మేక్‌ ఫర్‌ ఇండియాగా మారిన మేకిన్‌ ఇండియా - వాల్‌ మార్ట్‌ టేకోవర్‌పై సీపీఐ(ఎం) విమర్శ

11.05.18

 

భారత్‌కు చెందిన ఈ-రిటైల్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అంతర్జాతీయ ఈ- కామర్స్‌ సంస్థ వాల్‌మార్ట్‌ టేకోవర్‌ చేయటం ఆ సంస్థ దొడ్డిదారిన భారత్‌లోకి ప్రవేశించటమేనని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో విమర్శించింది. ఈ టేకోవర్‌ ద్వారా మోడీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న మేకిన్‌ ఇండియా కార్యక్రమం మేక్‌ ఫర్‌ ఇండియాగా మారిపోతోందని ఎద్దేవా చేసింది. రిటైల్‌ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలన్న ప్రతిపాదనను వామపక్షాలు మొదటి నుండీ వ్యతిరేకిస్తూనే వున్నాయని పొలిట్‌బ్యూరో తన ప్రకటనలో గుర్తు చేసింది. ప్రతిపక్షంలో వున్న పుడు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన బీజేపీ ఇప్పుడు దానికి భిన్నంగా ఈ-కామర్స్‌కు తలుపులు బార్లా తెరిచిందని విమర్శించింది. ఈ చర్య భారత్‌లో దాదాపు నాలుగు కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న రిటైల్‌ వాణిజ్య రంగాన్ని పూర్తి స్థాయిలో దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. వాల్‌మార్ట్‌ సంస్థ తన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలోకి ప్రవేశపెడుతుందన్న విషయం అందరికీ తెలిసిందేనని, ఇప్పుడు ఇవి భారత్‌లో కూడా అమ్మకానికి లభిస్తాయని వివరించింది. ఈ చర్య ద్వారా చిన్న, మధ్య తరహా వాణిజ్య రంగాలతోపాటు ప్రధానంగా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం ధ్వంసమవుతాయని వ్యాఖ్యానించింది. ఈ టేకోవర్‌ చర్య మోడీ సర్కారు ప్రతిపాదిస్తున్న మేకిన్‌ ఇండియాను మేక్‌ ఫర్‌ ఇండియాగా మార్చివేసిందని విమర్శించింది. దేశీయ వ్యాపార సంస్థలను విదేశీ సంస్థలు హస్తగతం చేసుకునేందుకు మార్గం సుగమం చేసిన మోడీ ప్రభుత్వ విధానాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పొలిట్‌బ్యూరో తన ప్రకటనలో పేర్కొంది. దేశం, దేశ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైన ఈ చర్యను అనుమతించరాదని స్పష్టం చేసింది.