సీఐటీయూ పోరాటానికి అంతర్జాతీయ అవార్డు - 15 వేల మందికిపైగా బీడీకార్మికులకు సొంత ఇండ్లు  - ఉన్నతమైన రాజకీయాలకు ఇది ఆదర్శం : 'ట్రాన్స్‌నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌'

13.06.2018

 

బీడీ కార్మికులను సంఘటితం చేసి, షోలాపూర్‌ 'సీఐటీయూ' విభాగం చేసిన పోరాటంపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఎన్నో ఏండ్లుగా 'సీఐటీయూ' చేసిన రాజకీయ పోరాటం ఫలించి...నేడు 15 వేల మందికి పైగా బీడీ కార్మికులు సొంత ఇంటిని సాధించుకోగలిగారు. ఉన్నతమైన రాజకీయాలకు ఇది ఆదర్శం. ప్రజల్ని రాజకీయంగా శక్తివంతం చేస్తే..వారికి తాగునీరు, ఇంధనం, గృహం అందుబాటులోకి వస్తాయని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.
 

- షోలాపూర్‌ బీడీ కార్మికుల గృహ సముదాయానికి దక్కిన 'ట్రాన్స్‌ఫార్మేటీవ్‌ సిటీస్‌-2018' అవార్డులో ప్రశంస

 షోలాపూర్‌లోని బీడీ కార్మికుల నివాస సముదాయానికి 'ట్రాన్స్‌ఫార్మేటీవ్‌ సిటీస్‌-2018' అంతర్జాతీయ అవార్డు దక్కింది. ఆమ్‌స్టర్‌డ్యామ్‌ కేంద్రంగా ఉన్న 'ట్రాన్స్‌నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌' అనే సంస్థ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పై అవార్డును ప్రకటించింది. అవార్డు ప్రకటన సందర్భంగా 'సీఐటీయూ'-షోలాపూర్‌ విభాగం చేసిన రాజకీయ పోరాటాన్ని, కృషిని ప్రశంసించింది. తాగునీరు, ఇంధన సౌకర్యం, గృహ నిర్మాణం...విభాగాల్లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి స్ఫూర్తిదాయకమైన ఘటనల్ని ఎంట్రీలుగా స్వీకరించారు. ఆన్‌లైన్‌ పోలింగ్‌ ద్వారా 'హౌసింగ్‌' విభాగంలో షోలాపూర్‌ బీడీ కార్మికుల గృహ సముదాయానికి అత్యధిక ఓట్లు దక్కాయి.
''ఇది కేవలం ఓ పోటీలో గెలుచుకున్న అవార్డు కాదు. అభ్యుదయంతో కూడిన ఆలోచనల్ని పంచుకునేందుకు జరిపిన చొరవ ఇది. ఇలాంటి రాజకీయ ప్రయత్నాలకు మనమంతా సహకారం, సంఘీభావం పలకాలన్నది మా ఉద్దేశం. ప్రజలు, రాజకీయాలు కలిసి పనిచేయాలన్న నినాదాన్ని ఇవ్వడం కోసం ఈ అవార్డు ప్రకటించా''మని 'ట్రాన్స్‌నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌' ప్రతినిధి బెన్నీ కురువిల్లా తెలియజేశారు. 
ఎన్నో ఏండ్ల పోరాటం..
దుర్భరమైన పరిస్థితుల్లో, కనీస వసతులు లేకుండా బతుకు వెళ్లదీస్తున్న వేలాది బీడీ కార్మికుల్ని 'సీఐటీయూ' ఒక్కటిచేసింది. ఈ కార్మిక సంఘం నేతృత్వంలో 'బీడీ కార్మికుల కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ' ఏర్పాటైంది. హౌసింగ్‌ ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేయాల్సిందిగా 1990 నుంచి ఒక ఉద్యమంలాగా పోరాటం సాగింది. ఈ పోరాటానికి సోలాపూర్‌ (ఉత్తరం) నియోజికవర్గానికి మూడుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సీపీఐ(ఎం) నాయకుడు నర్సయ్య నాయకత్వం వహించారు. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 33శాతం కేంద్రం, మరో 33శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించగా, మిగతాదంతా లబ్ధిదారులు చెల్లించారు. 2006నాటికి వారి కల సాకారం అయ్యింది. షోలాపూర్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో 10వేల గృహాలతో కూడిన నివాస సముదాయం బీడీ కార్మికులకు అందుబాటులోకి వచ్చింది. ప్రాజెక్టు రెండో దశలో భాగంగా మరో 5,100 గృహాల్ని నిర్మించి..బీడీ కార్మికులకు అందజేశారు. 2015లో ఈ ప్రాజెక్టు పూర్తయింది. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం మరోమారు షోలాపూర్‌-సీఐటీయూ భారీ పోరాటాన్ని సాగించి...విజయాన్ని అందుకుంది. 32వేలమంది అసంఘటిత రంగ కార్మికులకు లబ్ధిచేకూర్చే భారీ గృహ సముదాయ నిర్మాణ ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఈ ఏడాది జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. 2021నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలన్నది లక్ష్యం.