600 హామీల్ని నెరవేర్చాం..మిగతావీ అమలు చేస్తాం.. - 28,000 పక్కా ఇండ్ల నిర్మాణం పూర్తి - రెండేండ్ల ప్రగతి నివేదికను విడుదల చేసిన కేరళలోని సీపీఐ(ఎం) ప్రభుత్వం

01.06.2018

అధికారం చేపట్టి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా సీపీఐ(ఎం) నేతృత్వంలోని కేరళ వామపక్ష ప్రభుత్వం ప్రగతి నివేదికను విడుదల చేసింది. పలు శాఖలు చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి నివేదికలో పేర్కొన్నారు. 59 అధ్యాయాలతో కూడిన నివేదికను ఆ రాష్ట్ర గవర్నర్‌ పి.సదాశివం విడుదల చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన 600 హామీలను పినరయి విజయన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం నెరవేర్చినట్టు ఆ నివేదిక తెలిపింది. 
రాష్ట్రంలోని నిరుపేదలకు లైఫ్‌ పథకంలో భాగంగా 28,000 పక్కా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసినట్టు నివేదిక తెలిపింది. 34,000 ఎకరాల వ్యవసాయ భూమిని వరి పంటకు అనుగుణంగా అభివృద్ధి పరిచినట్టు తెలిపింది. ఈ సందర్భంగా విజయన్‌ మాట్లాడుతూ మరో మూడేండ్ల పదవీకాలంలో మిగతా హామీలన్నిటినీ నెరవేర్చనున్నట్టు స్పష్టం చేశారు. గత(కాంగ్రెస్‌) ప్రభుత్వపు కుళ్లిపోయిన రాజకీయ సంస్కృతిని 2016లో తాము అధికారం చేపట్టిన తర్వాత మార్చివేశామని విజయన్‌ చెప్పారు. ప్రగతి నివేదికను వామపక్ష ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టి ప్రజల నుంచి అభిప్రాయాలను కోరింది.