యూజీసీ రద్దు ఏ ప్రయోజనాల కోసం..?

10.07.2018

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ)ను రద్దు చేయటం కోసం రాబోయే వర్షాకాల పార్లమెంటు సమావేశంలో మోడీ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకు రాబోతోంది. ప్రస్తుతం యూజీసీ రెండు ప్రధాన పాత్రలను పోషిస్తున్నది. కాలేజీలకు, విశ్వవిద్యాలయాలకు నిధులను పంపిణీ చేయటం వీటిలో ఒకటి. దీనిని ఇప్పుడు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించబోతోంది. ఇక మిగిలిన పాత్ర నియంత్రించటం. ఈ పాత్రను హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(హెచ్‌ఇసీఐ) నిర్వహించబోతోంది. అయితే పంపిణీ చేయటానికి ఈ కమిషన్‌ దగ్గర నిధులేమీ ఉండవు.
ఈ ప్రతిపాదిత ఏర్పాటు వల్ల విద్యారంగంపై రాజకీయ నియంత్రణ పెరుగుతుంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిధుల పంపిణీ జరుగుతుందనే వాస్తవం దీనిని స్పష్టంగా సూచిస్తున్నది. అంతే కాకుండా ప్రతిపాదిత హెచ్‌ఇసీఐ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. ఈ సంస్థ ఉన్నత విద్యారంగాన్ని పర్యవేక్షించటమే కాకుండా ఉన్నత విద్యా సంస్థలకు నిర్దేశాలను జారీచేస్తుంది. అలాంటి నిర్దేశాలను పట్టించుకోకపోతే ఇప్పటిదాకా ఊహించలేని శిక్షలను అది విధిస్తుంది. అంతేకాకుండా కొత్త కోర్సులను అభివృద్ధి చేసేందుకు అవసరమైన స్వేచ్ఛను ఇచ్చే స్వయం ప్రతిపత్తిని అది గుంజుకుంటుంది. ఇప్పటినుంచి అన్ని కొత్త కోర్సులకు హెచ్‌ఇసీఐ ఆమోదాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. 
ముందుగా హెచ్‌ఇసీఐ కూర్పుతో మొదలు పెడదాం. హెచ్‌ఇసీఐకి ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు ఉంటారు. వీరిని ఒక కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో క్యాబినెట్‌ కార్యదర్శి, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖా కార్యదర్శి కూడా ఉంటారు. వీరే కాకుండా ఇద్దరు పదవిలో వున్న వైస్‌ ఛాన్సలర్లు, ఒక పారిశ్రామికవేత్త, ఇద్దరు ప్రొఫెసర్లు, 'సంబంధింత మంత్రిత్వ శాఖల'కు చెందిన సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీలో మొత్తం 12మంది సభ్యులు ఉంటారు. ఈవిధంగా హెచ్‌ఇసీఐ ప్రభుత్వం నియమించిన సభ్యులున్న సంస్థగా ఉంటుంది. దీనిలో విద్యారంగానికి తగిన ప్రాతినిధ్యం లేదు. అలా వుండవలసిన అవసరం లేకున్నా కాసేపు వైస్‌ చాన్సలర్లను విద్యావేత్తలుగా భావించినా 14మంది సభ్యులున్న హెచ్‌ఇసీఐలో విద్యావేత్తల సంఖ్య కేవలం నాలుగు మాత్రమే. కాబట్టి రాజకీయ నాయకులకు జవాబుదారీగా వున్న అధికారుల బృందం, ప్రభుత్వం నియమించిన మరికొందరు సభ్యులుగా గల హెచ్‌ఇసీఐ ఆచరణలో విద్యారంగంలో ఏమి జరగాలో నిర్ణయించే సాధనంగా వ్యవహరిస్తుంది. ఒకవేళ హెచ్‌ఇసీఐ గనుక ప్రభుత్వ ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించటం జరిగితే దానిలోని సభ్యులను ప్రభుత్వం తొలగిస్తుంది. ప్రస్తుతం యూజీసీ సభ్యులను నియమించటం జరిగిన తరువాత ప్రభుత్వం వీరిని తొలగించజాలదు. ప్రతిపాదిత హెచ్‌ఇసీఐ చట్టంలో ఈ ఏర్పాటును తొలగిస్తున్నారు.
ఇది సరిపోనట్టు హెచ్‌ఇసీఐకి మార్గదర్శనం చేయటానికి ఒక అడ్వయిజరీ కౌన్సిల్‌ ఉంటుంది. మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి ఈ అడ్వైజరీ కౌన్సిల్‌కు అధ్యక్షుడిగా ఉంటాడు. ఈ అడ్వైజరీ కౌన్సిల్‌ ఏడాదికి రెండుసార్లు సమావేశమవుతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి హెచ్‌ఇసీఐ కూర్పును నిర్ణయించటమే కాకుండా అడ్వయిజరీ కౌన్సిల్‌ అధ్యక్ష హోదాలో దాని విషయాలలో తలదూర్చటం జరుగుతుంది. అడ్వయిజరీ కౌన్సిల్‌లో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంటుందనటంలో సందేహం లేదు. అది కేవలం సిగ్గుబిళ్ళ మాత్రమే. ఒకవేళ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని నిజంగా అనుకుంటే హెచ్‌ఇసీఐలోనే వాటికి సభ్యత్వం ఇచ్చి వుండవలసింది. దేశంలో విద్యకు సంబంధించిన విషయాలలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవటాన్ని కప్పిపుచ్చటానికే ఈ సిగ్గుబిళ్ళ అవసరం ఏర్పడింది. 
యూజీసీ కూడా ఆదిలో ప్రభుత్వం నియమించిన విద్యావేత్తలతో కూడివున్నప్పటికీ అది స్వయంప్రతిపత్తిగల సంస్థగా ఉండేది. ఆ తరువాత కాలంలో అది రాజకీయ స్వభావాన్ని సంతరించుకున్నది. అర్హతలతో ప్రమేయం లేకుండా అన్ని సంస్థలనూ ఆర్‌ఎస్‌ఎస్‌ వారితో నింపాలనే ఉద్దేశంతో వున్న బీజేపీ ప్రభుత్వం యూజీసీని కూడా వదలలేదు. అయితే ఈ రాజకీయ జోక్యానికి హెచ్‌ఇసీఐతో అధికారికంగా రాజముద్ర పడింది. ఒకవేళ యూజీసీ పయనిస్తున్న దిశ తప్పుడిది అయితే, అది మూల యూజీసీ చట్టం స్ఫూర్తికి భిన్నంగా ఉంటే హెచ్‌ఇసీఐతో వాస్తవంలో ఆ దిశలో పయనం అధికారిక ఇచ్చ అని ప్రకటించినట్టయింది.
హెచ్‌ఇసీఐ సిగ్గూ ఎగ్గూలేని ప్రభుత్వ నియంత్రణలోని సంస్థగా ఉంటుంది. అంతేకాకుండా యూజీసీకి కూడా ఎన్నడూలేని అధికారాలు ఈ సంస్థకు ఉంటాయి. ప్రస్తుతం ఒకవేళ ఒక విశ్వవిద్యాలయం యూజీసీ నిర్దేశాలను పాటించకపోతే మహా అయితే సదరు విశ్వవిద్యాలయానికి యూజీసీ నిధుల కేటాయింపును నిలిపివేస్తుంది. కానీ నూతన ఏర్పాటులో ఏదైనా విద్యాసంస్థ హెచ్‌ఇసీఐ సిఫారసులను పట్టించుకోకపోతే హెచ్‌ఇసీఐ ఆ విద్యాసంస్థను మూసివేస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. తద్వారా వారికి జరిమానాగానీ, జైలు శిక్షగానీ పడవచ్చు. ముసాయిదా చట్టం ఇలా చెబుతోంది: 'హెచ్‌ఇసీఐ నిర్దేశాలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. దానితో జరిమానాగానీ, జైలు శిక్షగానీ పడవచ్చు'. అయితే ఉన్నత విద్యను కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలోకి తీసుకురావటం ఈ కథలో ఒక భాగం మాత్రమే. యూజీసీని రద్దుచేయటానికి చూపిన సమర్థింపులను చూసినప్పుడు మనకు మిగిలిన భాగం కూడా తెలుస్తుంది. ఈ సమర్థింపులలో ఉన్నత విద్యపై నిష్ణాతులతో కూడిన అనేక కమిటీలు ఇప్పటికే యూజీసీని రద్దుచేయాలని సిఫారసు చేశాయని, ప్రొఫెసర్‌ యశ్‌పాల్‌ నేతృత్వంలోని కమిటీ కూడా యూజీసీని రద్దుచేయాలని సిఫారసు చేసిందని ఉన్నాయి. 
ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది: అసలు ఈ కమిటీలు ఎందుకు యూజీసీని రద్దుచేయమన్నాయి? దీనికి సంబంధించిన వాదన ఇలా ఉన్నది: 'జ్ఞాన ఆర్థిక వ్యవస్థ(నాలెడ్జ్‌ ఎకానమి)' వృద్ధి చెందుతున్న ఈ నూతన స్థితిలో ఉన్నత విద్యను పెద్ద ఎత్తున విస్తృతం చేయవలసిన అవసరం ఏర్పడింది. అందుకోసం పూర్తిగా లేక ప్రాథమికంగా కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోజాలదు. విద్యను విస్తృతం చేయటంకోసం ప్రయివేటు వనరులను నిరంతరం సేకరించగలగాలి. కాబట్టి గుర్తింపు కోసం అభ్యర్థించే ప్రయివేటు సంస్థల అర్హతను సంక్లిష్ట ప్రక్రియ ఆధారంగా పనిచేసే యూజీసీ కంటే వేగంగా నిర్ధారించగలిగే ఒక అత్యున్నత స్థాయి సంస్థ అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతిపాదిత హెచ్‌ఇసీఐ వంటి అత్యున్నత స్థాయి సంస్థ అవసరం ఆ పాత్రను పోషిస్తుంది. బీజేపీ ప్రభుత్వ ముసాయిదా చట్టం కూడా 'యూజీసీ ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌'ని గురించి మాట్లాడింది. అంటే హెచ్‌ఇసీఐ అటువంటి సంస్థల పట్ల మరింత 'ఉదారం'గా వ్యవహరిస్తుందనటానికి ఇదొక సూచిక. 
దీనితో స్పష్టమయ్యేదేమంటే ప్రభుత్వ రంగంలోని ఉన్నత విద్యాసంస్థల విషయంలో హెచ్‌ఇసీఐ అత్యంత కఠినంగా వుండి ప్రయివేటురంగ విద్యాసంస్థలకు గుర్తింపునిచ్చే విషయంలో అతి ఉదారత ప్రదర్శిస్తుంది. ఈమధ్య కాలంలో 'స్వయంప్రతిపత్తిగల కళాశాలల'వైపు మొగ్గు చూపటానికి కారణం ఈ కళాశాలలు తమకు అవసరమైన నిధులను తామే సమకూర్చుకోగలుగుతాయి. ఈ కళాశాలలు తమకు తోచిన విధంగా వ్యవహరించటానికి అనుమతిస్తారు. అలా ప్రయివేటు సంస్థల పట్ల అతి ఉదారతను ప్రదర్శించటంలో ఉన్నత విద్యను పెద్ద ఎత్తున ప్రయివేటీకరించే సూచన ఉన్నది. 
ఈ దిశలో కొనసాగాలని నయావుదారవాదం నిర్దేశిస్తున్నది. అనేక కమిటీలు యూజీసీని రద్దుచేయమనటానికి కారణం అది వేరే శకానికి చెంది వుండటమే. ఆ శకంపేరు స్వాతంత్య్ర పోరాటానంతర సంక్షేమ రాజ్య శకం. ఆ శకంలో ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వం ప్రముఖ పాత్రను పోషించాలనే భావన ఉండేది. భారతదేశంలో ఉన్నత విద్య కేంబ్రిడ్జ్‌, హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాలు అందించే విద్యకు భిన్నంగా ఉండాలని, అది మనదేశ సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉండాలని ఆ శకంలో భావించటం జరిగింది. విద్యావ్యవస్థలో ద్వందత ఉండాలనేది నేటి ఆలోచనగా ఉన్నది. అనేక ప్రయివేటు విద్యాసంస్థలు వ్యాపార ధోరణితో నడుస్తుంటాయి. ఈ విద్యాసంస్థలు విద్యను సరుకుగా అమ్ముతాయి. అలాగే ప్రభుత్వ నిధులు అవసరమైన అనేక విద్యాసంస్థలు ఉంటాయి. అయితే ఎటువంటి విమర్శనాత్మక దృక్పథంగానీ, 'చెడు' ఆలోచనలు గానీ, స్వతంత్ర చింతన గానీ లేకుండా చూసుకునేలా ప్రభుత్వ నిధుల కేటాయింపులు ఉంటాయి. 
వర్తమాన బూర్జువా క్రమం(ఆర్డర్‌) సరిహద్దులను దాటి, చింతనాక్షేత్రంలో దవ్య పెట్టుబడి సమర్థకులు నిర్మించిన జ్ఞాన సిద్ధాంత సంబంధిత 'కంచె'లను ఛేదించే విమర్శనాత్మక చింతన నయా వుదారవాదానికి గిట్టదు. డార్విన్‌ అవగాహన సరియైనది కాదనీ, ప్రాచీన భారతదేశంలో ప్లాస్టిక్‌ సర్జరీ ఉన్నదనీ, చరిత్రపూర్వ దశలో కూడా భారతదేశంలో విమానాలు ఉన్నాయనీ విద్యార్థులు నమ్మితే నయా వుదారవాదానికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. అంతర్జాతీయ పెట్టుబడి అవసరాలకు అనుగుణంగా సేవలను అందించేందుకు కావలసిన ప్రావీణ్యతలను సముపార్జించుకుంటున్నంత వరకూ వీరు హిందూత్వ అహేతుకతను అలవర్చుకుంటే అదేమీ పట్టించుకోదు. సృజనను, విమర్శనాత్మక, స్వతంత్ర చింతనను నయావుదారవాదం భరించలేదు. అదేవిధంగా హిందూత్వ శక్తులు కూడా సృజన, విమర్శనాత్మక, స్వతంత్ర చింతనలను సహించలేవు. విశ్వవిద్యాలయాలలో జోక్యం చేసుకోవటం ద్వారా ఇటువంటి ధృక్పథాలను అణచివేయటం ఈ శక్తులకు ఇష్టమైన పని.
హిందూత్వ, నయావుదారవాద ప్రయోజనాల సంగమ దిశవైపుగా భారతదేశంలో ప్రస్తుతం ఉన్నత విద్య పయనిస్తున్నది. ఈ ధోరణి పర్యవసానం ఏమంటే దళితులు, ఇతర అణగారిన వర్గాలు ఉన్నత విద్య నుంచి మినహాయించబడతారు. అయితే అంతే ప్రాముఖ్యతగల మరో అంతస్సూచిక ఏమంటే చింతన(థాట్‌) పూర్తిగా ధ్వంసం అవటం. భారతదేశంలో సంక్షేమ రాజ్య శకం కొనసాగిన కాలంలో యూజీసీ ఆధ్వర్యంలో ఏర్పడిన విద్యా వ్యవస్థ పర్యవసానంగా దళిత, ఇతర అణగారిన సామాజిక వర్గాల నుంచి తెలివైన, విషయాలను విశ్లేషించగల, చింతనాపరులైన, సామాజిక నిబద్ధతగల విద్యార్థులు వచ్చారు. ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ఇది యూజీసీ విజయం. ప్రస్తుతం ఈ ప్రక్రియకు ముగింపు పలకాలనే ప్రయత్నం జరుగుతున్నది. అటువంటి ప్రయత్నాన్ని ప్రతిఘటించాలి.
 

- ప్రభాత్‌ పట్నాయక్‌
అనువాదం: నెల్లూరు నరసింహారావు 
సెల్‌ : 8886396999