వీడీసీలపై చర్యలు తీసుకోవాలి - తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మానాయక్‌

12.07.2018

గ్రామాల్లో వీడీసీల ఆగడాలు మితిమీరుతున్నాయని, వాటిని రద్దు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మానాయక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం రహత్‌నగర్‌ గ్రామ పరిధిలోని పల్లెతండాలో బహిష్కరణకు గురైన 30గిరిజన కుటుంబాలను మండల కేంద్రంలో బుధవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన కుటుంబాలను బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండించారు. రహత్‌నగర్‌ వీడీసీపై తక్షణమే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లంబాడీలంటూ అవమానించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. గ్రామంలో వేలంపాటతో చేస్తున్న దోపిడీని అరికట్టాలి కోరారు. టీమాస్‌ నిజామాబాద్‌ జిల్లా కన్వీనర్‌ పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ.. గ్రామ బహిష్కరకు గురైన గిరిజనులకు ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. వీరివెంట టీమాస్‌ స్టీరింగ్‌ కమీటీ సభ్యుడు వెంకటేష్‌ తదితరులున్నారు.