హామీల అమలులో ప్రభుత్వం విఫలం - 27న కలెక్టరేట్‌ ముట్టడి: బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ మాజీదుల్లాఖాన్‌

26.06.2018

'ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆ హామీ లు అమలు చేయాలని, ప్రజల ఇబ్బందులు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలో ఈనెల 27న కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం. ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలి' అని బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ మాజీదుల్లాఖాన్‌ పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌ నగరంలోని బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సికింద్రాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ డీజీ నరసింహారావు, హైదరాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ ఎమ్‌డి. అబ్బాస్‌, సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడారు. నగరంలో ఇండ్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. నాలుగేండ్లుగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోందని చెప్పారు. పాతబస్తీలో అభివృద్ధి కుంటుపడిందని, మైనార్టీలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీజీ నరసింహారావు మాట్లాడుతూ.. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో వచ్చిన సమస్యల పరిష్కారానికి తహసీల్దార్‌, మున్సిపల్‌, ఆర్డీఓ కార్యాలయాలను ముట్టడించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని మండలాలు, జిల్లాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం, డ్రయినేజీ, ఉపాధి హామీ, ఆస్పత్రుల సమస్యలు ప్రధానంగా తమ దృష్టికి వచ్చాయన్నారు.
ఎమ్‌డి.అబ్బాస్‌ మాట్లాడుతూ.. నగరంలో ఇండ్ల కోసం పేదలు లక్షల్లో దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. ఏండ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న రాజీవ్‌గృహకల్ప, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే ఇండ్లను కేటాయించడంలో సర్కార్‌ విఫలమైందన్నారు. ఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనే ఇండ్ల కోసం పేదలు సుమారు ఏడు లక్షలకుపైగా దరఖాస్తు చేసుకున్నారని, గ్రేటర్‌లో మాత్రం లక్ష ఇండ్లు మాత్రమే నిర్మిస్తున్నారని అన్నారు. అడ్డగుట్టలో ఇండ్ల కోసం దరఖాస్తులు రాస్తున్న డీవైఎఫ్‌ఐ నగర కార్యదర్శి టి.మహేందర్‌ను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు.