సైంటొమెట్రిక్స్‌

09.06.2018

పాలకుల చూపు కుర్చీ, సుఖవినోదాల మీదే. తర్వాతే ప్రజలు. సామాజిక శాస్త్రజ్ఞులు గతాన్ని విశ్లేషించి భవిష్యత్తును అంచనా వేసి వర్తమానాన్ని నిర్ణయిస్తారు. వీరి సంఖ్యా, వాసీ తగ్గాయి. సామాజిక సైంటొమెట్రిక్స్‌ అవసరమైంది.
సైంటొమెట్రిక్స్‌: శాస్త్రసాంకేతికత, ఆవిష్కరణల కొలత, విశ్లేషణల అధ్యయన శాస్త్రమే సైంటొమెట్రిక్స్‌ (శాస్త్రీయాంశాల కొలమానం). 17వ శతాబ్దం నుండి శాస్త్రజ్ఞానం ఏడాదికి 4.7శాతం చొప్పున పెరుగుతోందని, శాస్త్రీయ సమాచారం 15ఏండ్లకు రెట్టింపవుతోందని బ్రిటిష్‌ భౌతికశాస్త్రవేత్త, విజ్ఞానశాస్త్ర చరిత్రకారుడు, సైంటొమెట్రిక్స్‌ పితామహుడు డెరెక్‌ జె.డి. సొల్ల ప్రైస్‌ 1960లో విశ్లేషించారు. నేటి నిర్ధారణలు భవిష్యత్తులో మారుతాయని ఈ శాస్త్రం చెపుతుంది. ప్లూటో ఒక గ్రహమని చదువుకున్నాం. సౌర వ్యవస్థ వెలుపలి ఎడ్జ్‌ వర్థ్‌ కూయిపర్‌ వృత్తాకార పట్టీలో ఇది మరుగుజ్జు గ్రహమని 2006లో నిర్ధారించారు. 60ఏండ్ల నాటి వైద్య శాస్త్రాంశాలకు నేడు కాలం చెల్లింది. 50ఏండ్లనాడు లేని ఎన్నో పరికరాలు ఆవిష్కరించబడ్డాయి. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, అత్యాధునిక యంత్రాలు అందులో కొన్ని. శాస్త్రవిజ్ఞానమంతా వేద పురాణాల్లో ఉందని వైదిక హైందవులు ప్రవచిస్తారు. ప్రజోపయోగ పరికరాలు మెరుగుపడతాయి. మాయమవవు. మా పాలన మహాద్భుతమని పాలకులంతా అంటారు. ఆలోచన, విశ్లేషణ, విచక్షణ నేర్పని యువత మోసపు మాటలను, మాయామాధ్యమాల దృశ్యాలను ప్రశ్నించకుండా నమ్ముతోంది. శాస్త్రవిజ్ఞానం, చదువు పెరిగాయి. ఆధ్యాత్మికతా పెరిగింది. కొత్త దేవుళ్ళు బాబాలు, అమ్మలు పెరిగారు. వీళ్ళకు పాలకులకు మధ్య నీకిది నాకది వాణిజ్యం విజృంభించింది. కులమత కుచ్చితాలు పెరిగాయి. కార్పొరేట్లూ పెరిగారు. రాజనీతిజ్ఞత మాయమై రాజకీయ విదూషకత్వం పెరిగింది. మతాధిపతులు, పాలకులు, కార్పొరేట్లు కలిసి ప్రజలను దోచుకుంటున్నారు. వివిధ నాయకులు సామాజికమార్పు అవసరాలను, సాధనా మార్గాలను చెప్పడం లేదు. ప్రజాప్రయోజన సామాజిక మార్పు కనుచూపు మేరలో లేదు. సామాజిక ప్రయోజకులెవరో, సమాజ వినాశకులెవరో ప్రజలు గుర్తించలేదు.
చరిత్రలో సైంటొమెట్రిక్స్‌ ఉపసిద్ధాంతం: పోర్చుగీసు అన్వేషకుడు వాస్కోడగామా ఇండియా వచ్చాడు. ప్రజల అమాయకత్వం, పాలకుల స్వార్థం ఆసరాగా సుగంధ ద్రవ్యాలూ అటవీ సంపద దోచుకెళ్ళాడు. భారతీయుల ధన, ప్రాణాలను సుఖ వినోదాలకు వాడుకున్నాడు. ప్రపంచీకరణ అప్పుడే మొదలైంది. 1602లో మొదటి బహుళజాతి కార్పొరేషన్‌ 'డచ్‌ ఇండియా కంపెనీ' ఏర్పాటైంది. కార్పొరేట్‌ అధీన ప్రపంచీకరణకు ఇది నాంది. 17వ శతాబ్దం తొలి దశలో ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చారు. 1612లో 'ఈస్ట్‌ ఇండియా కంపెనీ' వచ్చింది. 1757కు పాలనలో స్థిరపడింది. 1857 మొదటి స్వతంత్ర సమరం తర్వాత 1858లో భారత్‌ బ్రిటిష్‌ రాజ్యమైంది. 1947 దాకా రాజ్యమేలిన బ్రిటిష్‌ ప్రపంచీకరణ కొనసాగుతూనే ఉంది. 1945లో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ (తర్వాత గాట్‌-వాణిజ్య ధరవరల సాధారణ అంగీకారంగా మార్చబడింది.)ల ద్వారా అమెరికా ప్రపంచీకరణ ప్రపంచంతో పాటు ఇండియానూ ఆక్రమించింది. 1986లో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ప్రారంభమైంది. సోవియట్‌ ఉన్నంతకాలం దాని పప్పులుడకలేదు. సోవియట్‌ విచ్ఛిన్నం తర్వాత మనకు అమెరికా సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు నిశ్చితార్థం జరిగింది. 1994లో పెండ్లి అయింది. మా వస్తువులు, సేవలు లేకుండా మీరు బతకలేరని బెదిరించారు. వాటిని మా దేశసంతలో అమ్ముకోకపోతే మీ మనుగడే లేదని హెచ్చరించలేకపోయాం. మన పాలకపార్టీలన్నీ ఈ ఆర్థిక సంస్కరణల దోపిడీ అనుమతిస్తూనే ఉన్నాయి. మేము ప్రత్యేకమన్న సంఘీయులూ దీనికి అతీతం కాదు. సుశ్రుత ఆయుర్వేదం నిరాదరించబడింది. ఆర్యభట్ట గణిత, ఖగోళ శాస్త్రాలు పరాధీనమయ్యాయి. నలంద, తక్షశిలలు కాలగర్భంలో కలిశాయి. పురాణ ఊహాగాథలను శాస్త్రీయాంశాలుగా ప్రవచించే మతపాలకులు వీటిని పునరుద్ధరించరు. పునరుద్ధరించిన నలంద విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు అమర్త్యసేన్‌పై కక్ష తీర్చుకున్నారు.
సోషలిస్టు దేశాల, పాలకుల పేర్లతో సోషలిజాన్ని గుర్తించాం. ప్రజాస్వామ్య సోషలిజాన్ని పట్టించుకోలేదు. మార్చిన పేర్లతో సంఫ్‌ు సోషలిజాన్ని ప్రకటించింది. ఎమర్జెన్సీ సమర్థకులు, విమర్శకులూ సంఫ్‌ు బలపడ్డానికే ఉపయోగపడ్డారు. ఇందిర కూడా సంఘీయులను సంప్రదించవలసిన స్థితికి నెట్టబడ్డారు. ఎమర్జెన్సీతో లాభపడింది పరివారమే. అమెరికా ఆర్థికంపై ప్రభావం చూపే అణువిద్యుత్తు పరికరాల గోల ప్రజలకు పట్టలేదు. 2009 ఎన్నికల్లో అణునష్టాల ప్రచారం లేదు. తెలంగాణతో కేసీఆర్‌ కుర్చీ కోరుకున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ రాజకీయలబ్ది ఆశించాయి. పదేండ్ల కాంగ్రెస్‌ అధీనపాలన దేశాన్ని అధోగతిపాలుచేసింది. కుంభకోణాలతో ప్రజాధనాన్ని దోచేసింది. ప్రజలకు ప్రత్యామ్నాయం అవసరం. కాంగ్రెస్‌ పతనం ఖాయం. ప్రత్యామ్నాయులు ఈ దిశలో యోచించలేదు. సంఫ్‌ు గుజరాత్‌ ''అభివృద్ధిని'' అతిశయ ప్రచారం చేసుకుంది. ఆ ''ప్రగతి'' ప్రజావినాశకారి. సంపన్నుల ప్రయోజనకారి. మైనారిటీ మతాలను హింసించింది. ఆధిక్యమతాన్ని సమీకరించింది. ఈ క్రతువులో వేల ప్రాణాలను, లక్షల కోట్ల ప్రజాధనాన్ని హరించింది. ప్రగతి బండారాన్ని బట్టబయలుచేయలేదు. మోడీ కాంగ్రెస్‌ లోపాలను బాగా వాడుకున్నారు. ఫలితంగా దేశానికి నిరంకుశత్వం దాపురించింది. విద్య, వైద్య, సాహిత్య, సాంస్కతిక, పాత్రికేయ, పరిశోధన, నిఘా, ప్రజాస్వామ్య, రాజ్యాంగ, న్యాయవిభాగాలలో కాషాయాన్ని పులిమింది. సమాజాన్ని చీల్చింది. ఈ నియంతృత్వం భవిష్యత్తులో ఫాసిజం కానుంది. ప్రతిపక్షాలు అవకాశవాద రాజకీయాలను వదలలేదు. అపూర్వ, అనూహ్య కర్నాటక విజయం అపహాస్యమవుతోంది. జనం పాలకపక్ష మాయమాటల బూటకప్రచారంలో కొట్టుకుపోతోంది. దీర్ఘదార్శనికత లోపించింది. ప్రాప్తకాలజ్ఞత కొరవడింది. మే 31 ఉప ఎన్నికల ఫలితాలు కొంత ఉపశమనం కలిగించినా దీర్ఘసూత్రత తప్పదేమో!?
దార్శనికత: అజ్ఞానం, అమాయకత్వం సర్వవ్యాపితాలు. మనం ఎంతటి అజ్ఞానులమో తెలియకపోవడం విధ్వంసక అజ్ఞానం. దార్శనిక రాజకీయ దుష్ట మేధోశక్తికి ఇది ప్రధానావసరం. బహురంగ శాస్త్రజ్ఞులు సైంటొమెట్రిక్సో ప్రజాచైతన్యరథాన్ని నడపాలి. చైతన్యజనం రాజకీయ సామాజిక మార్పుకు నాంది పలకాలి. ప్రధానపాత్ర పోషించాలి.
ఒరెబ్రో, స్వీడెన్‌ నుంచి. 

- సంగిరెడ్డి హనుమంతరెడ్డి