రాజకీయ చైతన్యంతోనే సమగ్రాభిóవృద్ధి :బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర చైర్మెన్‌ నల్లా సూర్య ప్రకాశ్‌

20.06.2018

 
'రాజకీయ చైతన్యంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, మైనార్టీలు అభివృద్ధి సాధిస్తారు. జనాభాలో 52 శాతంగా ఉన్న బీసీలే ఈ రాష్ట్రానికి సీఎం కావాలి' అని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ రాష్ట్ర చైర్మెన్‌ నల్లా సూర్యప్రకాశ్‌ అన్నారు. బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఎంబీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు విద్యా, ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగంలోనూ ఏబీసీడీఈ వర్గీకరణ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బీఎల్‌ఫ్‌ మాదిరిగానే కాంగ్రెస్‌, తెలంగాణ జన సమితి, ఇతర పార్టీలు బీసీలకు 60 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని సూచించారు. బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ఎన్నికలు నోట్లతో కాకుండా ఓట్లతో జరగాలని, ప్రజలు చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలు రిజర్వేషన్లు లేని జనరల్‌ స్థానాల్లోనూ పోటీ చేయాలని సూచించారు. బీసీ కమిషన్‌ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. బీసీలకు రాజకీయ రంగంలో వర్గీకరణ అత్యంత ఆమోదయోగ్యమైందన్నారు. బీసీల్లో ఎంబీసీలు ఇంకా సంచార జాతులుగా, అర్ధ సంచార జాతులుగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల సమస్యలపై బీసీ కమిషన్‌ నిర్దిష్టమైన నివేదిక తయారు చేసేందుకు అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షులు బి.చంద్రకుమార్‌ మాట్లాడుతూ.. రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంటే... ఆ వర్గాలకే ఫలాలు అందుతున్నాయని అన్నారు. ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో ఆధిపత్య కులాల వాళ్లే ఉంటున్నారని చెప్పారు.ప్రముఖ సామాజికవేత్త ఉ.సాంబశివరావు మాట్లాడుతూ.. రాజకీయ రంగంలో బీసీ రిజర్వేషన్ల వర్గీకరణకు అడ్డుగా ఉన్న చట్టాన్ని రద్దు చేయాలన్నారు. ఏపీ సచివాలయంలో నాయీబ్రాహ్మణులపై సీఎం చంద్రబాబు అహంకారంతో వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. వివక్ష చట్టం కింద చంద్రబాబును జైలుకు పంపాలని డిమాండ్‌ చేశారు. గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎఎల్‌ మల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో బీసీ సబ్‌ప్లాన్‌ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లె గోపాల్‌, సంచార జాతుల విముక్తి వేదిక జాతీయ అధ్యక్షులు మల్లి సుబ్బారావు, ఎంబీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, నాయకులు దండి వెంకట్‌, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, బీసీ సంక్షేమ సమాఖ్య జాతీయ కార్యదర్శి గంజి రమేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైళ్ల ఆశయ్య ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.