రైతుబంధు డబ్బుల కోసం రైతుల ధర్న

13.06.2018

రైతు బంధు చెక్కుల మార్పిడి కోసం బ్యాంకు చుట్టూ తిరిగి...తిరిగి బేజారెత్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆంధ్రా బ్యాంకు ఎదుట 400 మంది రైతులు బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళనకు దిగారు. బ్యాంకు సిబ్బందిని, ఖాతాదారులను లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. వ్యవసాయ పనులకు డబ్బు కావాలని, నగదు నిల్వలపై ప్రభుత్వం, బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వీడాలంటూ నినాదాలిచ్చారు. నగదు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. నినాదాలు మరోసారి హోరెత్తడంతో బ్యాంక్‌ మేనేజర్‌ డి.అంబయ్య బయటకు వచ్చారు. 'డబ్బులు ఎప్పుడు వస్తే అప్పుడే ఇస్తాం...ప్రభుత్వాన్ని అడుక్కోండి' అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంతో రైతులు రోడ్డుపై రాస్తారోకో చేసేందుకు పూనుకున్నారు. దీంతో బీఎల్‌ఎఫ్‌, సీపీఐ(ఎం) నాయకులను మాట్లాడేందుకు బ్యాంకులోకి మేనేజర్‌ ఆహ్వానించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే.రమేష్‌ మేనేజర్‌తో మాట్లాడారు. వర్షాలు పడుతున్న తరుణంలో విత్తనాలు కొనుక్కోవడానికి రైతులకు నగదు కావాలని, ఇలాంటి సమయంలో నగదు లేదని బోర్టులు పెట్టుకుని కూర్చోవడం సరికాదని చెప్పారు. దీంతో ఉన్న తాధికారులతో మేనేజర్‌ మాట్లాడారు. రైతు బంధు చెక్కుల కోసం రూ.2కోట్లు పంపనున్నట్టు సమాచారం ఇచ్చారని, బుధవారం నుంచి పంపిణీ చేస్తామని రైతులకు మేనేజర్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబ్దుల్‌ నబీ, కృష్ణ, ఆలేటి కిరణ్‌, మన్యం మోహన్‌రావు, తేజ్యా నాయక్‌, బి.మోహన్‌రావు, రాందాస్‌, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.