగ్య సూత్రాలు అమలు చేయబడుతున్నాయి. విశ్వాసాన్ని వదిలిపెట్టలేక వైద్యాన్ని నిరాకరిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. అటువంటి విశ్వాసాలవల్ల నష్టపోతున్నది అమాయక ప్రజానీకం ముఖ్యంగా స్త్రీలూ చిన్న పిల్లలు. ఇలాంటి వాళ్ళందరికీ ఐర్లాండు తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఉపయోగపడాలి. మత పెద్దలూ పాలకులూ ఆ దిశగా చర్యలు చేపట్టాలి.
క్రైస్తవ మతానుసారం ఐర్లాండులో అబార్షన్లు(గర్భాన్ని తొలగించడం) చేయడం మతపరంగా చాలా తప్పు, దానికి చట్టరూపం కూడా కల్పించారు. ఎవరైనా అతిక్రమించి అబార్షన్‌ చేస్తే చట్టరీత్యా శిక్షార్హులు. అయితే గర్భస్థ శిశువు యొక్క గుండె కొట్టుకోవడం ఆగి పోయిందన్న నిర్ధారణ జరిగితే అబార్షన్‌ చేయవచ్చుననే చిన్న వెసులుబాటు పెట్టుకున్నారు. కానీ చాలా సందర్భాల్లో గర్భస్థ శిశువు గుండె ఆగిపోకముందే పెద్ద ప్రాణానికి ముప్పు ఏర్పడుతున్నట్టు అనుభవం చెబుతున్నది. ఐర్లాండులోని సవిత విషయంలో ఇదే జరిగింది. విపరీతమైన రక్తస్రావ సమయంలోనూ గర్భస్థ శిశువు గుండె కొట్టుకుంటున్నందున వైద్యులు అబార్షన్‌కు నిరాకరించడంతో ఆమె చనిపోయారు. ఏ మతమూ ఇట్టాంటి మూఢాచారాల ప్రాప్తికి మినహాయింపు కాదు. ఒక్కో మతం ఒక్కో నిబంధనను ఒక్కో ప్రాంతాన్ని, దేశాన్ని బట్టి విధిస్తుంది. కొన్ని దేశాల్లో మతాచారాలు చట్టాలుగా మారకపోయినా తూచ తప్పకుండా వాటినే పాటించి ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు కూడా ఉన్నవి. మన దేశంలో తీసుకుంటే, మసూచి(చికెన్‌పాక్స్‌) వచ్చినప్పుడు లేదా పసిరికలు(జాండిస్‌) వంటి పలు రకాల జబ్బులు వచ్చినప్పుడు సైన్సును కాకుండా సంప్రదాయ పద్ధతులను అవలంబించడం వల్ల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. చేప మందు కేవలం మూఢ నమ్మకమని జన విజ్ఞాన వేదిక లాంటి స్వచ్ఛంద సంస్థలు ఎంత ప్రచారం చేసినా ఏటేటా వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. పైగా రోగం నయమవటం మాట అటుంచితే తొక్కిసలాటలతో ప్రజలు ఉసూరుమంటున్నారు. వాంతులు విరేచనాలు అయినప్పుడు నీళ్ళు తాగిస్తే మంచిది కాదన్న మూఢనమ్మకంతో ప్రాణాలు కోల్పోతున్న వారిని ప్రతి యేటా చూస్తున్నాం. ఇప్పటికీ భారత పల్లెల్లో కొన్ని రోగాలకు చిన్న పిల్లలకు కాల్చిన సలాకీతో (ఇనుప వస్తువు) వాతలు పెడతారు. గిరిజన ప్రాంతాలో, పల్లెల్లో నొప్పులకు పచ్చలు పొడిపిస్తారు. సిగం(హిస్టీరియా) పేరు మీద సుస్తీ చేసిన రోగిని వేపాకుతో విపరీతంగా కొట్టటం వంటివి చేస్తూనే ఉంటారు. స్త్రీలు ముఖ్యంగా బాలింతల విషయంలో మూఢాచారాల పేర ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. 
మతాలు ఏర్పరచిన మూఢనమ్మకాలు సైన్సు ఇంతగా అభివృద్ది చెందిన సమాజాన్ని చిదిమేస్తున్నాయనడానికి ప్రత్యక్ష ఉదాహరణ తెలంగాణ రాష్ట్రంలో చేతబడి లేదా బాణామతి చేశారన్న నెపంతో చాలా ఊళ్ళల్లో హత్యలు జరుగుతున్నాయి. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి చనిపోవడానికి ఫలానా వ్యక్తి చేతబడి చేశాడన్న అనుమానం వచ్చిందంటే ఆ ఊళ్ళోని వారంతా కలిసి సదరు వ్యక్తిని కొట్టి చంపుతున్నారంటే ఆయా మూఢాచార నమ్మకాల ఉచ్చులో ఎంతగా ఇరుక్కుపోయారో అర్థమౌతుంది. సంతానం కల్పిస్తామని, మగ సంతానం పుట్టేలా పూజలు చేస్తామని లేదా మందులిస్తామనీ ఎందరో మోసకార్లు ఇంకా పుట్టగొడుగుల్లా పుట్టుకు రావడానికి కారణం ఎవరు? ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి తాము పూజ చేస్తున్నామని ఈ సన్నాసులు వాదిస్తుంటారు, ''వాస్తవమున్నా లేకున్నా ఏదో ఆశతో వస్తామని'' ప్రజలంటారు, ''ప్రజల నమ్మకాన్ని మేమెలా వద్దంటాం, స్వామీజీలకు ప్రజలకు రక్షణ కల్పించడమే మా బాధ్యత'' అంటూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నది. అలా కాకుండా ప్రభుత్వం ప్రజల నమ్మకాల్లోని వాస్తవికతను సైన్సు ద్వారా వివరించి మార్గదర్శకం కావాల్సిన బాధ్యత ఉన్నది. రెండేండ్ల క్రింద హైదరాబాదులోని ఓ పెద్ద వ్యాపారి కరెన్సీ కట్టలను రెట్టింపు చేస్తానని నమ్మబలికిన ఓ సాధువు పన్నాగంలో చిక్కుకుని కోట్లు పోగొట్టుకున్నది కండ్లారా చూశాం. ఆరోగ్యం కోసం ఒకరు అత్యాశతో ఒకరు ఈ మూఢనమ్మకాల్లో కమిలిపోతున్నారు. సెక్యులర్‌ ప్రభుత్వాలు ఏ రకమైన నమ్మకాలను పబ్లిక్‌గా పాటించడం కానీ ప్రోత్సహించడం కానీ చేయకూడదు. కానీ స్వయానా ప్రభుత్వాలు కూడా మూఢాచారాలను బహిరంగంగా పాటిస్తూ బలపరుస్తున్నాయి. గత దశాబ్దం కింద లేని ఈ ఆచారం ఇప్పుడెందుకు ఎక్కువ అవుతున్నదంటే రాజ్యాధికారం కోసం వేసే ఎత్తుగడల్లో ప్రజల మనోభావాలను మభ్యపెట్టి వారికి దగ్గరయ్యేందుకు ఒక సాధనంగా వాడుకుంటున్నారు. అందుచేత నమ్మకాలు ఇంటివరకే పరిమితం చేయాలి. వాటిని ఎప్పుడూ సమాజంపైన రుద్దకూడదు. లేదంటే భస్మాసుర హస్తంలా జీవన విధానాన్నే శాసిస్తాయి.

- జి. తిరుపతయ్య 
సెల్‌: 9951300016