వాగ్దానాల అమలు కోసం... 27న కలెక్టరేట్ల ముందు మహాధర్నా - బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు

20.06.2018

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాల అమలు కోసం ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు మహాధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్టు బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) రాష్ట్ర కమిటీ ప్రకటించింది. ఈ ధర్నాల్లో రాష్ట్ర ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లోని బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో ఆ ఫ్రంట్‌ చైర్మెన్‌ నల్లా సూర్యప్రకాశ్‌, రాష్ట్ర కన్వీనర్లు తమ్మినేని వీరభద్రం, మద్దికాయల అశోక్‌ తదితరులు విలేకరులతో మాట్లాడారు. నల్లా సూర్యప్రకాశ్‌ మాట్లాడుతూ...అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక వాగ్ధానాలు చేశారని అన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు దాటినా నేటికీ ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పి, ప్రస్తుతం సర్కారు బడులను మూసివేస్తున్నారని తెలిపారు. ఎస్టీలు, ముస్లీ మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, నేటికీ అమలు చేయలేదన్నారు. 
కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా, సాగిలపడే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పారనీ, అయితే అది ఎంతమందికి ఇచ్చారో తెలుపుతూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, నిరుద్యోగ భృతి చెల్లిస్తామనీ అనేక హామీలు ఇచ్చారనీ అవేవీ అమలుకు నోచుకోలేదని తెలిపారు.
తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రత్యా మ్నాయ రాజకీయ వేదిక బీఎల్‌ఎఫ్‌ అని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలు, 117 అసెంబ్లీ నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో మిగిలిన రెండు అసెంబ్లీ కమిటీలూ పూర్తవుతాయన్నారు. జూన్‌ 3 నుంచి 20 వరకు 'పల్లెకు పోదాం' కార్యక్రమం నిర్వహించామనీ, దీనిలో సుమారు 7వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారని చెప్పారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించి సమస్యలను అధ్యయనం చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలనీ, స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 27న కలెక్టరేట్ల ముందు మహాధర్నాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే మండలస్థాయిలో ఆందోళనలు చేసినట్టు గుర్తుచేశారు. కలెక్టరేట్ల ముందు ఆందోళనలు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే మిలిటెంట్‌ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సామాజిక న్యాయంలో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 60కి పైగా సీట్లు కేటాయిస్తామనీ, బీసీలకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పారు. 
మద్దికాయల అశోక్‌ మాట్లాడుతూ...రైతుబంధు పథకాన్ని కౌలు, పోడు రైతులకూ వర్తింపజేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వంపై అన్ని ప్రాంతాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం కమిటీ వేసినా ఫలితం లేదన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే కార్పొరేట్‌ సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. సామాజిక తెలంగాణ నిర్మాణంలో భాగంగానే బీఎల్‌ఎఫ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ రామనర్సయ్య, గుజ్జా రమేశ్‌, కృష్ణస్వామి, జి సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.